Published : 23/12/2021 20:49 IST

ఈ జ్యూస్‌లతో ఇమ్యూనిటీ పెంచుకుందాం!

నిత్యం మన శరీరంపై ఎన్నో రకాల వైరస్‌లు దాడి చేస్తుంటాయి. ఇది సర్వసాధారణమైన విషయమే అయినప్పటికీ.. అందులో చాలా వాటిని మన రోగ నిరోధక శక్తే అంతం చేస్తుంటుంది. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడే వ్యాధులు ప్రబలడం ఎక్కువవుతుంది. అందుకే చక్కటి పోషకాహారం తీసుకోవడం వల్ల సహజంగానే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్‌ మళ్లీ ఉధృతమవుతోన్న వేళ తీసుకునే ఆహారం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రోగనిరోధక శక్తిని పెంచే కొన్ని జ్యూస్‌లు క్రమం తప్పకుండా తీసుకోమంటున్నారు.

పుచ్చకాయ రసం..

నీటి శాతం అధికంగా ఉండే ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఏవైనా ఇన్ఫెక్షన్ల బారిన పడినప్పుడు కలిగే కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఎ, సి విటమిన్లతో పాటు మెగ్నీషియం, జింక్‌ వంటి పోషకాలు మిళితం అయిన ఈ పండును నేరుగా తినడం ఇష్టం లేని వారు రసం చేసుకొని కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ పండులోని గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వాటిని తొలగించకుండానే జ్యూస్‌ చేసుకోవచ్చు. ఈ జ్యూస్‌లో కూడా చక్కెరకు బదులుగా తేనె వాడడం మరీ మంచిది.

టొమాటో జ్యూస్‌

దాదాపు అన్ని కూరలకు మరింత రుచిని అందించడానికి కనీసం రెండు టొమాటోలైనా వేయడం మనకు అలవాటే. సీజన్‌ ఏదైనా మార్కెట్లో ఇవి విరివిగా లభిస్తాయి కూడా! టొమాటోలో పుష్కలంగా నిక్షిప్తమై ఉన్న సి, ఇ విటమిన్లు, బీటా కెరోటిన్‌.. వంటి పోషకాలు ఫ్రీరాడికల్స్‌ రోగనిరోధక శక్తిపై దాడి చేసి కణాల్ని దెబ్బతీయకుండా కాపాడతాయి. రోజుకు ఒక గ్లాస్‌ టొమాటో జ్యూస్‌ను తీసుకుంటే రోగనిరోధక శక్తి మెరుగుపడడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

నిమ్మజాతి పండ్లతో..

కమలాఫలం, ద్రాక్ష, నిమ్మకాయ.. లాంటి నిమ్మజాతి పండ్లలో విటమిన్‌ ‘సి’ పుష్కలంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. శరీరంపై దాడి చేసే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లను తరిమికొట్టడంలో విటమిన్‌ సి ముఖ్య పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటు కొన్ని రకాల వైరల్‌ ఇన్ఫెక్షన్లను విటమిన్‌ సితో చెక్‌ పెట్టవచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఏ అనారోగ్యాన్నైనా త్వరగా నయం చేయడంలో చురుగ్గా పనిచేస్తుందీ విటమిన్‌. అందుకే ఈ విటమిన్‌ పుష్కలంగా లభించే నిమ్మజాతి పండ్లతో తయారుచేసిన జ్యూస్‌లను తరచూ తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బీట్‌రూట్‌, క్యారట్‌ జ్యూస్‌..

బీట్‌రూట్‌, క్యారట్‌లలో విటమిన్‌ ‘ఎ’, ‘సి’, ‘ఇ’లతో పాటు ఐరన్‌, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇక ఈ జ్యూస్‌లలో కొంచెం పసుపు, అల్లం లాంటివి జత చేయడం ద్వారా జలుబు, దగ్గు వంటి వాటికి కూడా చెక్‌ పెట్టవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు కూడా ఈ జ్యూస్‌ని కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు.

యాపిల్‌, క్యారట్, ఆరెంజ్‌ల మిశ్రమం..

యాపిల్‌, క్యారట్‌, ఆరెంజ్‌లతో కలిపి చేసిన జ్యూస్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఈ జ్యూస్‌ ఎంతో ఉపయోగపడుతుంది. వీటిలోని ‘ఎ’, ‘బి-6’.. వంటి విటమిన్లతో పాటు పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌లు రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదం చేస్తాయి.

గ్రీన్‌ జ్యూస్‌..

ఆకుపచ్చ రంగులో ఉండే పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అలాగే గ్రీన్‌ యాపిల్‌, పాలకూర, కీరా, నిమ్మకాయ, అల్లం.. వంటి వాటితో తయారుచేసే గ్రీన్‌ జ్యూస్‌ రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వీటిలో ఉండే ‘ఎ’, ‘సి’, ‘బి-6’ విటమిన్లతో పాటు ఐరన్‌, క్యాల్షియం.. వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అలాగే వీటితో పాటు కివి-స్ట్రాబెర్రీ, కివి-మామిడి, గుమ్మడి గింజల జ్యూస్‌.. వంటి రసాలు కూడా అటు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇటు ఎలాంటి అనారోగ్యాలతోనైనా ఇట్టే పోరాడే శక్తిని మనకు అందిస్తాయి. సో.. ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఇలాంటి జ్యూస్‌లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఈ మహమ్మారితో ధైర్యంగా పోరాడచ్చు.. ఏమంటారు?


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని