The Biker Girl: బైక్‌ రేసింగ్‌తో అలా ప్రేమలో పడిపోయింది!

బైక్‌ నడపడం ఈతరం అమ్మాయిలకు కొత్త కాదు.. కానీ వేగంగా నడిపే అమ్మాయిల్ని మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. మధ్యప్రదేశ్‌కు చెందిన కల్యాణి పొటేకర్‌ కూడా అలాంటి అరుదైన అమ్మాయే! పసి వయసు నుంచే బైక్‌ రైడింగ్‌పై ప్రేమ పెంచుకున్న ఆమె నడపని బైకంటూ లేదు.

Published : 02 Oct 2021 11:28 IST

(Photo: Instagram)

బైక్‌ నడపడం ఈతరం అమ్మాయిలకు కొత్త కాదు.. కానీ వేగంగా నడిపే అమ్మాయిల్ని మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. మధ్యప్రదేశ్‌కు చెందిన కల్యాణి పొటేకర్‌ కూడా అలాంటి అరుదైన అమ్మాయే! పసి వయసు నుంచే బైక్‌ రైడింగ్‌పై ప్రేమ పెంచుకున్న ఆమె నడపని బైకంటూ లేదు. బైక్‌ ఏదైనా బుల్లెట్‌ కంటే వేగంగా దూసుకుపోతూ.. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో బైక్‌ రేసింగ్‌ ఈవెంట్లు, ర్యాలీ రైడ్‌ పోటీల్లో పాల్గొని తన సత్తా చాటుకుంటోంది. అంతేకాదు.. దేశంలోనే వేగంగా బైక్‌ నడిపే అమ్మాయిగా ఇటీవలే గుర్తింపు కూడా తన సొంతం చేసుకుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత దాగుంటుంది.. దాన్ని ప్రపంచానికి చాటుకోవాలంటే అంతర్లీనంగా పోటీతత్వం ఉండాలంటోన్న ఈ బైకర్‌ గర్ల్‌ జర్నీ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..!

మధ్యప్రదేశ్‌లోని దేవస్‌లో పుట్టి పెరిగింది 27 ఏళ్ల కల్యాణీ పొటేకర్‌. మోటోక్రాస్‌ రేసర్‌ అయిన తన తండ్రి ఆమెను నెలల వయసున్నప్పట్నుంచే ఆయనతో పాటే పోటీలకు తీసుకెళ్లేవారు. అలా బైక్‌ రేసింగ్‌ అంటే మక్కువ ఉన్న తన నాన్నను చూస్తూ పెరిగిన ఆమె.. పెద్దయ్యే క్రమంలో తానూ తన తండ్రి అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకుంది. దీన్నే కెరీర్‌గా మలచుకొని తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకోవాలని ఆనాడే మనసులో గట్టిగా అనుకున్నానంటోందీ రేసింగ్‌ గర్ల్.

నాన్నే నా తొలి గురువు!

‘బేసిగ్గా మాది రాయల్‌ ఫ్యామిలీ. పోటీతత్వం, దూకుడు.. ఇవన్నీ బహుశా నా రక్తంలోనే ఉన్నాయనుకుంటా! ఎందుకంటే నాన్న మోటోక్రాస్‌ రేసర్‌ (ఆఫ్‌ రోడ్‌ మోటార్‌సైకిల్‌ రేసింగ్‌). నాకు మూడు నెలలున్నప్పట్నుంచే తనతో పాటు రేసింగ్‌ ప్రాక్టీస్‌కి నన్ను తీసుకెళ్లేవారట! అలా నాన్నను స్ఫూర్తిగా తీసుకొని నేనూ పెద్దయ్యే క్రమంలో బైక్‌ రేసింగ్‌ని నా కెరీర్‌ ఆప్షన్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. తొమ్మిదేళ్ల వయసులో పిల్లలందరూ సైకిల్‌ తొక్కడం నేర్చుకుంటే.. నేనేమో బైక్‌ రైడింగ్‌పై దృష్టి పెట్టాను. మొదటిసారి నాన్న RX100 బైక్‌తోనే సాధన మొదలుపెట్టా. ఇంకా అప్పటికి బైక్‌పై కూర్చుంటే నా కాళ్లు కూడా పూర్తిగా నేలను తాకట్లేదు. ఈ క్రమంలో క్లచ్‌, గేర్‌.. వంటివి ఉపయోగించడం, బైక్‌ నడపడం ఎలాగో నాన్న నాకు వివరించారు. ఇలా గేర్‌ బైక్‌లపై పూర్తి పట్టు సాధించాకే స్కూటీ నేర్చుకున్నా. ఇక నా నైపుణ్యాలకు మరిన్ని మెరుగులద్దడానికి చెన్నైలోని క్యాలిఫోర్నియా సూపర్‌బైక్‌ స్కూల్‌లో శిక్షణలో చేరా..’ అంటూ చెప్పుకొచ్చిందీ యంగ్‌ బైకర్.

