అందుకే అమ్మకు మళ్లీ పెళ్లి చేశాం!

‘భరించేవాడే భర్త’ అంటుంటారు.. కానీ కట్టుకున్న వాడు రాచిరంపాన పెడుతున్నా.. ఓపికతో సహించాలంటారు కొంతమంది.  ఇక విధిలేక అలాంటి వాళ్లతో విడిపోవడానికి నిర్ణయించుకుంటే బరితెగించిందన్న ముద్ర పడిపోతుంది. తన తప్పు లేకపోయినా సమాజం అనే సూటిపోటి మాటలు భరిస్తూ.. ఒంటరిగా పిల్లల బాధ్యతల్ని మోస్తూ ఆమె పడే యాతన అంతా ఇంతా కాదు.

Updated : 29 Feb 2024 17:13 IST

‘భరించేవాడే భర్త’ అంటుంటారు.. కానీ కట్టుకున్న వాడు రాచిరంపాన పెడుతున్నా.. ఓపికతో సహించాలంటారు కొంతమంది.  ఇక విధిలేక అలాంటి వాళ్లతో విడిపోవడానికి నిర్ణయించుకుంటే బరితెగించిందన్న ముద్ర పడిపోతుంది. తన తప్పు లేకపోయినా సమాజం అనే సూటిపోటి మాటలు భరిస్తూ.. ఒంటరిగా పిల్లల బాధ్యతల్ని మోస్తూ ఆమె పడే యాతన అంతా ఇంతా కాదు. తన తల్లి జీవితంలోనూ ఇలాంటి కష్టాలున్నాయంటోంది సాహితి. తాము జీవితంలో సెటిలయ్యాక తన తల్లి ఒంటరి కాకూడదన్న ఉద్దేశంతో ఆమెకు మళ్లీ వివాహం చేశానంటోందామె. అయితే ఇక్కడా తన నిర్ణయానికి సమాజం అడ్డుపడాలని చూసిందని, అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లి మంచి పని చేశానన్న సంతృప్తి తనకు మిగిలిందంటూ.. తన తల్లి జీవితంలోని కష్టాల కడలిని ఇలా మన ముందుంచింది.

‘అనుభవించిన వాళ్లకే కష్టాల విలువ తెలుస్తుందం’టుంటారు. అయితే ఈ విషయం తెలిసినా.. చుట్టూ ఉన్న వాళ్లు తలా ఓ మాటంటూ వారిని మరింత బాధలోకి నెట్టేస్తుంటారు. ఇలా తమ మనసులో ఉన్నది కక్కేసి కసి తీర్చుకుంటారే తప్ప.. ఇలాంటి మాటలు అవతలి వారిని బాధపెడతాయేమోన్న కనీస ఆలోచన కూడా వారికి ఉండదు. నాకు ఊహ తెలిసినప్పట్నుంచి ఇరుగు పొరుగు, బంధువుల దగ్గర్నుంచి మా అమ్మ కూడా ఎన్నో మాటలు పడింది. వాటన్నింటినీ మౌనంగా భరిస్తూ నవ్వుతూ మమ్మల్ని పలకరించేదే తప్ప తిరిగి ఈ సమాజాన్ని ఒక్క మాటా అన్నది లేదు. ఇంతకీ తన జీవితంలో ఏం జరిగిందంటే..!

******

ముగ్గురు అక్కచెల్లెళ్లవడం, అందులోనూ మా అమ్మే పెద్దది కావడంతో తనకు 15వ ఏటే పెళ్లి చేశారట మా అమ్మమ్మ-తాతయ్య. అలాగని చదువుపై తనకున్న మమకారాన్ని మాత్రం మర్చిపోలేదు. పెళ్లయ్యాక ఎలాగోలా కష్టపడి ఇంటర్‌ పూర్తిచేసింది. ఇక ఆ తర్వాత మూడేళ్ల వ్యవధిలోనే నేను, చెల్లి పుట్టాం. మా ఇద్దరి బాధ్యతలు మీద పడడంతో పైచదువులకు నోచుకోలేకపోయింది అమ్మ. ఇదంతా నాకు ఊహ తెలియక ముందు అమ్మ చెప్పిన కథ.

ఇక చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించే శక్తి వచ్చాక నేను తెలుసుకున్న ఓ భయంకరమైన నిజం.. నాన్న శాడిజం గురించి! రోజూ తాగి ఇంటికి రావడం, ఏదో ఒక విషయం లేవనెత్తి అమ్మను కావాలనే మాటలతో హింసించడం.. ఒక్కోసారి చేయి చేసుకోవడం.. ఇదీ రాత్రి ఇంటికొచ్చాక నాన్న వరుస. అయితే అప్పటికే నేను, చెల్లి నిద్రపోవడం వల్ల కొంత వయసొచ్చేదాకా వీటి గురించి మేం తెలుసుకోలేకపోయాం. ఇలా రాత్రి అమ్మతో గొడవ పడినా.. ఉదయం నిద్ర లేవగానే ఏమీ తెలియనట్లు మమ్మల్ని ప్రేమగా దగ్గరికి తీసుకోవడంతో ఆయన కారణంగా అమ్మ పడే ఇబ్బందుల్ని మేం గ్రహించలేకపోయాం.

