సింగిల్‌గా ఎందుకు? ఒక్క క్షణం ఆగి మింగిలవ్వచ్చు కదా!

సింగిల్‌గా ఉంటున్నామంటే చాలు.. ఎందుకు? ఇద్దరి మధ్యా ఏదైనా గొడవైందా? ఇలాంటిదేదైనా ఉంటే కలిసి పరిష్కరించుకోవాలి కానీ.. ఇలా వేరుగా వచ్చేస్తే ఈ సమాజంలో నీకు విలువుంటుందా?.. అంటూ తప్పంతా మనదే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. అంతేకానీ.. అసలు మనం సింగిల్‌గా ఎందుకు ఉండాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేసే వారు చాలా తక్కువ మందే అని చెప్పచ్చు. ఇదిలా ఉంటే.. తమ భాగస్వామితో అనవసరమైన కలహాలు పెట్టుకొని, వారి గురించి అతిగా ఆలోచించి బంగారం లాంటి సంసారాన్ని నాశనం చేసుకునే వారూ ఈ

Updated : 24 Jun 2021 20:53 IST

సింగిల్‌గా ఉంటున్నామంటే చాలు.. ఎందుకు? ఇద్దరి మధ్యా ఏదైనా గొడవైందా? ఇలాంటిదేదైనా ఉంటే కలిసి పరిష్కరించుకోవాలి కానీ.. ఇలా వేరుగా వచ్చేస్తే ఈ సమాజంలో నీకు విలువుంటుందా?.. అంటూ తప్పంతా మనదే అన్నట్లుగా మాట్లాడుతుంటారు. అంతేకానీ.. అసలు మనం సింగిల్‌గా ఎందుకు ఉండాల్సి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేసే వారు చాలా తక్కువమందే అని చెప్పచ్చు. ఇదిలా ఉంటే.. తమ భాగస్వామితో అనవసరమైన కలహాలు పెట్టుకొని, వారి గురించి అతిగా ఆలోచించి బంగారం లాంటి సంసారాన్ని నాశనం చేసుకునే వారూ ఈ సమాజంలో ఉన్నారంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఇలా ముందూ వెనకా ఆలోచించకుండా ఒక్కసారిగా మీ అనుబంధం నుంచి బయటికొచ్చే బదులు, ఒక్క క్షణం ఆగి.. అసలు తప్పెవరిదో తెలుసుకొని సరిచేసుకుంటే.. ఇలా సింగిల్‌గా ఉండాల్సిన అవసరమే రాదంటున్నారు.

అతన్ని చేసుకొని ఉంటే..?!
ప్రతి అమ్మాయికీ పెళ్లికి ముందు కలలు గన్న రాకుమారుడే భర్తగా దొరకాలని లేదు. అందుకే వారి అందం కంటే మనసు చూడమన్నారు పెద్దలు. అలాగే మరికొంతమంది అమ్మాయిలకు తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగకపోవచ్చు.. ఇలా పెద్దలు కుదిర్చిన అబ్బాయితో సర్దుకుపోయే వారు ఎంతోమంది ఉంటారు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ చిలకా గోరింకల్లా ఉన్నప్పటికీ ఎప్పుడో ఒకసారి చిన్న గొడవైనా రాకపోదా? వారి మధ్య చిచ్చు పెట్టకపోదా? ఇదిగో ఇలాంటి సమయంలోనే సంయమనం పాటించకుండా.. ‘అనవసరంగా మా పెద్దల ఒత్తిడితో నిన్ను చేసుకున్నాను.. నేను ప్రేమించిన నిహాల్‌ని చేసుకొని ఉంటే తను నీకంటే బాగా చూసుకునే వాడు!’ అని నోరు జారారో అవతలి వారికి అవకాశమిచ్చినట్లే! ఇంకేముంది.. ఇలా చిన్నగా మొదలైన గొడవ.. ఇద్దరూ విడిపోయి సింగిల్‌గా మారేంత వరకు వెళ్లినా వెళ్లచ్చు! అలా కాకుండా మీరు ఆ మాట అనడానికి ముందు ఒక్క క్షణం ఓపిక పడితే.. పరిస్థితి ఇంతదాకా రాదు. కాబట్టి ఏ గొడవలున్నా మూడో వ్యక్తి ప్రమేయం, ప్రస్తావన లేకుండా దంపతులిద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుంటే  త్వరగా పరిష్కారమవుతాయి.

భూతద్దంలో పెట్టి చూస్తున్నారా?

భార్యాభర్తలన్నాక ఎన్నో సమస్యలు, అభిప్రాయభేదాలు రావడం కామన్‌. అలాగని ప్రతి విషయాన్నీ భూతద్దంలో పెట్టి చూస్తే ఇద్దరి మధ్యా ఉన్న ప్రేమ కాస్తా ద్వేషంగా మారుతుంది. మరో విషయం ఏంటంటే.. ఇలాంటి అతి ఆలోచనల విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే నాలుగాకులు ఎక్కువగా చదివారని చెబుతున్నారు నిపుణులు. ఇక ‘ఆయనతో వేగడం నా వల్ల కాదు..’ అంటూ పుట్టింటికి వచ్చే వారూ లేకపోలేదు. దీంతో అనవసరంగా సంసారం పాడవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. అందుకే అతి ఆలోచనల్ని పక్కన పెట్టి తేలిగ్గా తీసుకునే విషయాల్ని వదిలేయమంటున్నారు. ఒకవేళ నిజంగానే మీ భాగస్వామి అన్న మాటలకు బాధపడుతున్నట్లయితే.. మీ సమస్యను వారికి అర్థమయ్యేలా వివరించండి. అప్పుడు తప్పక పరిష్కారం దొరుకుతుంది. ఇద్దరూ ఇదే తప్పును మరోసారి రిపీట్‌ చేయకుండా జాగ్రత్తపడతారు కూడా!

