అంతర్జాతీయ వేదికపై మన సౌమ్య!

ఏదోక ఉద్యోగం కాదు, ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకునేది లక్ష్మీ సౌమ్య. అల్జీమర్స్‌ వస్తే అన్నీ మర్చిపోతారనీ, కుటుంబ సభ్యుల్నీ గుర్తుపట్టలేరనీ తెలుసుకుని ఆశ్చర్యపోయిన ఆ అమ్మాయి దానిపైనే పరిశోధనలు చేసింది. తన పరిశోధనలకుగానూ అంతర్జాతీయ స్థాయిలో ‘యువ శాస్త్రవేత్త’ అవార్డునీ అందుకోనుంది 23 ఏళ్ల సౌమ్య....

Published : 02 May 2022 00:50 IST

ఏదోక ఉద్యోగం కాదు, ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకునేది లక్ష్మీ సౌమ్య. అల్జీమర్స్‌ వస్తే అన్నీ మర్చిపోతారనీ, కుటుంబ సభ్యుల్నీ గుర్తుపట్టలేరనీ తెలుసుకుని ఆశ్చర్యపోయిన ఆ అమ్మాయి దానిపైనే పరిశోధనలు చేసింది. తన పరిశోధనలకుగానూ అంతర్జాతీయ స్థాయిలో ‘యువ శాస్త్రవేత్త’ అవార్డునీ అందుకోనుంది 23 ఏళ్ల సౌమ్య.

నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని చిన్నప్పటి నుంచీ ఉండేది. అందుకే పోటీపరీక్షలేవైనా చురుగ్గా పాల్గొనేదాన్ని. నాన్న వెంకట రమణమూర్తి, అమ్మ నాగమణి. మాది కాకినాడ జిల్లా పిఠాపురం. పీజీ వరకూ ఇక్కడే చదివా. ప్రస్తుతం గుంటూరు కేఎల్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ మొదటి సంవత్సరం చేస్తున్నా. డిగ్రీ చదువుతున్నపుడ[ు అల్జీమర్స్‌ గురించి మొదటిసారి విన్నా. నా స్నేహితురాలి నానమ్మ ప్రతిదీ మర్చిపోయేది. ఇంట్లోవాళ్లనీ గుర్తుపట్టేది కాదు. దాంతో వాళ్లంతా చాలా ఇబ్బంది పడేవారు. ఆమెను చూశాకే అలాంటి సమస్య కూడా ఉంటుందని తెలిసింది. సహజమైన ఆసక్తితో అల్జీమర్స్‌ని గుర్తించడం, చికిత్స... ఈ కోణాల్లో కొంత అధ్యయనం చేశా. బయో మెడికల్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌.. ప్రొఫెసర్‌ జగన్నాథరావు దీనిపై పరిశోధనలు చేస్తున్నారని తెలిసింది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది ఈ సమస్య బారిన పడొచ్చన్న సమాచారం చదివాక ఆశ్చర్యంతోపాటు ఆందోళనా కలిగింది. అప్పుడే ఈ సమస్యపై పరిశోధన చేయాలనుకున్నా. ప్రొఫెసర్‌ జగన్నాథరావు సాయంతో మెదడులోని కణాలు ఎలా చనిపోతున్నాయన్న దానిపై పరిశోధన మొదలుపెట్టి థియరిటికల్‌, ప్రాక్టికల్‌ నమూనాల్ని రూపొందించా. వీటిని ‘ది ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ బయోకెమిస్ట్రీ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ వరల్డ్‌ కాన్ఫరెన్స్‌’కు పంపించా. ఈ సదస్సు ఈసారి(జులై) పోర్చుగల్‌లో జరుగుతోంది. ఆరోగ్యం, జబ్బులకు సంబంధించిన ప్రయోగాలు, ఫలితాలపై చర్చించే ఈ సదస్సులో యువశాస్త్రవేత్తలకూ మాట్లాడే అవకాశమిస్తారు. ప్రాజెక్టు ఎంపికయ్యాక ఇంటర్వ్యూ ఉంటుంది. దానిలోనూ నెగ్గినవారికి ‘యువశాస్త్రవేత్త’ అవార్డుని అందిస్తారు. ‘అత్యుత్తమ ఆలోచన’ పంపిన వారిని ఎంపిక చేసి, పది నిమిషాలు వేదికపై మాట్లాడే అవకాశం ఇస్తారు. ఈసారి ఆ అవకాశం అయిదుగురికి దక్కగా అందులో నేనూ ఉన్నా. ‘డీఎన్‌ఏ డైనమిక్స్‌ ఇన్‌ ఏజింగ్‌ అండ్‌ అల్జీమర్స్‌’ అంశంపై మాట్లాడనున్నా. ప్రపంచవ్యాప్త శాస్త్రవేత్తలను కలుసుకోబోతుండటం చాలా ఆనందంగా ఉంది. అల్జీమర్స్‌కు పరిష్కారం కనుక్కోవడంతోపాటు మెదడుకు సంబంధించిన సమస్యలపై పనిచేస్తూ గొప్ప శాస్త్రవేత్తగా ఎదగడం నా లక్ష్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్