అయితే ఓ రోజు రాత్రి రోజూలాగే నాన్న తాగొచ్చాడు. మరుసటి రోజు పరీక్ష ఉండడంతో నేను నా గదిలో తలుపేసుకొని చదువుకుంటున్నా. ఆ రోజు తెలిసింది ‘మేక వన్నె పులి’ లాంటి నాన్న ప్రవర్తన. ఇలా వాళ్ల మధ్య జరుగుతున్న గొడవలు మా దాకా తీసుకురావడం ఇష్టం లేని అమ్మ ఇన్నాళ్లూ వాటిని మౌనంగా భరిస్తూ.. మాతో సంతోషంగా ఉంటోందన్న విషయం నాకు అర్థమైంది. అలాగని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయానుకోలేదు. ఓ రోజు అమ్మతో మాట్లాడా.. అప్పుడు ఆయన వివాహేతర సంబంధం, ఇందుకు అమ్మను విడాకులివ్వమని ఒత్తిడి చేయడం.. ఇలాంటి మరిన్ని భయంకరమైన నిజాలు అమ్మ నోటి నుంచి వినాల్సి వచ్చింది. అయితే ఇంతకాలం మా ఇద్దరి భవిష్యత్తు కోసమే తాను మౌనంగా భరిస్తూ వస్తున్న ఈ బాధంతా ఆ రోజు అమ్మ కళ్లల్లో స్పష్టమైంది. ఆ తర్వాత విడాకుల కోసం నాన్న నుంచి ఒత్తిడి కూడా రోజురోజుకీ పెరిగిపోయింది. ఇక ఆఖరికి అమ్మతో బలవంతంగా విడాకుల నోటీస్‌ మీద సంతకం చేయించి మరీ తన దారి తాను చూసుకున్నాడు నాన్న.

******

అయితే అసలు విషయం తెలుసుకోలేని ఇరుగుపొరుగు వాళ్లు, బంధువులు ఆ సమయంలో మా అమ్మనే తప్పుబట్టారు. ‘భర్త తెచ్చిన సంపాదనతో సరిపెట్టుకోకుండా.. ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తే ఏ మగాడైనా ఎన్నాళ్లు భరిస్తాడు?’ అంటూ సూటిపోటి మాటలనడం మొదలుపెట్టారు. ఇంకొందరైతే ‘బరితెగించింద’ని నిందలేశారు. మా కుటుంబ విషయం మా కాలేజీ దాకా చేరి.. అక్కడా తోటి విద్యార్థులతో ఎన్నో మాటలు పడాల్సి వచ్చింది. తప్పు లేకపోయినా వీటిని మౌనంగా భరించడం తప్ప వాటిని ఎదుర్కొనే పరిస్థితి మాకు అప్పుడు లేదు. అలాగని మమ్మల్ని తీసుకొని.. అమ్మమ్మ వాళ్లింటికెళ్లి వాళ్లకు భారమవడం మా అమ్మకు ఇష్టం లేదు. అందుకే తనే ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం చూసుకొని నన్ను, చెల్లిని చదివించింది. మేము కూడా అమ్మ కష్టాన్ని వమ్ము చేయకుండా.. ఇతరులు అనే మాటలు పట్టించుకోకుండా.. చదువు కొనసాగించాం. ప్రస్తుతం నేను ఓ ఎమ్మెన్సీలో ఉద్యోగం చేస్తున్నా. చెల్లి ఎంటెక్‌ చదువుతోంది.