‘పెట్రోల్‌ ఎందుకు వృథా చేస్తావ్‌?’ అన్నారు!

అమ్మాయిలు ఏదైనా కొత్తగా చేస్తానంటే అటు కుటుంబం నుంచి, ఇటు సమాజం నుంచి కొన్ని సవాళ్లు ఎదురవడం సహజమే! అయితే తన బైక్‌ రేసింగ్‌ జర్నీలో తనకు తన కుటుంబం పూర్తిగా సహకరించినా.. సమాజం నుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయంటోంది కల్యాణి.

‘పురుషాధిపత్యం ఉన్న రంగాల్లో అమ్మాయిలు రాణించడాన్ని అందరూ ఎందుకు తప్పు పడతారో నాకిప్పటికీ అర్థం కాదు. తమ పిల్లలు ఎంచుకున్న మార్గం ఇంట్లో వాళ్లకు నచ్చినప్పటికీ చుట్టూ ఉన్న వాళ్లు మాత్రం దీన్ని తప్పు పడుతుంటారు. నా విషయంలోనూ అదే జరిగింది. అది అసూయో లేదంటే అమ్మాయినన్న చిన్న చూపో తెలియదు కానీ.. నేను బైక్‌ నేర్చుకుంటున్నప్పుడు, బైక్‌ రేసింగ్‌ ఈవెంట్లలో పాల్గొన్నప్పుడు చాలామంది నన్ను ఇలాగే చూసేవారు. ఓ ఆంటీ అయితే ఏకంగా నా వద్దకొచ్చి ‘బైక్‌ రైడింగ్‌/రేసింగ్‌ అంటూ ఎందుకిలా పెట్రోల్‌ వృథా చేస్తావ్‌? హాయిగా ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని చక్కగా సంపాదించచ్చు కదా!’ అని ఉచిత సలహా ఇచ్చారు. మరోవైపు సోషల్‌ మీడియాలోనూ కొంతమంది తమ కామెంట్లతో/విమర్శలతో నన్ను నిరుత్సాహపరచాలని చూశారు. ఇలాంటి విమర్శలు విని మొదట్లో నా మనసు కాస్త చివుక్కుమన్నా.. ఆ తర్వాత మాత్రం నా విజయాలతో వీటన్నింటికీ చెక్‌ పెట్టాలని నిర్ణయించుకున్నా..’ అంటూ తానెదుర్కొన్న వివక్ష గురించి చెప్పుకొచ్చిందీ రేసర్‌ గర్ల్.

సాహసం-సవాలు!

2013లో తన 20 ఏళ్ల వయసులో తొలిసారి ‘Raid de Himalaya’ అనే బైకింగ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న కల్యాణి.. ఈ పోటీల్లో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపును తన సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసే అవకాశం, అవసరం రాలేదంటోందీ బైక్‌ రైడర్.

‘నేను పాల్గొన్న తొలి బైక్‌ రేసింగే ఎంతో సవాలుతో కూడుకున్నది. ఎందుకంటే ఈ రేసింగ్‌ పోటీలో భాగంగా రాళ్లు-రప్పలున్న దారిలో బైక్‌ నడపడం అంత సులువు కాదు. కానీ ఇలాంటి సాహసాలు నాకు చిన్నప్పట్నుంచి అలవాటే! అందుకే తొలి రేసింగే నా జీవితంలో ఓ మధురానుభూతిగా మిగిలిపోయింది. అంతేకాదు.. ఈ క్రమంలో నా కెరీర్‌కు సంబంధించిన బోలెడన్ని విషయాలు కూడా నేర్చుకున్నా. ఆ తర్వాత ‘ఇండియన్‌ నేషనల్‌ రేసింగ్‌ ఛాంపియన్‌షిప్‌’తో పాటు మరికొన్ని ఈవెంట్లలో పాల్గొని సత్తా చాటా. ఇక అంతర్జాతీయంగా థాయ్‌లాండ్‌, తైవాన్‌లలో నిర్వహించిన పోటీల్లో ఇండియా తరఫున పాల్గొన్నా..’ అంటోంది కల్యాణి. ఇలా తన ప్రతిభకు గుర్తింపుగా పలు పతకాలు, ట్రోఫీలతో పాటు మోటార్‌స్పోర్ట్స్‌ విభాగంలో ‘అవుట్‌స్టాండింగ్‌ విమెన్‌’గా గుర్తింపును తన సొంతం చేసుకుంది.

బుల్లెట్‌ కంటే వేగంగా..!

ఇక ఇటీవలే ‘బుధ్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌’లో నిర్వహించిన బైక్‌ రేసింగ్‌ పోటీల్లో పాల్గొని 2.08 నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించి దేశంలోనే వేగంగా బైక్‌ నడిపే అమ్మాయిగా కీర్తి గడించింది కల్యాణి. అయితే గతంలో వరుసగా రెండుసార్లు ఇదే పోటీల్లో పాల్గొని (మొదటిసారి 2.18 నిమిషాలు, రెండోసారి 2.16 నిమిషాలు) నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించిన ఆమె.. ముచ్చటగా మూడోసారి కూడా తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. తద్వారా దేశంలోనే ఫాస్టెస్ట్‌ వుమన్‌ మోటార్‌సైకిల్‌ రేసర్‌గా అవతరించింది.

 

గుర్రపు స్వారీ అంటే ఇష్టం!

* ఇన్నేళ్ల తన బైక్‌ రేసింగ్‌ జర్నీలో దాదాపు అన్ని బైక్‌లు నడిపిన అనుభవం ఉన్న కల్యాణికి ‘KTM 1290 SUPER DUKE R’ బైక్‌ అంటే చాలా ఇష్టమట! ప్రస్తుతం తన వద్ద ఉన్న ‘Triumph Street Triple 675’ తో ప్రేమలో పడిపోయానంటోందామె.

* చిన్న వయసు నుంచే సాహస క్రీడలంటే ఇష్టపడే కల్యాణికి గుర్రపు స్వారీ అంటే మక్కువ ఎక్కువేనట! ఈ క్రమంలోనే వివిధ పోటీల్లో పాల్గొన్న ఆమె పలు పతకాలు, ట్రోఫీలు, ‘బెస్ట్‌ రైడర్‌ గర్ల్స్‌ ఇండియా’ టైటిల్‌.. వంటివెన్నో అందుకుంది.

* పారాగ్లైడింగ్‌, స్కీయింగ్‌, మౌంటెనీరింగ్‌.. వంటి సాహస క్రీడల్లోనూ తనకు ప్రవేశం ఉందంటోందీ బైకర్‌ గర్ల్.

* ‘Chase the Monsoon Season 3’ అనే రియాల్టీ షోలోనూ పాల్గొంది కల్యాణి.

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత దాగుంటుందని.. దాన్ని నిరూపించుకోవాలంటే మనకు మనమే పోటీపడే తత్వాన్ని అలవర్చుకోవాలంటోన్న ఈ రేసర్‌ గర్ల్‌ జర్నీ నేటి యువతకు స్ఫూర్తిదాయకం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్