అమ్మ ఆస్తిలో నాకు వాటా వస్తుందా?

మా అమ్మకు ముగ్గురం సంతానం. నాకు ఇద్దరు తమ్ముళ్లు. అందరి పెళ్లిళ్లూ అయిపోయాయి. అమ్మ చనిపోయి ఏడాదవుతోంది. తన పేరు మీద ఇల్లు, కొంత పొలం ఉన్నాయి. ఆ ఆస్తి అంతా తమ్ముళ్లకే చెందుతుందా... అందులో నాకేమైనా వాటా వస్తుందా?

Published : 12 Feb 2022 00:33 IST

మా అమ్మకు ముగ్గురం సంతానం. నాకు ఇద్దరు తమ్ముళ్లు. అందరి పెళ్లిళ్లూ అయిపోయాయి. అమ్మ చనిపోయి ఏడాదవుతోంది. తన పేరు మీద ఇల్లు, కొంత పొలం ఉన్నాయి. ఆ ఆస్తి అంతా తమ్ముళ్లకే చెందుతుందా... అందులో నాకేమైనా వాటా వస్తుందా?

- ఓ  సోదరి, హైదరాబాద్‌

మీ అమ్మగారు వీలునామా రాయకుండా చనిపోతే  ఆస్తిలో తమ్ముళ్లతోపాటు మీకూ వాటా వస్తుంది. వారసత్వ చట్టం-1956, సెక్షన్‌-14  ప్రకారం ఏదైనా ఆస్తి స్త్రీ పేరు మీదుంటే అంటే అది (ఆమె తల్లిదండ్రులు, భర్త, భాగస్వామ్యం, ఎవరి ద్వారా దాన రూపంలో వచ్చినదైనా; సొంతంగా సంపాదించినదైనా, పెళ్లికి ముందైనా తర్వాత అయినా, వీలునామా ద్వారా వచ్చినదైనా, స్థిర, చరాస్థులు అన్నీ) ఆమె స్వార్జితంగా భావించొచ్చు. కాబట్టి దాన్ని ఆమె ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకోవచ్చు. అలా ఇవ్వకుండా చనిపోతే ఆమె తదనంతరం హిందూ వారసత్వ చట్టం, సెక్షన్‌-15 ప్రకారం ఆమె పిల్లలకు (కొడుకులు, కూతుళ్లు), భర్తకు సమానంగా చెందుతాయి. ఒకవేళ పిల్లలు చనిపోతే వారి పిల్లలకు (మనుమలు, మనుమరాళ్లు) వస్తాయి. పిల్లలు, భర్తా లేకపోతే... భర్త తరఫువారికి చెందుతాయి. వారు కూడా లేకపోతే తల్లిదండ్రులకు వస్తాయి. అమ్మానాన్నలూ లేకపోతే తండ్రి తరఫు బంధువులకు చెందుతాయి. వారు లేకపోతే చివరగా తల్లి తరఫు బంధువులకు చెందుతాయి.

మీ విషయానికి వస్తే...

మీ తల్లిగారి ఆస్తి ఆమె తదనంతరం మీకూ చెందుతుంది. కాబట్టి మీకూ భాగం ఇవ్వమని అడగండి. వీలైతే మధ్యవర్తిత్వం ద్వారా ప్రయత్నించండి. వారు ఇవ్వడానికి నిరాకరిస్తే న్యాయస్థానంలో పార్టిషన్‌ దావా వేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని