పండగ తర్వాత.. చర్మ సౌందర్యం తగ్గకుండా..!

దీపావళి టపాసుల వల్ల పెరిగే కాలుష్యం చర్మ సౌందర్యాన్ని సైతం దెబ్బతీస్తుంది. దీనికి తోడు పండగ రోజు మనం లాగించిన స్వీట్లలోని అధిక చక్కెరలు కూడా చర్మ సౌందర్యానికి ప్రతిబంధకాలుగా మారుతుంటాయి. ఈ సమస్యకు విరుగుడుగా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించమంటున్నారు నిపుణులు..

Published : 14 Nov 2023 12:16 IST

దీపావళి అంటేనే టపాసుల సంబరం. అయితే వీటి వల్ల ఎంత సరదా సొంతమవుతుందో.. పర్యావరణానికీ అంత నష్టం వాటిల్లుతుంది. టపాసుల వల్ల దిల్లీలో తాజాగా పెరిగిన పర్యావరణ కాలుష్యమే ఇందుకు సాక్ష్యం. ముఖ్యంగా ఈ కలుషిత వాతావరణం చర్మ సౌందర్యాన్ని సైతం దెబ్బతీస్తుంది. దీనికి తోడు పండగ రోజు మనం లాగించిన స్వీట్లలోని అధిక చక్కెరలు కూడా చర్మ సౌందర్యానికి ప్రతిబంధకాలుగా మారుతుంటాయి. మరి, ఈ సమస్యల్ని దూరం చేసుకొని తిరిగి కళగా మెరిసిపోవాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు.

మేని మెరుపుకి..!
* వాతావరణ కాలుష్యం వల్ల ముఖంపై పేరుకున్న మురికి, జిడ్డును వదిలించుకోవడానికి కొబ్బరి/బాదం/ఆలివ్‌ నూనెతో మర్దన చేసుకోవాలి. ఈ ప్రక్రియ వల్ల చర్మం తేమనూ సంతరించుకుంటుంది.
* స్క్రబ్‌ చేసుకోవడం వల్ల కూడా చర్మం పునరుత్తేజితమవుతుంది. ఈ క్రమంలో కాఫీ పొడి, చక్కెర, ఓట్‌మీల్‌.. వంటి పదార్థాలతో తయారుచేసిన స్క్రబ్స్‌ని ఉపయోగించడం వల్ల మూసుకున్న చర్మ రంధ్రాలు తెరుచుకొని అందులో 
పేరుకున్న మురికి తొలగిపోతుంది.
* ఇంట్లో తయారుచేసుకున్న ఫేస్‌మాస్క్‌లతో పాటు.. మార్కెట్లో కూడా సహజసిద్ధమైన పదార్థాలతో తయారైన షీట్‌ మాస్క్‌లు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగిస్తే తక్షణమే మెరుపును సొంతం చేసుకోవచ్చు.
* ఇక పండగ హడావిడి, వాతావరణ కాలుష్యం కారణంగా అలసిన కళ్లను తిరిగి పునరుత్తేజితం చేయాలంటే.. చల్లటి రోజ్‌వాటర్‌లో కాటన్‌ని ముంచి, పిండి.. దాన్ని కళ్ల కింద పావుగంట పాటు ఉంచుకుంటే ఫలితం ఉంటుంది.
* చర్మాన్ని పునరుత్తేజితం చేసుకునే క్రమంలో మేకప్‌కి కూడా దూరంగా ఉండడం మంచిదంటున్నారు నిపుణులు. ఫలితంగా చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా, మృతకణాలు ఏర్పడకుండా జాగ్రత్తపడచ్చు.

జుట్టు ఆరోగ్యానికి ఇవి!
* టపాసుల పొగ వల్ల జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా దీని ప్రభావం కారణంగా పొడిబారిపోయిన జుట్టును తిరిగి మెరిపించాలంటే కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు నూనెతో మర్దన చేయడం మంచిదంటున్నారు నిపుణులు. 
ఫలితంగా కుదుళ్లూ తేమను సంతరించుకుంటాయి.
* షాంపూ చేసుకున్న తర్వాత జుట్టును కండిషనింగ్‌ చేయడం తప్పనిసరి. ఇందుకోసం ఇంట్లో లభించే కలబంద గుజ్జు, పెరుగు.. వంటి పదార్థాలతో పాటు హెయిర్‌ సీరమ్స్‌ కూడా మేలు చేస్తాయి.
* ఇప్పటికే పొడిబారిపోయి దెబ్బతిన్న జుట్టుపై హెయిర్‌ స్టైలింగ్‌ టూల్స్‌ వాడితే కేశాల ఆరోగ్యం మరింతగా దెబ్బతింటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండడం మంచిది.
ఇక వీటితో పాటు నీళ్లు సరిపడా తాగడం, జ్యూసులు ఎక్కువగా తీసుకోవడం వల్ల అటు ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇటు చర్మ సౌందర్యాన్నీ సొంతం చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్