Updated : 09/06/2022 23:38 IST

5 సార్లు విఫలమైనా నాన్న కల నెరవేర్చింది...

వ్యవసాయం, పిల్లల చదువుల కోసం చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకున్నాడామె తండ్రి. ఆయన మృతి ఆమెకో ఆశయాన్ని తెచ్చింది. తాను కలెక్టరై, తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చి, అలాంటి మరెందరో రైతులకు సేవలందించాలనుకుందామె. అయిదేళ్లకుపైగా అహోరాత్రులూ కష్టపడింది. తాజా యూపీఎస్‌సీ పరీక్షల్లో 308వ ర్యాంకుతో నాన్న కల నెరవేర్చిన అరుణ స్ఫూర్తి కథనమిది.

ఇంజినీరింగ్‌ చేసి చిన్న ఉద్యోగాన్ని సంపాదించి అమ్మానాన్నకు చేయూతగా ఉండాలనేదే ఆమె కల. నెలకు రూ.15 వేలు జీతమైతే చాలు అనుకుంది. అయితే జీవితం ఆమెకు మరో మార్గాన్ని నిర్దేశించింది. కర్నాటక తుమ్కూరు జిల్లాకు చెందిన అరుణది రైతు కుటుంబం. ఉన్నకొద్ది పొలాన్ని చూసుకుంటూ... అయిదుగురు పిల్లలను పెద్దచదువులు చదివించాలనుకున్నాడా నాన్న. తన పిల్లలందరినీ కలెక్టర్లుగా చూడాలని అనుకునేవాడు. రైతు కుటుంబం నుంచి వచ్చే కలెక్టర్లకే రైతుల కష్టాలు తెలుస్తాయనే వాడు. ఎంత శ్రమ పడైనా సరే కలెక్టరు కావడానికి కృషి చేయమని చెప్పేవాడు. అలా అరుణ ఇంజినీరింగ్‌లో చేరింది. అలు వ్యవసాయం,  ఇటు పిల్లల చదువులు ఆగకూడదంటూ అప్పులు చేసేవాడా తండ్రి. అనుకున్నట్లుగా పంట పండితే అప్పులు తీర్చేద్దామన్నది ఆయన ఆలోచన. అయితే అనుకున్నట్లుగా పంట రాకపోవడం, అప్పులు పెరిగి పోవడం ఆయన్ని ఆందోళనకు గురి చేశాయి. అప్పుల భారం మోయలేక చివరకు 2009లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మరణం అరుణను తీవ్ర కుంగుబాటుకు గురిచేసింది. అయిదుగురిలో తను మూడో సంతానం. తనతోపాటు మిగతా ఇద్దరూ విద్యార్థి దశలోనే ఉన్నారు. అరుణ అక్కలిద్దరూ చదువు పూర్తయి చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నారు. నాన్న లేకపోవడంతో ఆ బాధ్యతలను తాము తీసుకుంటామని, మిగతా వారిని చదువు కొనసాగించమని చెప్పారు. యూపీఎస్‌సీ పరీక్షకు హాజరై, ర్యాంకు సాధించి నాన్న కోరిక తీర్చమని అరుణను ప్రోత్సహించారు.

ఆరోసారి...

ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక 2014 నుంచి సివిల్స్‌ ప్రయత్నాలు ప్రారంభించింది అరుణ. ‘ఏటా రాయడం, ఉత్తీర్ణత పొందలేక పోవడం. అయినా సాధించాలనే ఆశయం మాత్రం నన్ను వదల్లేదు. అలా పరీక్షలు రాస్తూనే బెంగళూరులో ‘అరుణ అకాడమీ’ని స్థాపించా. గ్రామీణ ప్రాంతాల్లో యూపీఎస్‌సీ రాయాలనే ఆసక్తి ఉన్నవారి కోసం ఇది ప్రారంభించా. ఓవైపు నేను పరీక్షలకు సిద్ధపడుతూనే, ఆసక్తి ఉన్నవారికీ శిక్షణనిచ్చేదాన్ని. అలా 5సార్లు రాసినా ఫలితాన్ని సాధించలేకపోయా. చివరకు ఆరోసారి విజయాన్ని అందుకున్నా. ఈసారి ఫలితాలను చూడటానికి భయపడ్డా. వరుస వైఫల్యాలు భయపెట్టాయి. ఇక నాన్న అనుకున్నట్లుగా కలెక్టరు కాలేనేమో అనిపించింది. అయితే ఇప్పుడు 308వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. గ్రామాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణనిచ్చే నేను, ఇప్పుడు నాన్న కల కూడా నెరవేర్చగలిగా. ఇప్పుడు ఆయన ఆశయం నిజం కాబోతోంది. నాన్నకు నా విజయాన్ని అంకితమిస్తున్నా. రైతులకు చేయూతగా ఉండే సమాజాన్ని రూపొందించాలనే ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి కృషి చేస్తా’ అని చెప్పుకొస్తున్న అరుణ రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆ ప్రమాదం.. వ్యాపారవేత్తను చేసింది

సినిమా, కాలక్షేపం, స్నేహితులతో ముచ్చట్లు.. సందర్భం ఏదైనా మనకు చిరుతిళ్లు ఉండాల్సిందే! వాటిని నిల్వ ఉంచడానికి వాడే రసాయనాలు, చక్కెరలు, రిఫైన్డ్‌ ఆయిల్స్‌.. అన్నీ అనారోగ్యకరమైనవే! చదువుతున్నప్పుడు కంటే స్వీయ అనుభవంతో ఈ విషయం మరింత అవగాహనకు వచ్చింది అపూర్వ గురురాజ్‌కు. దీంతో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను ఉత్పత్తి చేస్తూ.. విదేశాలకూ ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. ఆమెను వసుంధర పలకరించగా తన గురించి చెప్పుకొచ్చారిలా.. మాది బెంగళూరు. ఆరేళ్లన్నప్పుడు అమ్మను కోల్పోయా. సివిల్‌ ఇంజినీర్‌ అయిన నాన్న వ్యాపారవేత్త కూడా. నాకేమో ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కావాలని.. నాన్నేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. రెండూ కాక కెమిస్ట్రీ, జువాలజీ, న్యూట్రిషన్‌లున్న ట్రిపుల్‌ మేజర్‌ కోర్సును ఎంచుకున్నా. అది చదివేప్పుడే ఎంటీఆర్‌, పెప్సీ సంస్థల్లో ఇంటర్న్‌గా ఉత్పత్తుల్లో పోషకాల ప్రమాణాల గురించి తెలుసుకున్నా. భారతీయ ఆహారశైలిలో పోషకాలకే ప్రాధాన్యం. కానీ మనకు లభ్యమయ్యే ప్యాకేజ్డ్‌ ఆహారంలో 90శాతం పాశ్చాత్యుల జీవనశైలికి అనువైనవే. పైగా వీటి నిల్వకు వాడే రసాయనాలు ఆరోగ్యానికి చేటని ఫీల్డ్‌వర్క్‌లో గుర్తించా. ఆసక్తికర విషయమేమిటంటే మన ధాన్యాలను ఎగుమతి చేసుకొని మనకే ఇలా అమ్ముతుండటం! అపోలో ఆస్పత్రిలో ఆంకాలజీ న్యూట్రిషన్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసినపుడు వీటిపై మరింత స్పష్టత వచ్చింది.

తరువాయి