లక్ష్యం కోసం బరువులెన్నో మోశా...
ఎవరెస్టునెక్కాలనే లక్ష్యసాధన ఆమెను యుక్తవయసులోనే షెర్పాగా తీర్చిదిద్దింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతశిఖరాలను పలుమార్లు అధిరోహించిన ఘనతను సాధించేలా చేసింది.
ఎవరెస్టునెక్కాలనే లక్ష్యసాధన ఆమెను యుక్తవయసులోనే షెర్పాగా తీర్చిదిద్దింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతశిఖరాలను పలుమార్లు అధిరోహించిన ఘనతను సాధించేలా చేసింది. నేపాల్‌లో ‘ఇంటర్నేషనల్ మౌంటెయిన్ గైడ్’గా పర్వతారోహకులకు శిక్షణనిస్తున్న 33 ఏళ్ల దవా యాంగ్జుమ్ కథనమిది.
ఎటుచూసినా ఆకాశాన్నంటినట్లుండే పర్వతాల మధ్య దవా పెరిగింది. నేపాల్‌లో రోల్‌వాలింగ్ అనే లోయలోని గ్రామం వీళ్లది. అక్కడ మగవారంతా పర్యాటకులకు ఎవరెస్టుని ఎక్కడంలో గైడ్స్‌గా వ్యవహరిస్తారు. అది చూసిన దవా ఈ వృత్తిలో మహిళలెందుకు రారని అనుకునేది. పెద్దైన తర్వాత ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలనే లక్ష్యంతోపాటు తమ గ్రామం నుంచి అతి ఎత్తైన పర్వతాలన్నీ ఎక్కిన మహిళగా నిలవాలనుకునేది.
ఆ బృందంతో..
పర్వతశ్రేణులు నన్ను రమ్మని పిలుస్తున్నట్లు అనిపించేది అంటారీమె. ‘ఓసారి మా ఊరికి ట్రెక్కింగ్ బృందం ఒకటి వచ్చింది. అప్పుడు నాకు 13 ఏళ్లు. వారికి సాయం చేస్తూ 6 రోజులు మంచులోనే నడిచా. అది నచ్చడంతో చదువు మానేసి అయిదేళ్లపాటు ఆ బృందాలతో వెళుతూ సంపాదించి ఇంటికిచ్చేదాన్ని. ఓసారి అన్నయ్య 15 రోజుల ట్రెక్ గురించి చెప్పి, వెళితే 100 డాలర్లు సంపాదించొచ్చన్నాడు. అలా ట్రెక్కింగ్ చేసేవాళ్లకు గైడ్‌గా మారి రెండేళ్లు పనిచేశానని’ చెబుతారు దవా.
కల తీరింది..
ట్రెక్కింగ్ బృందాలకు సారథ్యంవహిస్తూ, నేపాల్ మౌంటెనీరింగ్ అసోసియేషన్ ద్వారా పర్వతారోహణలో శిక్షణ తీసుకొన్నారీమె. ‘అప్పుడు నాకు 21 ఏళ్లు. నేషనల్ జాగ్రఫిక్ ఛానెల్ నిర్వహించిన ఎవరెస్టు యాత్రలో వర్కింగ్ గైడ్‌గా అవకాశం వచ్చింది. ఆ యాత్రలో 12మంది షెర్పాల్లో నేనొక్కదాన్నే మహిళను కావడం గర్వంగా అనిపించింది. బరువైన సామాను మోస్తూ, సప్లిమెంటరీ ఆక్సిజన్ సిలిండర్లను క్యాంపునకు చేర్చేదాన్ని. ఇది చాలా కష్టమైన ప్రయాణమని ముందుగానే తెలుసు. ఇటువంటి యాత్ర నేను సొంతంగా చేయడానికి స్పాన్సర్స్ లేకపోవడంతో ఇలా పనిచేస్తూ పర్వతారోహణకి సిద్ధపడ్డా. అప్పుడే అమెరికాకు చెందిన పర్వతారోహకురాలు ఎమిలీ హ్యారింగ్‌టన్ పరిచయమయ్యారు. తనతో కలిసి ఎవరెస్టు అధిరోహించి, నేపాల్ నుంచి ప్రపంచంలోనే అతిఎత్తైన పర్వతాన్ని ఎక్కిన తొలి మహిళగా నిలిచా. దాంతో నా కల నెరవేరిందంటారు’ దవా. 2009లో యాలాపీక్ శిఖరాగ్రం తన తొలి యాత్ర కాగా, రెండు సార్లు ఎవరెస్టు ఎక్కారీమె. 2019లో ప్రపంచంలో అయిదో ఎత్తైన మక్లూ పర్వతారోహణను 21 గంటల్లో పూర్తి చేశారు. 2021లో మంచు దట్టంగా కురిసే శీతాకాలంలో మనస్లు శిఖరాగ్రాన్నెక్కిన తొలి మహిళైన దవా 8వేల మీటర్ల ఎత్తుండే 14 పర్వతాలనెక్కి ‘మౌంటెనీరింగ్ ఐకాన్’గా నిలిచారు. సప్లిమెంటరీ ఆక్సిజన్ లేకుండానే అన్నపూర్ణ ఎక్కారీమె.
తొలి గైడ్‌గా..
నేపాల్‌లో మహిళాగైడ్స్ లేని లోటును పూడ్చడానికి దవా గైడింగ్ కోర్సులెన్నో చేశారు. పర్వతారోహణలో నైపుణ్యాలు, యాత్రలో కావాల్సిన మేనేజ్‌మెంట్ విధానాలు తెలుసుకున్నారు. ఆమ దబ్లం, యాలాపీక్, ఐలండ్ పీక్, అన్నపూర్ణ వంటివి సహా ప్రపంచంలోనే అతిఎత్తైన రెండో శిఖరం కే2 అధిరోహించారీమె. ‘పలు పరీక్షలు పాసై, ఇంటర్నేషనల్ మౌంటైన్ గైడ్‌గా ఎంపికయ్యా. నేపాల్ నుంచి తొలి మహిళాగైడ్ కావాలన్న లక్ష్యాన్ని సాధించా. ఇప్పటివరకు 500మందికిపైగా శిక్షణనిచ్చా. ఈ 14ఏళ్ల పర్వతారోహణ ప్రయాణం మరెందరో మహిళలకు మార్గనిర్దేశం చేసిందన్నప్పుడు గర్వంగా ఉంటుంది’ అంటోన్న దవా జీవితమెంతో స్ఫూర్తిదాయకం కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.