Amala Paul: అప్పుడలా ప్రపోజ్ చేస్తాడని ఊహించలేదు!

ప్రాణ స్నేహితుడు, అందగాడు, మనసున్న వాడు సడన్‌గా ఓరోజు ప్రేమ ప్రతిపాదన తెస్తే..? నువ్వే నా ప్రాణమంటూ వినూత్నంగా లవ్‌ ప్రపోజ్‌ చేస్తే.. ‘యస్‌’ అనకుండా ఏ అమ్మాయైనా ఉండగలదా? అచ్చం ఇలాంటి లవ్‌ ప్రపోజల్‌కే పడిపోయానంటోంది అందాల తార అమలాపాల్‌.

Published : 08 Nov 2023 21:07 IST

(Photos: Instagram)

ప్రాణ స్నేహితుడు, అందగాడు, మనసున్న వాడు సడన్‌గా ఓరోజు ప్రేమ ప్రతిపాదన తెస్తే..? నువ్వే నా ప్రాణమంటూ వినూత్నంగా లవ్‌ ప్రపోజ్‌ చేస్తే.. ‘యస్‌’ అనకుండా ఏ అమ్మాయైనా ఉండగలదా? అచ్చం ఇలాంటి లవ్‌ ప్రపోజల్‌కే పడిపోయానంటోంది అందాల తార అమలాపాల్‌. తన స్నేహితుడు, ప్రియుడు అయిన జగత్‌ దేశాయ్‌తో ఇటీవలే ఏడడుగులు నడిచిన ఈ ముద్దుగుమ్మ.. మంచి మనసుతోనే అతడు తన మనసు గెలుచుకున్నాడని చెబుతోంది. అంతేనా.. తమ పెళ్లి ఫొటోలు, ప్రేమ సంగతుల్ని సోషల్‌ మీడియాలో ఫొటోలు, వీడియోల రూపంలో పంచుకుంటూ మురిసిపోతోంది కూడా! ‘ఆత్మలు వేరైనా మా అడుగులు కలిశాయి’ అంటోన్న ఈ ముద్దుల జంట ప్రేమ కబుర్లు, పెళ్లి వేడుకల గురించి తెలుసుకుందాం..!

ఎమోషనల్‌గా దగ్గరయ్యాడు!

వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ని ప్రేమ వివాహం చేసుకుంది అమలాపాల్‌. అయితే వారి బంధం ఎంతో కాలం కొనసాగలేదు. పలు కారణాల వల్ల 2017లో తమ మూడేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలికిందీ జంట. ఆ సమయంలో పలు సమస్యలు, విమర్శలు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ కూడా ఒక దశలో అంతంతమాత్రంగానే సాగింది. ఇలా తన జీవితంలో ప్రతికూల సమయాన్ని ఎదుర్కొంటున్న సమయంలోనే అమలకు జగత్‌ పరిచయమ్యాడు. ఆయన ఆతిథ్య రంగంలో పనిచేస్తున్నాడు. వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా పలు సమస్యల్ని ఎదుర్కొంటోన్న అమలకు మానసికంగా అండగా నిలిచాడు జగత్‌. దీంతో కొన్ని రోజుల్లోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది.. వారికి తెలియకుండానే ఈ స్నేహం ప్రేమగా మారడంతో.. తన మనసులోని ప్రేమను తన నెచ్చెలి ముందుంచాలనుకున్నాడు జగత్‌. ఇటీవలే అమల పుట్టినరోజును ఇందుకు తగిన సందర్భంగా మార్చుకున్నాడీ హ్యాండ్‌సమ్.

డ్యాన్స్‌తో సర్‌ప్రైజ్!

ప్రేమించిన వారికి వినూత్నంగా లవ్‌ ప్రపోజ్‌ చేయడానికి ప్రేమికులు పడే ఆరాటం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం.. అమల-జగత్‌ లవ్‌ ప్రపోజల్‌ కూడా అలాంటి ఓ రొమాంటిక్‌ సీన్‌నే తలపించిందని చెప్పచ్చు. అమల పుట్టినరోజు సందర్భంగా ఓ హోటల్‌లో డిన్నర్‌ ప్లాన్‌ చేసిన జగత్‌.. అక్కడే తన ఇష్టసఖికి తన మనసులోని మాట చెప్పాలనుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి డిన్నర్‌ చేస్తుండగానే.. తమ టేబుల్‌ చుట్టూ కొంతమంది అమ్మాయిలు డ్యాన్స్‌ చేసేలా ముందే ప్లాన్‌ చేశాడు. అలా వాళ్లు డ్యాన్స్‌ చేసే క్రమంలోనే తానూ వాళ్లతో జాయిన్‌ అయ్యాడు. ఆ మధ్యలో మోకాళ్లపై కూర్చొని.. డైమండ్‌ రింగ్‌ చూపిస్తూ ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడిగేశాడు జగత్‌. ఇంత రొమాంటిక్‌గా ప్రపోజ్‌ చేస్తే ఏ అమ్మాయైనా కాదంటుందా? అందుకే అమల కూడా వెంటనే ‘ఓకే’ చెప్పేసింది. దాంతో ఆ చుట్టూ కూర్చున్న వాళ్ల ఫ్రెండ్స్‌ ఒక్కసారిగా ఈ జంట చుట్టూ చేరడం.. అందరూ కలిసి ఓ స్టెప్పేయడం.. ఇలా తన నెచ్చెలికి సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లిచ్చేశాడీ ప్రియుడు. ఇలా వీరి లవ్‌ ప్రపోజల్‌కు సంబంధించిన వీడియోను ఇద్దరూ సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో తెగ వైరలైంది.

లావెండర్‌ థీమ్‌ వెడ్డింగ్!

ఇలా తమ ప్రేమను ప్రపోజల్‌తో ఓ మెట్టెక్కించిన అమల-జగత్‌.. తాజాగా పెళ్లితో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. ఏ గోవాలోనైతే వీరి మధ్య ప్రేమ పుట్టిందో.. అక్కడే తమ పెళ్లి వేదికనూ ఏర్పాటుచేసుకుందీ ముద్దుల జంట. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులిద్దరూ స్టైలిష్‌గా మెరిసిపోయారు. తమ పెళ్లి కోసం లావెండర్‌ కలర్‌ వెడ్డింగ్‌ థీమ్‌ను ఎంచుకున్న ఈ జంట.. దుస్తుల దగ్గర్నుంచి పెళ్లి వేదిక దాకా ప్రతిదీ ఈ రంగులోనే ఉండేలా జాగ్రత్తపడింది. అమల లావెండర్‌ కలర్‌ ఎంబ్రాయిడరీ లెహెంగాలో మోడ్రన్‌ బ్రైడ్‌గా మెరిసిపోగా.. జగత్‌ మ్యాచింగ్‌ కలర్‌ షేర్వాణీలో ముస్తాబయ్యాడు. పెళ్లిలో రొమాంటిక్‌ చూపులు, ముద్దూముచ్చట్లతో సందడి చేసిన ఈ జంట.. ఈ ఫొటోల్ని ఇన్‌స్టాలో పంచుకుంది. ‘ఆత్మలు వేరైనా మా అడుగులు కలిశాయి.. ఒకే గమ్యం వైపు మొదలైన మా ప్రయాణం శాశ్వతమవ్వాలి..’ అంటూ మురిసిపోయింది. దీంతో వీళ్ల పెళ్లి ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలు, సామాన్యులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ క్యూట్‌ కపుల్!



Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్