అతడెప్పుడూ మా ఇంట్లోనే ఉంటాడు...

పెళ్లై రెండేళ్లయింది. మావారికి స్నేహితులంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఒక ఆప్త మిత్రుడున్నాడు. అతడికి ఇంకా పెళ్లవలేదు. ఏవో పరీక్షలకి సిద్ధమవుతున్నానని ఈమధ్య ఉద్యోగం మానేశాడు. చదువుకోవడానికి మా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందని ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు.

Published : 26 Jun 2023 00:33 IST

పెళ్లై రెండేళ్లయింది. మావారికి స్నేహితులంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఒక ఆప్త మిత్రుడున్నాడు. అతడికి ఇంకా పెళ్లవలేదు. ఏవో పరీక్షలకి సిద్ధమవుతున్నానని ఈమధ్య ఉద్యోగం మానేశాడు. చదువుకోవడానికి మా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందని ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు. ఆయన ఉన్నప్పుడు హుందాగా ఉంటాడు. లేనప్పుడు మాత్రం దగ్గరికి వస్తూ తేడాగా ప్రవర్తిస్తాడు. అత్తయ్య ఉన్నప్పుడు ధైర్యంగానే ఉంటుంది. కానీ ఆవిడ తరచుగా బావగారి ఇంటికి వెళ్తుంటారు. మావారు లేని సమయంలో అతనుంటే భయంగా ఉంటుంది. మావారికి చెప్పబోతే అతను ఉత్తముడు, నాకే లేనిపోని అనుమానం, నేను ఉన్నతంగా ఆలోచించడం లేదంటున్నారు.

- ఓ సోదరి, గుంటూరు

మీరొక స్త్రీ కనుక మీ భర్త స్నేహితుడి చూపుల్లో ఉన్న తేడాను గుర్తించి ఇబ్బంది పడుతున్నారు. కానీ మీవారు అది గ్రహించడం లేదు. ఆయనకు మిత్రుడంటే చాలా ఇష్టం, నమ్మకం ఉన్నాయని అర్థమవుతోంది. ఈ పరిస్థితిలో అతని మీద వ్యతిరేకత చూపినందువల్ల ప్రయోజనం లేదు. బహుశా అతన్ని ఇంటికి రావద్దని చెప్పమన్నా కోపం రావచ్చు. అందువల్ల అతనికి దగ్గరలో ఉండకుండా ఏదో ఒక పని కల్పించుకుని చేస్తుండండి. వీలైనప్పుడు ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతుండండి. బంధుమిత్రులను పిలవండి లేదా కొంతసేపు వాళ్ల ఇళ్లకు వెళ్లండి. లేదూ.. నచ్చిన ఏదైనా కోర్సులో చేరండి. సంగీతం లాంటి కళలు నేర్చుకోవడానికి వెళ్లండి. అమర్యాద చేసినట్లు కాకుండా మంచినీళ్లు, స్నాక్స్‌ లాంటివి అందుబాటులో ఉంచండి. ఇంట్లోనే ఉండి కాలం వృథా చేసేకంటే నైపుణ్యాలు పెంచుకోవడం అవసరమని వెళ్తున్నట్లుగా చెప్పండి. నిజంగానే మీ సమయం సద్వినియోగం అవుతుంది. ఇకమీదట అతని ప్రస్తావన తీసుకురాకుండా తెలివిగా వ్యవహరించండి. మీ వారు వచ్చే సమయానికి వచ్చేయండి. ఇలా వెళ్లేందుకు అవకాశం లేదంటే మీ గదిలో తలుపు గడియ పెట్టుకుని చదువుకోండి. భర్తగా అతను అర్థం చేసుకుని రక్షణ కల్పించనప్పుడు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్