మీలోనూ.. ఒక దుర్గ!

ఇంటికి మహాలక్ష్మి.. జ్ఞానంలో సరస్వతి.. ఓర్పులో భూదేవి.. మహిళలకు ఉండే లక్షణాలను పోల్చే పోలికలే ఇవి! అయితే.. సహనం కోల్పోయినా.. కఠిన పరీక్షలు ఎదురైనా ఎదిరించి నిలబడే దుర్గమ్మలూ కావాలి! అదే దుర్గాతత్వం మనకు నేర్పే పాఠం! మహిషాసురుడు.. దానవరాజు. ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మరణం లేని వరం కోరుకున్నాడు.

Updated : 23 Oct 2023 03:48 IST

ఇంటికి మహాలక్ష్మి.. జ్ఞానంలో సరస్వతి.. ఓర్పులో భూదేవి.. మహిళలకు ఉండే లక్షణాలను పోల్చే పోలికలే ఇవి! అయితే.. సహనం కోల్పోయినా.. కఠిన పరీక్షలు ఎదురైనా ఎదిరించి నిలబడే దుర్గమ్మలూ కావాలి! అదే దుర్గాతత్వం మనకు నేర్పే పాఠం!

హిషాసురుడు.. దానవరాజు. ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మరణం లేని వరం కోరుకున్నాడు. కానీ.. మరణం అనివార్యమని బ్రహ్మ విస్పష్టం చేశాడు. అప్పుడు మహిషుడు స్త్రీలు అబలలు, అతి సుకుమారులు వారిని ఎదుర్కోవటం సునాయాసమన్న అహంకారంతో ‘స్వామీ! నాకు స్త్రీల చేతిలో తప్ప ఇంకెవరి వల్లా మరణం సంభవించకుండా వరాన్ని ప్రసాదించ’మన్నాడు. అలా వరాన్ని పొందాక మహిషాసురుడు మహిళలపై చిన్నచూపుతో, మదగర్వంతో విర్రవీగాడు. సమస్త లోకాల్ని హింసించాడు. త్రిమూర్తులు, దేవతలు ఆ రాక్షసుడి సంహారంపై సమాలోచించుకున్నారు. అప్పుడు సర్వదేవతాంశల నుంచి మహాతేజోపుంజం ఆవిర్భవించి, ఆదిపరాశక్తిగా అవతరించింది. ఆ దానవుడిని సంహరించింది. అలా మహిషాసురుడు తను తక్కువ అంచనా వేసిన స్త్రీమూర్తి చేతిలోనే పరాజితుడై, తల తెగి నేలకొరిగాడు. అందుకే ఆ దేవి ‘యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా...’ అని పూజలందుకుంటోంది. సమస్త మహిళాలోకం ఆ శక్తిని తమలో జాగృతం చేసుకోవాలని, నిత్యజీవితంలో మహిషాసురుడిని పోలిన సమస్యల రాక్షసుడితో పోరాడి అపరాజితలమని నిరూపించుకోవాలని విజయదశమి గుర్తుచేస్తోంది.


ఈ మూడూ కావాలి  

శారీరకం, మానసికం, ఆధ్యాత్మికం.. ఈ మూడు బలాలను సమన్వయ పరచుకుని ముందుకు సాగినప్పుడు అతివలు కుటుంబాల్లోనే కాదు కార్యక్షేత్రాల్లో కూడా అద్భుతంగా రాణించగలరు. అందుకే ఆ ఆదిపరాశక్తి సాధారణ సమయాల్లో లక్ష్మి, సరస్వతి, పార్వతిగా సౌమ్యరూపాల్లో కనిపించినా, అవసరమైన వేళల్లో, అసురసంహార సమయాల్లో మహాకాళిగా, దుర్గాదేవిగా ఉగ్రరూపాలనూ ప్రదర్శించింది. ఆధునికతరం అతివలూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రాకృతికంగా సహనానికి, క్షమాగుణానికి మహిళలు మారురూపాలైనా, వాటిని బలహీనతలుగా భావించి, ఎదుటివారు అవకాశంగా తీసుకుంటే ఆత్మగౌరవాన్ని ప్రదర్శించాలి. ఆత్మస్థైర్యంతో నిలబడాలి. ‘సర్వథా వ్యవహర్తవ్యం కుతో హ్యవచనీయతా. యథా స్త్రీణాం తథా వాచాం సాధుత్వే దుర్జనో జనః’ స్త్రీల సహజమైన మృదుస్వభావాన్నీ, కోమలత్వాన్నీ చూసి జనం ఆధిపత్యాన్ని చెలాయించటానికి ప్రయత్నిస్తారు. అందుకే మగువలు దృఢంగా, ధైర్యంగా వ్యవహరించాలి’ అంటోంది రామాయణం. కాబట్టి.. మగువలు అమ్మను స్ఫూర్తిగా తీసుకొని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలాలను బలగాలుగా మార్చుకోవాలి.. ఇచ్ఛాశక్తి, కార్యశక్తి, జ్ఞానశక్తితో మహోన్నత విజయాలను సాధించాలని ఈ విజయదశమి పర్వదినాన ఆశిద్దాం!


సంకల్పంతో శ్రీకారం...

గువలు శక్తిస్థానాలని పురాణాలు చెబుతున్నాయి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి.. ఏ కార్యం నిర్వహించాలన్నా ఈ మూడు శక్తులూ అవసరం. లక్ష్య సాధనకు కావాల్సిన సంకల్పం ఇచ్ఛాశక్తి, ఆ సంకల్పం కార్యరూపం దాల్చటానికి అవసరమైంది క్రియాశక్తి. కార్యనిర్వహణా కౌశలానికి సంబంధించింది జ్ఞానశక్తి. ఈ మూడు శక్తులకు మూలం ఆదిపరాశక్తి. ఆ పరాశక్తికి చెందిన ఈ మూడు మహత్తర శక్తులు వ్యక్తమైతే స్త్రీలు తాము అనుకున్న గమ్యానికి చేరుకోగలరని ఆ మహామాయాదేవి రాక్షస సంహారం ద్వారా నిరూపించింది. ఈ మూడుశక్తులు స్త్రీలకు అత్యధికమన్నారు స్వామి వివేకానంద. అందుకే ‘ఏదైనా గొప్ప కార్యాన్ని సాధించటానికి వందల మంది పురుషులకు ఏళ్ల సమయం పడితే, కొద్దిమంది స్త్రీమూర్తులు కొన్ని వారాల్లోనే సాధించగలర’ని అభిప్రాయపడ్డారు. పురుషుడి కన్నా ఆత్మనిగ్రహంలో, ఆత్మవిశ్వాసంలో స్త్రీ ఎన్నో రెట్లు అధికమని కొనియాడారు వివేకానంద. అందుకే తన ఆధ్యాత్మిక అన్వేషణలో గురువు రామకృష్ణ పరమహంసను ఎన్నో ప్రశ్నలు వేశారు, మరెన్నో విధాలుగా పరీక్షించారు కానీ గురుపత్ని శారదాదేవిని దర్శనం చేసుకున్న మరుక్షణంలోనే మూర్తీభవించిన సరస్వతిగా భావించారు. తదనంతర కాలంలో రామకృష్ణ సంఘ జననిగా ఆమె మార్గదర్శకత్వంలోనే మఠానికి శ్రీకారం చుట్టారు.

బి. సైదులు, రామకృష్ణ మఠం


వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్