50 దాటారా? అయితే ఇవి పాటించాల్సిందే!

వయసు పెరిగే కొద్దీ శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా 50 దాటిన మహిళల్లో శారీరక మార్పులతో పాటు హార్మోన్ల స్థాయుల్లోనూ తగ్గుదల గమనించచ్చు. వీటి ప్రభావంతో నెలసరి ఆగిపోవడం, మెనోపాజ్‌ దరిచేరడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలూ వేధిస్తుంటాయి.

Published : 24 Jan 2024 12:25 IST

వయసు పెరిగే కొద్దీ శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా 50 దాటిన మహిళల్లో శారీరక మార్పులతో పాటు హార్మోన్ల స్థాయుల్లోనూ తగ్గుదల గమనించచ్చు. వీటి ప్రభావంతో నెలసరి ఆగిపోవడం, మెనోపాజ్‌ దరిచేరడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలూ వేధిస్తుంటాయి. అయితే ఇలాంటి పరిస్థితిలో నీరసించిపోకుండా యాక్టివ్‌గా ఉండాలంటే తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేర్పులు చేసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఎలాంటి సమస్యలొస్తాయి?

⚛ సాధారణంగా 50 దాటిన మహిళల్లో సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషించే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా నెలసరి ఆగిపోవడం, మెనోపాజ్‌ దశలోకి ప్రవేశించడం.. వంటివి జరుగుతాయి. ఇక వీటి కారణంగా వేడి ఆవిర్లు, రాత్రుళ్లు ఉన్నట్లుండి చెమటలు పట్టడం, నిద్రలేమి, ఒత్తిడి.. వంటి దుష్ప్రభావాలు శారీరకంగా, మానసికంగా కుంగదీస్తాయి.

⚛ పిట్యుటరీ గ్రంథి విడుదల చేసే ‘ఫాలికల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (FSH)’ అండోత్పత్తిలో, లైంగిక కోరికల్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే 50 దాటిన మహిళల్లో ఈ హార్మోన్‌ ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతుంది. తద్వారా ఈ వయసులో సంతాన సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు శృంగార కోరికలూ అడుగంటిపోతాయి. ఈ క్రమంలోనే చాలామంది మహిళలు ఈ వయసులో వెజైనా పొడిబారిపోవడం, శృంగారంపై ఆసక్తి లేకపోవడం.. వంటి ఫిర్యాదులతో సంబంధిత నిపుణుల్ని సంప్రదిస్తుంటారు.

⚛ శరీరంలో ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల స్థాయుల్లో తగ్గుదల రోగనిరోధక వ్యవస్థ పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో రోగనిరోధక కణాల్ని ఉత్పత్తి చేసే సైటోకైన్ల స్థాయులు అదుపు తప్పుతాయి. ఫలితంగా శరీరంలో వాపు, త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడడంతో పాటు కొంతమందికి ఆటోఇమ్యూన్‌ వ్యాధుల ముప్పూ పొంచి ఉందంటున్నారు నిపుణులు.

⚛ 50 దాటిన మహిళల్లో క్యాల్షియం స్థాయులు కూడా క్షీణిస్తాయి. తద్వారా ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎముకలు బలహీనపడి విరిగిపోవడం, ఆస్టియోపొరోసిస్‌, కీళ్ల సమస్యలూ కొంతమందిలో తలెత్తుతుంటాయి.

⚛ 30 దాటినప్పట్నుంచి.. ప్రతి పదేళ్లకోసారి కండరాల సామర్థ్యం 5-8 శాతం తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలు, గుండె సమస్యలు, అలసట, నీరసం, నాడీ సంబంధిత సమస్యలు.. వంటివి తలెత్తే ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు.

⚛ వయసు పైబడుతున్న కొద్దీ గుండె సంబంధిత సమస్యలూ మహిళలపై దాడి చేసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇందుకు శరీరంలో ఈస్ట్రోజెన్‌ స్థాయుల ఉత్పత్తి తగ్గిపోవడమే కారణమంటున్నారు.

⚛ ఇక ఈ వయసులో మెనోపాజ్‌ కారణంగా మహిళలు క్రమంగా బరువు పెరిగి.. దీర్ఘకాలంలో ఇది ఊబకాయానికి దారి తీసే ప్రమాదం ఉందంటున్నారు.

⚛ అయితే వయసుకు, మధుమేహానికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. 50 దాటిన మహిళల్లో మెనోపాజ్‌ కారణంగా బరువు పెరిగిపోవడం, అధిక రక్తపోటు వంటి సమస్యలొస్తుంటాయి. కొంతమందిలో ఇవి పరోక్షంగా టైప్‌-2 మధుమేహానికి దారితీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

ఆహారంతో ఉత్సాహంగా!

50 దాటిన మహిళల్లో తలెత్తే ఈ ఆరోగ్య సమస్యల్ని అధిగమించి.. తిరిగి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ముందుకు సాగాలంటే అందులో ఆహారం పాత్ర కీలకమంటున్నారు నిపుణులు. అందుకే రోజువారీ తీసుకునే ఆహారంలో కొన్ని పదార్థాలుండేలా చూసుకోవడం ముఖ్యమంటున్నారు. అవేంటంటే..!

⚛ ఈ వయసులో శరీరంలో వాపు, ఇతర నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే అల్లాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

⚛ 50 దాటిన మహిళల్లో గుండె ఆరోగ్యానికి నట్స్‌, పప్పు దినుసులు చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే మొక్కల ఆధారిత ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు వివిధ రకాల గుండె సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి.

⚛ వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు కూడా క్రమంగా తగ్గుతుంటుంది. ఫలితంగా మతిమరుపు, ప్రవర్తనా లోపాలు వస్తుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ముందు నుంచే బెర్రీ పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో ఉండే ఆంథోసయనిన్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ సమ్మేళనాలు మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి.

⚛ ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా వీటి నుంచి అందే క్యాల్షియం, విటమిన్‌ ‘కె’ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి అవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకుంటూనే.. ఆకుకూరల్నీ రోజువారీ మెనూలో చేర్చుకోవాలి.

⚛ ఇక ఈ వయసులో రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే వెల్లుల్లి, పసుపు, పాలు-పాల పదార్థాలు, పుట్టగొడుగులు, మాంసం, చేపలు, కోడిగుడ్లు.. వంటివి తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.

⚛ 50 దాటిన మహిళల్లో మెనోపాజ్‌ కారణంగా పెరిగే బరువును తగ్గించుకోవడానికి గ్రీన్‌ టీ చక్కటి పరిష్కారం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు, పాలీఫినోల్స్‌.. బరువును అదుపులో ఉంచడంతో పాటు క్యాన్సర్, మధుమేహం.. వంటి దీర్ఘకాలిక సమస్యలు రాకుండా కాపాడతాయి.

⚛ ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలు మెనోపాజ్‌ వల్ల తలెత్తే దుష్ప్రభావాల్ని తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ పోషకం ఎక్కువగా లభించే పాలు-పాల పదార్థాలు, తృణధాన్యాలు, బాదం పప్పులు, క్వినోవా.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

ఇలా ఈ ఆహార పదార్థాలు రోజూ తీసుకోవడంతో పాటు.. నిపుణుల సలహా మేరకు చక్కటి వ్యాయామ రొటీన్‌ని కూడా అలవాటు చేసుకుంటే.. 50 ఏళ్లు దాటినా ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చురుగ్గా ఉండచ్చు. అలాగే ఈ వయసులో తలెత్తే చిన్న చిన్న ఆరోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా.. వైద్యుల్ని సంప్రదించి వారు సూచించిన సలహాలు, చిట్కాలు పాటిస్తే ఇక ఆరోగ్యానికి తిరుగుండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్