ఎవరి నమ్మకాలు వారివి!

దంపతుల మధ్య దూరం పెరిగి.. ‘నేను తనతో కలిసి ఉండడం కంటే సింగిల్‌గా ఉండడమే మంచిది’ అనుకునే సందర్భాలు రావడానికి వివిధ అంశాలకు సంబంధించి మనకుండే కొన్ని నమ్మకాలు కూడా ఓ కారణమట! ఆశ్చర్యపోకండి.. ఇక్కడ నమ్మకం అంటే ఒకరిపై మరొకరికి ఉండేది కాదు! ఒకరి నమ్మకాలు, సిద్ధాంతాలకు మరొకరు విలువ ఇవ్వకపోవడం! ఉదాహరణకు.. భార్యాభర్తలిద్దరిలో ఒకరు ఒక విషయాన్ని దృఢంగా నమ్మితే.. మరొకరికి అది అంత ప్రభావవంతంగా అనిపించకపోవచ్చు. అలాగని ‘నేను చెప్పిందే వేదం.. నేను నమ్మిందే నిజం..’ అన్న మొండి వాదనకు దిగకుండా ఎవరి నమ్మకాలు వారివి అంటూ ఆ టాపిక్‌ని వదిలేస్తే ఏ గొడవా ఉండదు.

‘సారీ’ చెప్తే పోలా?!

రిలేషన్‌షిప్‌ నిపుణులు చెబుతోన్న మరో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ఎదుటివారే సారీ చెప్పాలని, అలాగైతేనే దిగొస్తానంటూ మొండిగా ఎవరి దారి వారు చూసుకునే జంటలూ కొన్నున్నాయంటున్నారు. వినడానికి సిల్లీగా అనిపించినా ఇది నిజమే అంటున్నారు. అయితే ఒక్క చిన్న మాటతో అనుబంధాన్ని నాశనం చేసుకోకుండా.. ఎవరో ఒకరు రాజీకి రావడంలో తప్పేం లేదంటున్నారు. ఒకవేళ మీది తప్పు కాకపోయినా మీ భాగస్వామికి సారీ చెప్పడం వల్ల ఎదుటివారు మీ మంచి మనసును అర్థం చేసుకొని మొండితనం వీడే అవకాశమూ ఉందంటున్నారు. కాబట్టి ఒకేఒక్క ‘సారీ’ అనుబంధాన్ని పెంచుతుందే కానీ.. తుంచదని సలహా ఇస్తున్నారు.

మీరైతే ఎలా ఫీలవుతారు? 

కొంతమంది భర్తలు పెళ్లికి ముందు తమకు కాబోయే భార్యతో ప్రేమగా మాట్లాడినప్పటికీ.. పెళ్లయ్యాక ఆమెలో ఉన్న లోపాలన్నీ ఒక్కసారిగా వారికి గుర్తొచ్చేస్తుంటాయి. ‘రాన్రానూ లావవుతున్నావేంటి?’, ‘పెళ్లి చూపుల్లో ఫెయిర్‌గా కనిపించావు.. ఇప్పుడంత కళ నీ మొహంలో కనిపించట్లేదు..’ అంటూ ఎదుటివారి మనసును నొప్పిస్తుంటారు. ఇక అక్కడ్నుంచి గొడవలు ప్రారంభమవుతాయి. అలాగని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే ఇలాంటి విషయాల్ని.. తెగే దాకా లాగి ఎవరి దారి వారు చూసుకుంటే అనుబంధం వీగిపోవడం తప్ప మరే ప్రయోజనం ఉండదు. కాబట్టి వారు అలా మాటలంటే మీ మనసు ఎంత బాధపడుతుందో వారికి వివరించే ప్రయత్నం చేయండి.. ఒకవేళ మీ స్థానంలో వారుంటే ఎలా ఫీలవుతారో అడగండి. దీంతో వారిలో కొంతైనా మార్పొచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే ఎవరేమన్నా, ఎలా ఉన్నా తమను తాము అంగీకరించుకోవడం, ప్రేమించుకోవడం వల్ల ప్రతి విషయాన్నీ సానుకూలంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది. సంసారం నిలబడడానికి ఇలాంటి పాజిటివిటీనే కావాలంటున్నారు నిపుణులు.
అమ్మాయిలనే కాదు.. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అబ్బాయిల విషయంలోనూ దొర్లుతుంటాయి. కాబట్టి పచ్చటి సంసారాన్ని తెగే దాకా లాగకుండా.. ఏ సమస్యైనా మాట్లాడుకొని పరిష్కరించుకుంటే అనుబంధం దృఢమవుతుంది.. కాపురం కలకాలం సజావుగా సాగుతుంది. కావాలంటే.. ఈసారి గొడవై విడిపోదాం అన్న ఆలోచన వచ్చినప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి.. ఫలితం మీకే తెలుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్