ముఖ సౌందర్యానికి తులసి...

చర్మసౌందర్యానికి తులసి ఆకుల ఫేస్‌ప్యాక్స్‌ ఉపయోగం ఎంతో!  యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మార్చగలవు. మచ్చలు, మొటిమలు, ఎండవల్ల కమిలిపోయే సమస్యలకు ఇది ఔషధంలా పనిచేస్తుంది.

Updated : 12 Mar 2022 05:42 IST

చర్మసౌందర్యానికి తులసి ఆకుల ఫేస్‌ప్యాక్స్‌ ఉపయోగం ఎంతో!  యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా మార్చగలవు. మచ్చలు, మొటిమలు, ఎండవల్ల కమిలిపోయే సమస్యలకు ఇది ఔషధంలా పనిచేస్తుంది.

రెండు గుప్పెళ్ల తులసి ఆకులకు గుప్పెడు వేపాకులు, చెంచా తేనె కలిపి గుజ్జుగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి లేపనంలా వేసి 20 నిమిషాలు  ఆరనిచ్చి శుభ్రం చేస్తే, చర్మ రంధ్రాల్లో పేరుకున్న నూనెతోపాటు మృత కణాలు తొలగుతాయి. మొటిమల సమస్య ఉండదు.
* రెండు చెంచాల టమాటా రసంలో గుప్పెడు తులసి ఆకుల గుజ్జును, పావుచెంచా పసుపు, రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్‌ లేదా వేప నూనె వేసి బాగా కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. ఇది కూడా మొటిమల సమస్యకు పరిష్కారంగా పని చేస్తుంది. రోజూ ఈ లేపనం వేస్తే ప్రయోజనం కనిపిస్తుంది.
* గుప్పెడు తులసి ఆకుల పేస్టుకు రెండు చెంచాల టమాటా రసాన్ని కలిపి ముఖానికి పట్టించి పావుగంట తర్వాత కడిగితే ముఖం తేమగా ఉంటుంది.
* చెంచా తులసి ఆకుల పేస్టుకు తలా చెంచా ముల్తానీ మట్టి, గులాబీ నీటిని కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రం చేస్తే మొటిమల వల్ల ఏర్పడే మచ్చలు దూరమవుతాయి.

మెరుపును.. రెండు చెంచాల తులసి ఆకుల గుజ్జుకు సమపాళ్లలో కలబందను కలిపి ముఖానికి రాసి అరగంట ఆరనివ్వాలి. చల్లని నీటితో శుభ్రం చేస్తే కొత్త మెరుపు వస్తుంది. గుప్పెడు తులసాకుల పేస్టుకు రెండు చెంచాల ఓట్‌మీల్‌, చెంచా మిల్క్‌ క్రీం కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగితే మృదువైన మెరుపులీనే చర్మం సొంతమవుతుంది. గుప్పెడు తులసి ఆకుల పేస్టుకు నాలుగు ద్రాక్ష పండ్ల గుజ్జు లేదా రసాన్ని కలిపి ముఖానికి రాసి అరగంట ఆరనిచ్చి కడిగితే కాంతివంతమవుతుంది. రెండు చెంచాల తులసి ఆకుల పేస్టుకు పావు చెంచా పసుపు, తగినంత గులాబీ నీటిని కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగినా చాలు చర్మం మృదువుగా మారుతుంది.  

పిగ్మంటేషన్‌ దూరం.. గుప్పెడు తులసి ఆకులను మెత్తని పేస్టుగా చేసి, చెంచా బొప్పాయి గుజ్జు కలిపి ముఖానికి రాసి 20 నిమిషాలు ఆరనిచ్చి కడిగితే ముఖంపై ఏర్పడిన పిగ్మెంటేషన్‌ మచ్చలు తగ్గుతాయి. చర్మ రంధ్రాల్లోని మురికిని దూరం చేసే ఔషధగుణాలు ఇందులో ఉంటాయి. దీర్ఘకాలంగా ఉన్న మచ్చలను పోగొట్టడానికి వారానికి రెండుసార్లు ఈ లేపనాన్ని వేసుకుంటే ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్