తన పరిస్థితి మరొకరికి వద్దనీ!

మధ్యతరగతి అమ్మాయి.. నాన్న కష్టం చూస్తూ పెరిగింది. దీంతో మంచి స్థాయిలో నిలిచి, ఆయనకు చేదోడువాదోడుగా నిలవాలనుకుంది. చదువుకునేప్పుడే ఉద్యోగానుభవం కోసం ఇంటర్న్‌షిప్‌లో చేరింది. అక్కడ లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఆ తర్వాత

Updated : 05 Feb 2022 03:57 IST

మధ్యతరగతి అమ్మాయి.. నాన్న కష్టం చూస్తూ పెరిగింది. దీంతో మంచి స్థాయిలో నిలిచి, ఆయనకు చేదోడువాదోడుగా నిలవాలనుకుంది. చదువుకునేప్పుడే ఉద్యోగానుభవం కోసం ఇంటర్న్‌షిప్‌లో చేరింది. అక్కడ లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఆ తర్వాత ఉద్యోగంలో చేరాకా అదే పరిస్థితి. ఇక భరించలేను అనుకున్నాక ఉద్యోగం మానేసింది. ఎంతోమంది అమ్మాయిలకు తన పరిస్థితి ఎదురవకుండా కాపాడుతోంది.
శిఖా మిత్తల్‌.. ఇంతకీ ఏం చేస్తోంది?

శిఖాది దిల్లీ. నాన్న చిన్న చిన్న నిర్మాణాలను చేసేవాడు. ఓ చెల్లి, తమ్ముడు. నాన్న అర్ధరాత్రి ఇంటికి చేరుకుని తిరిగి ఉదయాన్నే పనిలోకి వెళ్లేవాడు. బాగా చదివి, మంచి ఉద్యోగం చేసి ఆయన కష్టం పంచుకోవాలన్నది శిఖా కల. హిస్టరీలో డిగ్రీ, ఐఐఎం బెంగళూరు నుంచి మాస్‌కమ్యూనికేషన్స్‌, ఆంత్రప్రెన్యూరియల్‌ స్టడీస్‌ల్లో డిప్లొమాలు చేసింది. చదువుతూనే ఇంటర్న్‌షిప్‌లు చేసేది. ఓ రేడియో స్టేషన్‌లో అవకాశమొచ్చింది. ఓరోజు తన పై అధికారి ఇంటి వద్ద దింపుతానని కారు ఎక్కించుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ‘అప్పటికే డిగ్రీ పూర్తైంది. అతని ఉద్దేశం అర్థమై బిగుసుకుపోయా. తెలియని భయం, కోపం. తేరుకొని వారించబోతే ‘ఇదంతా మామూలే. అలవాటవుతుంద’ంటూ వెకిలి నవ్వు. కారు సిగ్నల్‌ దగ్గర ఆగగానే డోరు తెరుచుకొని పారిపోయా’ అని ఆ భయానక పరిస్థితిని గుర్తు చేసుకుంటుంది శిఖా.

చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరాకా ఆమెకిలాంటి అనుభవాలెన్నో. పదోన్నతి, జీతంలో పెరుగుదల కావాలంటే లొంగక తప్పదన్న మాట విన్న ప్రతిసారీ రాజీనామా చేసేది. అలా ఎనిమిది మారాక ఉద్యోగమంటేనే విరక్తి వచ్చిందామెకు. తనలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమ్మాయిలకు అండగా నిలిచేలా సంస్థను ప్రారంభించాలనుకుంది. అలా 2010లో ‘బీ ఆర్ట్సీ’ని స్థాపించింది. ఇది లైంగిక వేధింపులు, వాటిని ఎలా ఎదుర్కోవాలో, వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగించే సంస్థ. గతంలో హెచ్‌ఆర్‌ విభాగంలో పనిచేసిన అనుభవంతో నెట్‌వర్క్‌ను ఏర్పరుచుకుంది. అలా మొదటి కార్యక్రమం పెప్సీకోలో నిర్వహించే అవకాశమొచ్చింది.

‘ఎన్నో సంస్థలను కలిశా. చాలామంది ఇదో సమస్యా అన్నట్లే చూసేవారు. చాలా సంస్థల్లో వీటిపై ఫిర్యాదు చేయడానికి సరైన విభాగమే లేదు. కొన్నింట్లో ఉన్నా.. నామమాత్రమే. నా ప్రోగ్రామ్‌ల ద్వారా వీటన్నింటిపై అవగాహన కల్పిస్తా. బాగా గుర్తుండేలా చిన్న నాటకాల ద్వారా వివరిస్తాం. మొదటి కార్యక్రమం నుంచే అభినందనలు అందుకున్నా. అలా అవకాశాలు వాటంతటవే వచ్చాయి. ఇప్పుడు దేశంలోని ఎన్నో సంస్థలు నన్ను నమ్ముతున్నాయి. నా ఒక్కదానితో మొదలైన దానిలో ఇప్పుడు 16 మంది ఉద్యోగులు, 14 భాషలకు చెందిన 800 మంది వివిధ కళాకారులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ 5000కుపైగా ప్రోగ్రామ్‌లు నిర్వహించా. పాతికవేలకుపైగా మందికి అవగాహన కల్పించా. వీటన్నింటికీ కొంత మొత్తాన్నీ తీసుకుంటా. ఈ ఏడాది టర్నోవర్‌ రూ.కోటిన్నరపైనే. ఇక్కడ రాబడి కంటే.. పని ప్రదేశంలో అమ్మాయిలను సురక్షితంగా ఉంచడంపైనే నా దృష్టంతా’ అంటోంది శిఖా. ఆమె సోదరుడు ఫ్యాషన్‌ డిజైనర్‌గా స్థిరపడితే.. చెల్లెలు క్యాన్సర్‌ రోగులకోసం విగ్‌లు తయారు చేస్తోంది. ఇలా తను కోరుకున్నట్టుగానే ఇటు కుటుంబానికీ, అటు ఎంతోమంది అమ్మాయిలకు అండగా నిలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్