Updated : 21/02/2022 15:21 IST

Single Mom : అందుకే అబార్షన్ చేయించుకోలేదు.. ఉద్యోగమూ మానలేదు!

(Photo: Instagram)

చదువు పూర్తవగానే కోరుకున్న ఉద్యోగం, మనసుకు నచ్చిన వాడితో మనువు.. ఈ జీవితానికి ఇవి చాలనుకుంటారు చాలామంది అమ్మాయిలు. మంగళూరుకు చెందిన తేజస్వి నాయక్‌ కూడా తన అదృష్టాన్ని చూసుకొని ఇలాగే మురిసిపోయింది. కానీ ఈ ఆనందం మూణ్నాళ్ల ముచ్చటవుతుందని అప్పుడామె ఊహించలేదు. ప్రాణంగా ప్రేమించే భర్త శాశ్వతంగా దూరమయ్యాడు.. కడుపులో మూడు నెలల పిండాన్ని మోస్తూ సమాజం నుంచి ఎన్నో విమర్శల్ని ఎదుర్కొందామె. ఏదేమైనా, ఎవరేమన్నా సింగిల్‌ మదర్‌గా ఉండడానికే నిశ్చయించుకుంది తేజస్వి. ప్రస్తుతం తన మూడేళ్ల చిన్నారి ఆలనా పాలనలో అమ్మతనాన్ని ఆస్వాదిస్తోన్న ఈ బ్రేవ్‌ మామ్‌.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మహిళలు మాత్రం తమ కెరీర్‌ని వదులుకోకూడదంటూ నేటి తరం తల్లుల్లో స్ఫూర్తి నింపుతోంది. అన్నీ కోల్పోయామన్న నిరుత్సాహంలోకి కూరుకుపోయిన ఎంతోమంది ఒంటరి తల్లుల్లో ప్రేరణ కలిగిస్తోంది. తన స్ఫూర్తిగాథను vasundhara.net తో ఇలా పంచుకుంది...

కర్ణాటకలోని మంగళూరు మాది. అమ్మానాన్న ఉన్నత విద్యావంతులు.. ఉద్యోగస్తులు. ఇలాంటి వాతావరణంలో ఎంతో క్రమశిక్షణతో పెరిగాను నేను. చదువులోనూ తెలివైన విద్యార్థినే! అమ్మానాన్నలు వారి ఉద్యోగాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఏదైనా సబ్జెక్టులో నాకేవైనా సందేహాలుంటే వెంటనే తీర్చేవారు. అలా అమ్మానాన్నల ప్రేమానురాగాలు, ప్రోత్సాహంతో స్కూలింగ్‌ పూర్తి చేశా.

నాన్న పోయాక..!

అయితే అదే సమయంలో మా జీవితాల్లో పెద్ద కుదుపు సంభవించింది. నాన్న చనిపోవడంతో మా కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయాం. ఈ బాధలోనే కొన్నాళ్లు ఉండిపోయాం. ఆ తర్వాత దాన్నుంచి బయటపడి ముందుకు సాగామంటే అదంతా అమ్మ వల్లే అని చెప్తా. ఎందుకంటే తనకు ధైర్యమెక్కువ.. పైగా ఉద్యోగిని! ఇలా తను ఆర్థిక స్థిరత్వం సాధించడం వల్లే నాన్న లేకపోయినా కుటుంబాన్ని సమర్థంగా నడిపించగలిగింది. నన్ను పైచదువులు చదివించగలిగింది. అమ్మ స్ఫూర్తి, ప్రోత్సాహం వల్లే నేను ఇంజినీరింగ్‌ పూర్తిచేశా. ఆ తర్వాత బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది. ఈ క్రమంలో నేను పనిచేస్తోన్న ఆఫీస్‌లోనే ఓ వ్యక్తిని ఇష్టపడ్డాను. తనూ నన్ను ప్రేమించాడు. కులాలు, ప్రాంతాలు వేరైనా పెద్దల అంగీకారంతో మా పెళ్లి జరిగింది. తనూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాం.. మరెన్నో ఆశయాలు పెట్టుకున్నాం.. కానీ మా ప్రేమ అర్ధాంతరంగా ముగిసిపోతుందని, మేము కన్న కలలన్నీ కల్లలవుతాయని నేను అప్పుడు ఊహించలేదు. పెళ్లైన ఏడాదిలోపే నా భర్త చనిపోయాడు.

అబార్షన్‌ చేయించుకోమన్నారు!

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త శాశ్వతంగా దూరమయ్యాడన్న బాధ నన్ను డిప్రెషన్‌లోకి నెట్టేసింది. అయితే ఆయన పోయే నాటికే నేను మూడు నెలల గర్భవతిని. దాంతో మా అత్తగారు ‘నువ్వే నా కొడుకుని సరిగ్గా చూసుకోలేదు.. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నా కొడుకు పాలిట శనిలా దాపురించాడు.. అందుకే నా కొడుకు పోయాడు!’ అని నాపై, నా కడుపులో పెరుగుతున్న బిడ్డపై నిందలేసింది. ఇక మరోవైపు మా బంధువులు, డాక్టర్‌.. ‘చాలా చిన్న వయసులో భర్తను పోగొట్టుకున్నావ్‌.. అయినా నీకు బోలెడంత భవిష్యత్తుంది.. అబార్షన్‌ చేయించుకో..!’ అంటూ ఉచిత సలహాలిచ్చారు. అయినా నా మనసు అందుకు అంగీకరించలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో నా మనసు చెప్పిందే వినాలనుకున్నా.. బిడ్డను కనాలని నిర్ణయించుకున్నా. ఈ సమయంలో అమ్మే నాకు అండగా నిలబడింది.

అమ్మే అన్నీ అయి..!

రోజురోజుకీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కదలికలు, ఆ అనుభూతులు నన్ను తిరిగి మామూలు మనిషిని చేశాయి. మానసికంగా, శారీరకంగా నన్ను దృఢంగా మార్చాయి. గర్భిణిగా ఉన్న సమయంలో, ప్రసవం తర్వాత ఎదురైన మానసిక ఒత్తిళ్లను అధిగమించడానికి థెరపీ కూడా తీసుకున్నా. ఇక బిడ్డ పుట్టాక పూర్తిగా మారిపోయా. ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలిగే ధైర్యాన్ని కూడగట్టుకున్నా. నా భర్త పోయాక కూడా నేను ఆర్థికంగా నిలదొక్కుకున్నానంటే అందుకు నా సహోద్యోగులే కారణం. అంతేకాదు.. వాళ్లు నాకు ఎమోషనల్‌గానూ అండగా నిలిచారు. ఇక ఈ విషయంలో మా అమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.. ఎందుకంటే నాన్న పోయాక గుండె నిబ్బరాన్ని ప్రదర్శించి మా కుటుంబం తిరిగి గాడిలో పడేలా చేసింది.. ఆర్థికంగా ఎలాంటి లోటూ రాకుండా కాపాడింది. అమ్మ నాకు ఇచ్చిన అత్యుత్తమ సలహా కూడా ఇదే.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆడవాళ్లు తమ కాళ్లపై తాము నిలబడేంత ధైర్యాన్ని, నేర్పును ప్రదర్శించాలని!

కెరీరే కొండంత అండ!

ప్రస్తుతం నేను ఉద్యోగానికి వెళ్లినప్పుడు అమ్మే నా పాపను చూసుకుంటోంది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు ఒంటరి తల్లుల్లో స్ఫూర్తి నింపేలా, వాళ్ల మానసిక సమస్యల్ని దూరం చేసేలా సోషల్‌ మీడియా ద్వారా కొన్ని చిట్కాలు అందిస్తున్నా. అలాగే పిల్లల పెంపకం, పిల్లలకు సంబంధించిన పలు విషయాలపై చిన్న చిన్న వీడియోలు రూపొందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నా. మీరు కూడా ఈ విషయాల్లో సలహాలేవైనా కావాలంటే నిర్మొహమాటంగా నన్ను అడగచ్చు. ఇక ఆఖరుగా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా.. జీవితంలో ప్రతికూలతలు, సానుకూలతలు ఉంటాయి.. మంచి వ్యక్తులు, చెడు వ్యక్తులు తారసపడుతుంటారు.. మంచి విషయాలు, చెడ్డ విషయాలు జరుగుతుంటాయి. అయితే పాజిటివ్‌ అయినా నెగెటివ్‌ అయినా ప్రతి సందర్భాన్ని మనకు అనుకూలంగా మార్చుకునేంత దృఢంగా మనం తయారుకావాలి. అలాగే ఎలాంటి పరిస్థితులెదురైనా కెరీర్‌ని/ఉద్యోగాన్ని మాత్రం వదులుకోకూడదు.. అదే మనల్ని ఆయా పరిస్థితుల నుంచి బయటపడేసి ధైర్యంగా ముందడుగేసేందుకు ప్రేరేపిస్తుంది. నా జీవితం నుంచి నేను నేర్చుకున్న పాఠం ఇదే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని