బరువు తగ్గాలని ఇప్పటికీ వాటిని బ్యాన్ చేశా!

సినిమాల్లోకి రాకముందు తాము బొద్దుగుమ్మల్లా ఉండే వాళ్లమంటూ చాలామంది తారలు అప్పుడప్పుడూ తమ ఫ్లాష్‌బ్యాక్‌ ఫొటోలు పోస్ట్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అంతేకాదు.. తమ వెయిట్‌లాస్ సీక్రెట్స్‌, ఆరోగ్య రహస్యాల్ని కూడా పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపుతుంటారు అందాల భామలు.

Published : 22 Oct 2021 15:24 IST

(Photo: Instagram)

సినిమాల్లోకి రాకముందు తాము బొద్దుగుమ్మల్లా ఉండే వాళ్లమంటూ చాలామంది తారలు అప్పుడప్పుడూ తమ ఫ్లాష్‌బ్యాక్‌ ఫొటోలు పోస్ట్‌ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అంతేకాదు.. తమ వెయిట్‌లాస్ సీక్రెట్స్‌, ఆరోగ్య రహస్యాల్ని కూడా పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపుతుంటారు అందాల భామలు. అయితే ఆరోగ్యంగా ఉండాలన్నా, ఫిట్‌నెస్‌ని సొంతం చేసుకోవాలన్నా.. శరీరం, మనసు మన అధీనంలో ఉండాలంటోంది బాలీవుడ్‌ లవ్లీ బ్యూటీ పరిణీతి చోప్రా. అందుకు తాను పాటించే ఆరోగ్య సూత్రం ఒకటుందని చెబుతోంది. మరి, అదేంటో మనమూ తెలుసుకుందాం రండి..

మనలోని తపనను నెరవేర్చుకోవాలంటే కొన్ని త్యాగం చేయక తప్పదంటోంది పరిణీతి. వెండితెరకు పరిచయం కాక ముందు 86 కిలోల బరువున్న ఈ ముద్దుగుమ్మ.. ఎలాగైనా హీరోయిన్‌గా రాణించాలన్న పట్టుదలతో బరువు తగ్గి 58 కిలోలకు చేరుకుంది. అప్పట్నుంచి చక్కటి బరువును కొనసాగిస్తూ.. తన ఆరోగ్య/ఫిట్‌నెస్‌ రహస్యాలు పంచుకుంటూ తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోంది.

అదే నా సీక్రెట్!

సమయం దొరికినప్పుడల్లా తన ఆరోగ్య రహస్యాల్ని పంచుకునే పరి.. తాజాగా ఇన్‌స్టాలో మరో పోస్ట్‌ పెట్టింది. పచ్చని ప్రకృతి బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఎత్తైన కొండపై, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేస్తోన్న ఫొటోను పంచుకుంటూ.. ‘రోజూ ధ్యానం చేస్తా. అదే నా ఆరోగ్య రహస్యం!’ అంటూ క్యాప్షన్‌ పెట్టింది.


వాటిని బ్యాన్‌ చేశా!

నాకు 25 ఏళ్ల వయసున్నప్పుడు 86 కిలోల బరువుతో చాలా బొద్దుగా ఉండేదాన్ని. అప్పుడలా ఉండడం నాకు పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ సినిమాల్లోకి రావాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో అప్పుడు బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలన్న ఆలోచన నా మనసులో మొదలైంది. ఈ క్రమంలో నాకెంతో ఇష్టమైన పిజ్జా, బర్గర్‌, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ని పక్కన పెట్టేశా. అఫ్‌కోర్స్‌.. ఇప్పటికీ వాటిని బ్యాన్ చేశాననుకోండి! వీటికి బదులుగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాధాన్యమిస్తున్నా. అలాగే ఆకుకూరలు, సలాడ్స్‌, పాలు.. వంటివి రోజూ నా మెనూలో ఉండాల్సిందే! ఈ నియమాలే రోజంతా నన్ను యాక్టివ్‌గా, హెల్దీగా ఉంచుతున్నాయి.


ఛీట్‌ చేస్తా!

నాకు ఆహారమంటే చాలా ఇష్టం. అలాగని కచ్చితమైన ఆహార నియమాలు పాటించే విషయంలో మాత్రం అస్సలు రాజీ పడను. రాత్రి ఎనిమిది తర్వాత ఏదీ తినను. ఎక్కువసార్లు తక్కువ మొత్తంలో, తేలికపాటి ఆహారం తీసుకోవడం నాకు అలవాటు. ఆదివారం నా ఛీట్‌ డే! ఆ రోజు నాకిష్టమైన కుకీస్‌, కేక్స్, పిజ్జా.. వంటివి తృప్తిగా తింటా. అది కూడా ఓ చిన్న ముక్క అంతే..! ఇక మరుసటి రోజు వీటి ద్వారా చేరిన క్యాలరీలు కరిగించుకోవడానికి ఎలాగూ వ్యాయామం ఉండనే ఉంది!


బరువు తూచుకోను!

బరువు తగ్గే క్రమంలో, అదుపులో ఉందో లేదో చెక్‌ చేసుకోవడానికి తరచూ వెయింగ్ మెషీన్‌కి పని చెప్తుంటారు చాలామంది. నాకైతే అది అస్సలు నచ్చదు. ఎందుకంటే ఈ క్రమంలో తగ్గకపోతే ఒత్తిడికి గురవడం, దానివల్ల మళ్లీ బరువు పెరగడం.. ఇదంతా వృథా వ్యవహారం అనిపిస్తుంటుంది. అందుకే రోజూ ధరించే దుస్తులు ఫిట్టవుతున్నాయంటే బరువు అదుపులో ఉందని అర్థం చేసుకుంటా. దీన్నిలాగే కొనసాగించడానికి ప్రయత్నిస్తా.


నా వర్కవుట్‌ రొటీన్‌ ఇదే!

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు వ్యాయామం కూడా ముఖ్యమే! అందుకే రోజూ దీనికి కాస్త సమయం కేటాయిస్తా. ఈ క్రమంలో జాగింగ్‌, ధ్యానం, ఓ గంట పాటు యోగా, ట్రెడ్‌మిల్‌, కార్డియో.. వంటి వ్యాయామాలు చేస్తాను. నా ఫిట్‌నెస్‌, ఆరోగ్యం వెనక మరో సీక్రెట్‌ కూడా ఉంది. అవే.. క్రీడలు! ముఖ్యంగా ఈత, గుర్రపు స్వారీ అంటే నాకు పిచ్చి!


ప్రశాంతత కోసం..!

సముద్రమన్నా, పచ్చని ప్రకృతి అన్నా నాకు చాలా ఇష్టం. అందుకే నేను వెకేషన్స్ కు వెళ్లే  ప్రాంతాలు కూడా అలాంటివే అయ్యుంటాయి. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాలు మనసుకు పునరుత్తేజాన్నిస్తాయి. ఈ హ్యాపీనెస్‌ చాలదూ.. ఆరోగ్యంగా ఉండడానికి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్