******

అయితే ప్రస్తుతం అమ్మ నాకు సంబంధాలు చూసే పనిలో పడింది. మా ఇద్దరి సంగతి సరే.. మరి, మేం ఒక ఇంటి వాళ్లమయ్యాక.. అమ్మ పరిస్థితేంటి? స్వార్థపూరితమైన మనస్తత్వాల మధ్య తను ఒంటరిగా ఎలా మనగలుగుతుంది..? అన్న ఆలోచన వచ్చింది. ఇదే విషయాన్ని చెల్లితో చర్చించా. అందుకు అమ్మకు మళ్లీ పెళ్లి చేయడమొక్కటే పరిష్కారమనిపించింది మాకు! కానీ మా నిర్ణయాన్ని అమ్మకు చెప్తే తను ఎలా స్పందిస్తుందోనని వెనకా ముందూ అయ్యాం. అయినా ధైర్యం చేసి ఈ విషయాన్ని అమ్మతో చెప్పాం. మేం అనుకున్నట్లుగానే తాను మరో పెళ్లికి ససేమిరా అంది. కారణం.. నాన్న వల్ల అమ్మ ఎదుర్కొన్న వేధింపులే! కానీ ‘అందరు మగవాళ్లూ అలాగే ఉంటారని చెప్పలేం.. అలాగని అవే కష్టాలు జీవితాంతం కొనసాగకపోవచ్చు.. ఈ పెళ్లితో నీ జీవితంలో మంచి రోజులు రావచ్చు.. మేం పెళ్లై వెళ్లిపోతే నీకంటూ ఓ తోడు ఉంటుంది..’ అంటూ తనను ఒప్పించే ప్రయత్నం చేశాం. అయినా కూడదంటూ మొండిపట్టు పట్టింది. అలాగని అంతటితో మా ప్రయత్నాన్ని ఆపలేదు. అమ్మను ఒప్పించడానికి ఇలా చాలాసార్లు ప్రయత్నించాం. ఈ క్రమంలో కొంతమంది మా స్నేహితుల సహకారం కూడా తోడైంది.

ఎట్టకేలకు మా బాధను అర్థం చేసుకున్న అమ్మ ఆఖరికి అయిష్టంగానే సరేనంది. ఎలాగైతేనేం అమ్మ ఒప్పుకుంది.. అంతే చాలనుకున్నాం.. మా ఫ్రెండ్స్‌ సహకారంతో మా అమ్మకు తగిన వరుడిని వెతకడం మొదలుపెట్టాం. ఇందుకు మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్స్‌ని ఆశ్రయించాం. ఈ క్రమంలోనే అమ్మ కంటే నాలుగేళ్లు పెద్దవారైన ఒక వ్యక్తి ప్రొఫైల్‌ మా కంట పడింది. ఆరా తీస్తే.. ఆయనా గత వైవాహిక జీవితంలో భార్య కారణంగా పలు కష్టాలు ఎదుర్కొన్నారని తెలిసింది. ఇలా కష్టాలు పడ్డ వారికే సుఖాల విలువ తెలుస్తుందన్న ఉద్దేశంతో ఆయన గురించి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేశాం. వయసులో, గుణంలో, అందంలో ఎలా చూసినా ఆయనే మా అమ్మకు తగిన వరుడనిపించింది. అమ్మ అంగీకారంతో పెళ్లి చూపులకు ఏర్పాటు చేశాం. ఒకరికొకరు నచ్చడం, నిశ్చితార్థం, పెళ్లి.. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. ఈ పెళ్లితో మా అమ్మ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయాయి. అమ్మా, నాన్న, నేను, చెల్లి.. ప్రస్తుతం మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఇక నాకు, చెల్లికి పెళ్లై వెళ్లిపోయినా మాకు ఎలాంటి బాధ లేదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మకంటూ ఓ తోడు దొరికింది కాబట్టి!

******

ప్రస్తుతం మేం సంతోషం గానే ఉన్నా ఇప్పటికీ మా అమ్మ, మాపై కొంతమంది విమర్శలు చేస్తుంటారు. అందుకే అన్నారేమో ‘లోకులు కాకులు’ అని.. ఒకరు బాగుపడినా ఓర్వలేరు.. కష్టాల్లో ఉంటే మాటలతో హింసిస్తారు. అయినా ఇలాంటి వారి మాటలు పట్టించుకుంటూ బాధపడడం కంటే.. వాటిని వినీ విననట్లుగా వదిలేయడం అలవాటు చేసుకున్నాం. నిజానికి అంతకంటే ప్రశాంతత మరొకటి ఉండదు. నేను, నా కుటుంబమే కాదు.. ఇలా అకారణంగా సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొంటోన్న వారు ప్రస్తుతం ఎంతోమంది ఉన్నారు. ఎవరో ఏదో అన్నారని తమ జీవితం వృథా అంటూ ఒత్తిడిలోకి కూరుకుపోయిన వారూ లేకపోలేదు.

అలాంటి వారిని, వాళ్ల మాటల్ని పట్టించుకుంటూ మన సంతోషాల్ని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడానికే మా అమ్మ కథను మీతో పంచుకున్నా. మా అమ్మ కష్టాలను చూసిన మేము తిరిగి ఆమెకు పెళ్లి చేసి మళ్లీ కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాం.. ఇచ్చాము. ఎవరేమనుకున్నా- మా నిర్ణయం అన్ని రకాలుగా కరక్టే అని భావిస్తున్నాం.. మరి మీరేమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్