విలాసాల కోసం ఏమైనా చేస్తారట!

మా మేనత్త కొడుక్కి ఆడవాళ్లంటే చిన్నచూపు. విలాసాల కోసం ఏమైనా చేస్తారంటూ అవమానిస్తాడు. ఇలాంటి వాళ్లని మార్చడమెలా?

Published : 13 Feb 2023 00:31 IST

మా మేనత్త కొడుక్కి ఆడవాళ్లంటే చిన్నచూపు. విలాసాల కోసం ఏమైనా చేస్తారంటూ అవమానిస్తాడు. ఇలాంటి వాళ్లని మార్చడమెలా?

- ఓ సోదరి

పురాణాల్లోని అంశాలను ప్రామాణికంగా తీసుకుని, పురుషాధిక్య భావజాలాన్ని ఒంట పట్టించుకుంటారు కొందరు. స్త్రీని వ్యక్తిలా గాక వస్తువులా భావిస్తూ ఇంటికి పరిమితం చేయాలనుకుంటారు. ప్రస్తుత కాలానికి తగ్గట్టు మారడాన్ని జీర్ణించుకోలేరు. పురుషులే అన్నీ చక్కబెట్టాలి, వాళ్లే సమర్థులు అనుకుంటారు. న్యూనత, అభద్రతలతో బాధపడేవారే.. స్త్రీలు ఉన్నత స్థితిలో ఉంటే తట్టుకోలేక చులకన చేస్తారు. తమను సమర్థించుకునేందుకు ఏవో ఉదహరిస్తారు. స్వతంత్రంగా ఉంటే పురుషుల్ని ఆకర్షిస్తున్నారు, సమాజాన్ని పాడుచేస్తున్నారు- అంటూ దుష్ప్రచారం చేస్తారు. చదువూ తెలివితేటలతో తమను తాము వ్యక్తం చేసుకుంటున్నారనే సద్భావన లేకుండా హేళన చేస్తారు. నేటి కంప్యూటర్‌ యుగంలో కూడా ఆడవాళ్లు తమ చెప్పుచేతల్లో ఉండాలంటారు. స్త్రీలు తమ కంటే మెరుగ్గా ఉంటే ఓర్వలేక.. ఉండకూడని లక్షణాలున్నాయి, ఉండాల్సినవి లేవు అంటూ- అవమానిస్తారు. ఈ రోజుల్లో స్త్రీలు ఇంట్లో కూర్చోలేరు. దేశ కాల పరిస్థితులకు తగ్గట్టు వస్త్రధారణలో, ఆలోచనల్లో మార్పు సహజం. అది గ్రహించకుండా మూర్ఖంగా మాట్లాడి, అణిగిమణిగి ఉండమంటే కుదరదు. కొందరు స్త్రీలు ఇప్పటికీ మగవాళ్ల ఆధిక్యతను ఆమోదించి అనుసరించడం వల్ల అందుకు వ్యతిరేకంగా ఉన్నవారిని సహించలేకపోతున్నారు. నిజానికి స్త్రీపురుషులిద్దరూ సమంగా ఉంటేనే సమాజం సవ్యంగా నడుస్తుంది. కనుక ఇలాంటివాళ్లను పట్టించుకోనవసరం లేదు. మార్పు ఎటూ వస్తుంది. దాన్నెవరూ ఆపలేరు. వాళ్లతో వాదించినా ప్రయోజనం లేదు. తమకెదురైన అనుభవాలతో భవిష్యత్తులో పాఠం నేర్చుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్