యూనిఫాంలో టీచరమ్మ!
బడి గంట మోగే వేళ అయ్యింది. పిల్లలంతా ఒక్కొక్కరుగా స్కూలుకి చేరుకుంటున్నారు. కానీ ఒక టీచర్‌ని చూసి విద్యార్థులే కాదు తోటి ఉపాధ్యాయులూ కంగు తిన్నారు.
బడి గంట మోగే వేళ అయ్యింది. పిల్లలంతా ఒక్కొక్కరుగా స్కూలుకి చేరుకుంటున్నారు. కానీ ఒక టీచర్‌ని చూసి విద్యార్థులే కాదు తోటి ఉపాధ్యాయులూ కంగు తిన్నారు. ఆమె కూడా స్కూల్ యూనిఫాంలోనే వచ్చింది మరి! ‘ఆమెందుకు ధరించింది?’ అదే అడిగారంతా.. దానికి ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు.. పాఠశాలలో పెద్ద మార్పునకూ దారితీసింది.
జాన్వీ యాదూ.. రాయ్‌పుర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. దాదాపు పదేళ్ల అనుభవం. టీచర్లంటే ఎంతసేపూ చదువు చెప్పడం, మార్కులొస్తున్నాయా అని చూడటానికే పరిమితమవకూడదు అంటారామె. ‘ఇక్కడ చాలామంది ఆర్థికంగా వెనకబడినవారే. స్కూలుకి వచ్చేప్పుడు అపరిశుభ్రంగా వచ్చేవారు. యూనిఫాంని భారంగా.. తప్పదు అన్నట్టు ధరించే విద్యార్థులే ఎక్కువ. నిజానికి దాని ఉద్దేశం విద్యార్థులంతా సమానమని చెప్పడమే కాదు.. క్రమశిక్షణకీ గుర్తు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ల తీరులో మార్పు లేదు. కొట్టినా, బెదిరించినా ప్రయోజనం లేదు. చిన్నపిల్లలు.. చెబితే కాదు చూసి ఎక్కువగా నేర్చుకుంటారని అనిపించింది. అందుకే నేనూ వాళ్లలాగే యూనిఫాం ధరించడం ప్రారంభించా’ అంటారు జాన్వీ. ఆమె అలా రావడం చూసి పిల్లలూ అనుసరించడం మొదలుపెట్టారట. అందుకే వారంలో కనీసం రెండుసార్లు ఈ విధంగానే వస్తున్నానంటారామె. ఇది వాళ్లు శుభ్రతను పాటించడానికే కాదు.. మంచి ప్రవర్తనకీ దారి తీస్తుంది అంటున్న జాన్వీ ఆలోచనని అభినందించాల్సిందే కదూ!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.