close
Published : 19/03/2021 05:16 IST

ఆమె మనసు కుంచెకు తెలుసు...

‘ మీ పాప ఎక్కువ రోజులు బతకకపోవచ్చు...’డాక్టర్లు చెప్పిన ఆ మాటల్ని చిన్నారి తల్లిదండ్రులు నమ్మలేదు. సరికదా ఆ పాప ఏదో సాధిస్తుందని బలంగా విశ్వసించారు. ఆ నమ్మకమే నేడు ఆ అమ్మాయిని అంతర్జాతీయ చిత్రకారిణిగా మార్చింది. డౌన్స్‌సిండ్రోమ్‌తో పుట్టిన రాధిక వైకల్యాన్ని జయించి సాధించిన విజయాలు నేడు ఎందరిలోనో స్ఫూర్తిని నింపుతున్నాయి...

ముంబయిలోని వసంత్‌వ్యాలీ స్కూల్‌ అది. ఐదోతరగతి చదువుతున్న పిల్లలు వాళ్ల ఆర్ట్‌ టీచర్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్లాసులోకి ఆమె రాగానే అల్లరిమానేసి అంతా గప్‌చుప్‌ అయిపోయారు. ఆ టీచరమ్మ పిల్లలకి ప్రేమగా చిత్రలేఖన పాఠాలు చెబుతుంటే వాళ్లు కూడా మంత్రం వేసినట్టుగా వింటూ వర్ణాలతో విన్యాసాలు చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ విశేషం ఏంటంటే... చెప్పే టీచరే కాదు వింటున్న పిల్లలు కూడా దివ్యాంగులు కావడం. 45 ఏళ్ల రాధికాచంద్‌ డౌన్స్‌సిండ్రోమ్‌ని జయించి ఆ స్కూల్లో పదిహేనేళ్లుగా పాఠాలు చెబుతోంది.

ఆ పన్నెండు మందిలో...  డౌన్స్‌సిండ్రోమ్‌తో పుట్టిన రాధిక అంటే అమ్మానాన్నలు ఇందిర, రమేష్‌చంద్‌ ప్రాణం పెట్టేవారు. ఆమె పుట్టినప్పుడు ‘మీ పాప ఎక్కువరోజులు బతకదు..’ అని డాక్టర్లు చెప్పిన మాటలను వాళ్లు నమ్మలేదు. ఏదో ఆశ వారిని బలంగా ముందుకు నడిపించింది. ఆమెకున్న సమస్యని మర్చిపోయేలా చేసి బాగా చదివించాలనుకున్నారు. కానీ చిన్నారి రాధికను చేర్చుకోవడానికి నర్సరీ స్కూళ్లు నిరాకరించడంతో వాళ్లే గురువులై అ... ఆలు నేర్పారు. ప్రతి విషయాన్నీ ఓపిగ్గా ఆమెకు అర్థమయ్యేలా చెప్పేవారు. వాళ్ల కష్టం, ప్రేమ ఫలించింది. ఆ పాప చాలా విషయాలని తేలిగ్గానే అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అందుకే రాధికని హైస్కూల్‌లో చేర్పించగలిగారు. చదువుకంటే కూడా రాధిక బొమ్మలు వేయడానికే ఎక్కువ ఇష్టపడుతోందని తల్లిదండ్రులు గమనించారు. ఆ కళలో శిక్షణ ఇప్పించేందుకు ఆమెను ఆస్ట్రేలియా తీసుకెళ్లారు. విరిసిన వర్ణాల్లో తనదైన ప్రపంచాన్ని వెతుక్కుంది రాధిక. ఆ క్రమంలోనే తనకున్న సమస్యల్ని మర్చిపోయి.. తనలోని సామర్థ్యాలపై దృష్టి పెట్టింది. కళని ప్రాణంగా మలుచుకుంది. పాతికేళ్ల వయసులో ప్రతిష్ఠాత్మక ‘యమాగటా ఫెలోషిప్‌’కు ఎంపికై.. వాషింగ్టన్‌లో జరిగే ఆర్ట్‌ వర్క్‌షాపులో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యేందుకు ప్రపంచవ్యాప్తంగా 12 మంది మాత్రమే అర్హత సాధిస్తే అందులో రాధిక ఒకరు కావడం విశేషం. ప్రపంచ ప్రసిద్ధ కళాకారులు పాఠాలు చెప్పే ఈ వర్క్‌షాపులో తన చిత్రలేఖనాలను ప్రదర్శించే అరుదైన అవకాశాన్ని కూడా దక్కించుకుందామె. 

సేవలో... సాధారణంగా ఇటువంటి సమస్యలతో బాధపడేవారు తోటివారికి భారంగా అనిపిస్తారు. వాళ్లపనులు వాళ్లు చేసుకోగలిగితే చాలు అనుకుంటారు కన్నవాళ్లు, శిక్షకులు. కానీ రాధిక విషయంలో ఈ పరిస్థితి భిన్నం. తన చిత్రకళతో...వైకల్యం ఉన్న తోటివారికి సాయం చేస్తోంది. తన పెయింటింగ్‌ని రూ. 1,30,000కు విక్రయించి ఆ సొమ్ముని దివ్యాంగులకు అందించింది. రాధిక వేసే చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ముంబయి, దిల్లీతోపాటు న్యూయార్క్‌, జపాన్‌, ఇంగ్లండ్‌, అమెరికా, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌ వంటి విదేశాల్లో ఆమె తన చిత్రప్రదర్శనలు నిర్వహించింది. తన చిత్రాలు అమ్మగా వచ్చిన డబ్బుని ఎన్జీవోలకు విరాళంగా అందించేది. కేవలం డబ్బునే కాదు... తన కళని కూడా వారికి అందివ్వాలనుకుంది. అందుకే వసంత్‌ వ్యాలీ స్కూల్లో ఉపాధ్యాయినిగా మారింది. 15 ఏళ్లుగా ఇక్కడ చిన్నారులకు చిత్రలేఖనంలో పాఠాలు చెబుతోంది.
రాధికకు బొమ్మలు వేయడం మాత్రమే వచ్చు అనుకుంటే పొరపాటు. ఆమె క్రీడాకారిణి. సంగీతాన్ని సాధన చేసింది. తాను సంపాదించిన డబ్బుతో ఎలక్ట్రిక్‌ కారు రేవాను కొనుక్కుని సొంతంగా డ్రైవ్‌ చేస్తుంది. ‘అందరిలా నేను పుట్టలేదు. కానీ అమ్మానాన్న నన్ను ప్రేమగా చూసుకునేవారు. అమ్మ నాకు నీడలా ఉండేది. ఆమె చొరవ వల్లనే నేను సైకిల్‌ తొక్కడం, ఈత కొట్టడం, గుర్రపుస్వారీ, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, స్క్వాష్‌ వంటివన్నీ నేర్చుకున్నాను. మన సంప్రదాయ వంటల్నేకాదు, విదేశీవంటకాలనూ చక్కగా వండుతాను’ అనే రాధిక ‘ఎన్‌సీపీఈడీపీ- షెల్‌ హెలెన్‌కెల్లర్‌ అవార్డు’ అందుకుని ఎందరిలోనో స్ఫూర్తిని రగిలిస్తోంది.


Advertisement

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి