డియర్‌ బాస్‌.. దయచేసి మా ఆయన్ని ఆఫీస్‌కి పిలవండి!

ఇంటి నుంచి పనేమో గానీ ఏడాదిన్నర కాలంగా మహిళలకు కాసేపు విశ్రాంతి తీసుకుందామన్నా తీరిక దొరకట్లేదు. అటు ఆఫీస్‌ పని, ఇటు ఇంటి పనులతో ఉద్యోగినులే కాదు.. కాస్తైనా సమయం దొరుకుతుందనుకునే గృహిణుల పరిస్థితీ ఇంతకంటే దారుణంగా ఉందంటోంది సుమిత్ర.

Published : 15 Sep 2021 16:23 IST

(Image for Representation)

ఇంటి నుంచి పనేమో గానీ ఏడాదిన్నర కాలంగా మహిళలకు కాసేపు విశ్రాంతి తీసుకుందామన్నా తీరిక దొరకట్లేదు. అటు ఆఫీస్‌ పని, ఇటు ఇంటి పనులతో ఉద్యోగినులే కాదు.. కాస్తైనా సమయం దొరుకుతుందనుకునే గృహిణుల పరిస్థితీ ఇంతకంటే దారుణంగా ఉందంటోంది సుమిత్ర. కరోనా కారణంగా గతేడాది ఉద్యోగం కోల్పోయిన ఆమె.. అప్పట్నుంచి ఇంటికే పరిమితమైంది. అటు ఇంటెడు చాకిరీ చేస్తూ.. ఇటు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్ చేస్తూ భర్త వేసే ఆర్డర్లతో విసుగెత్తిపోయింది. అందుకే తన భర్తను తిరిగి ఆఫీస్‌కి పిలవాలని అర్జీ పెడుతూ ఆయన బాస్‌కి ఓ సుదీర్ఘ లేఖ రాసింది. ఇకపైనా ఈ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇలాగే కొనసాగితే తమ వైవాహిక బంధం బీటలు వారడం ఖాయమంటూ తన మనసులోని ఆవేదనను ఉత్తరంలో ఇలా చెప్పుకొచ్చింది.

రోజూ ఆఫీస్‌కి వెళ్లి పని చేస్తున్నప్పుడు ఒక్క రోజైనా ఇంటి నుంచి పనిచేసే అవకాశమొస్తే బాగుండనిపించేది.. కరోనా పుణ్యమాని కార్పొరేట్‌ కంపెనీలన్నీ ఇదే పని విధానాన్ని అలవాటు చేసుకున్నాయి. దాంతో నేను, నా భర్త సంతోష్‌ ఇంటి నుంచే పనిచేయడం మొదలుపెట్టాం. ఓ నెల రోజుల పాటు రోజూ ఆడుతూ పాడుతూ ఆఫీస్‌ పని ముగించుకునే వాళ్లం. ఇటు పిల్లల బాధ్యతనూ చూసుకునే వాళ్లం. ఇక ఎప్పుడైతే గతేడాది జూన్‌లో నా ఉద్యోగం కోల్పోయానో.. అప్పట్నుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి.

******

మాది, మా వారిది తిరుపతి.. అయినా ఉద్యోగాల రీత్యా బెంగళూరులోనే స్థిరపడ్డాం. మాకు అనన్య, ఆకాంక్ష అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. మేం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లో బిజీగా ఉంటే.. మా పిల్లలిద్దరూ ఆన్‌లైన్‌ క్లాసెస్ వింటూ.. చదువుకుంటూ, ఇద్దరూ కలిసి ఆడుకుంటూ.. ఇలా రోజంతా ఎవరి పనుల్లో వారు లీనమై యాక్టివ్‌గా గడిపేవాళ్లం. బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ ఎవరికి వారుగా చేసినా.. డిన్నర్‌ మాత్రం అందరం కలిసే చేసే వాళ్లం. దీంతో ఒకరినొకరు మిస్సవుతున్నామన్న ఫీలింగే రాకపోయేది. అయితే దురదృష్టవశాత్తూ గతేడాది జూన్‌లో మా కంపెనీ మూతపడింది. దాంతో నా ఉద్యోగం పోయింది. జరిగిందేదో జరిగిపోయింది.. ఇలాగైనా కాస్త ఖాళీ సమయం దొరికింది కదా.. పిల్లలతోనైనా గడుపుదామన్న ఉద్దేశంతో మరో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు బ్రేక్‌ వేశాను. ఇక అప్పట్నుంచి ఇంటి పని, వంట పని, పిల్లల బాధ్యతలు, వారిని చదివించడం, మా వారికి అవసరమైనవన్నీ సమకూర్చడం.. ఇదే నా నిత్యకృత్యంగా మారిపోయింది.

అయితే నేనూ ఉద్యోగం చేసే రోజుల్లో నా భర్త కూడా నాకు ఇంటి పనుల్లో అడపాదడపా సహాయపడేవాడు. పిల్లల బాధ్యతల్లోనూ పాలు పంచుకునేవాడు. కానీ నా ఉద్యోగం ఎప్పుడైతే కోల్పోయానో అప్పట్నుంచి తను ఇంటి పనుల్లో సహాయపడడం క్రమంగా తగ్గిస్తూ వచ్చాడు. పిల్లల్ని కూడా తమ చదువులు, ఇతర విషయాల గురించి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు అడిగేవాడు. సరే.. నేనెలాగో ఖాళీగానే ఉన్నాను.. తను ఆఫీస్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు కదా.. డిస్టర్బ్‌ చేయడం ఎందుకని ఇవన్నీ పట్టించుకోకపోయేదాన్ని. అదే అదనుగా భావించి నా మీద అజమాయిషీ చెలాయించడం మొదలుపెట్టాడు. సున్నితంగానే చెప్తూ నాతో అన్ని పనులు చేయించుకునేవాడు.. మారు మాట్లాడితే ఊపిరి సలపకుండా ఆఫీస్‌ పని ఉందంటూ ఎప్పుడూ ల్యాప్‌టాప్‌తో, మొబైల్‌తోనే గడిపేవాడు.

******

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే దాకా ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ ఆర్డర్‌ చేసేవాడు. తాగిన కప్పు కూడా అక్కడే వదిలేసేవాడు. బ్రేక్‌ఫాస్ట్‌, భోజనం కూడా తాను వర్క్‌ చేసుకునే క్యాబిన్‌ దగ్గరికే తీసుకురమ్మనే వాడు. కనీసం తిన్న ప్లేట్‌ కూడా సింక్‌లో పెట్టే వాడు కాదు. ఇక వీటికి తోడు మధ్యమధ్యలో అది కావాలి.. ఇది చేసిపెట్టమంటూ ఆర్డర్లు..! లేదు నాకు వేరే పనుందంటే.. ఆఫీస్‌ పని కంటే ముఖ్యమైన పనా అని సూటిపోటి మాటలనేవాడు. ఒక్కచోట పనిచేసుకోకుండా ఒక్కో రోజు ఒక్కో గదిలో పనిచేసుకోవడం, ఆఫీస్‌ ఫైల్స్‌, పేపర్స్‌ అన్నీ అలాగే వదిలేయడం.. తిరిగి ఆ ప్రదేశాన్ని నేనెంత శుభ్రం చేసినా మళ్లీ చిందరవందరగా మార్చేసేవాడు. ఇవన్నీ శుభ్రం చేయలేక ఓపిక నశించి ఒక్కోసారి ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కూడా వచ్చేవి. కానీ పిల్లల ముందు కూడదని నేనే ఓ మెట్టు దిగేదాన్ని.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతిని మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఈమధ్యే ప్రకటించేసరికి.. పెట్టా బేడా సర్దుకొని.. మమ్మల్ని వాళ్లింటికి (మా అత్తారింటికి) తీసుకెళ్లిపోయాడు. ఇంట్లో అత్తయ్య, తోడికోడళ్లు, అప్పుడప్పుడొచ్చిపోయే ఆడపడుచులు ఉన్నా.. నాపై పనిభారం పెరిగిందే తప్ప మరేమాత్రం తగ్గలేదు. దీనికి తోడు ఇక్కడికొచ్చాక తన వాళ్ల అండ చూసుకొని మా వారి ఆర్డర్లు, అజమాయిషీ మరింతగా పెరిగాయి. దీనివల్ల శారీరకంగానే కాదు.. మానసికంగానూ నలిగిపోతున్నాను. ఎంతో అన్యోన్యంగా ఉండే మా అనుబంధం ఈ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పద్ధతి రాకతో క్రమంగా సన్నగిల్లుతూ వస్తోంది. మరికొన్ని నెలల పాటు ఇదిలాగే కొనసాగితే ఇద్దరం ఒకరికొకరం శాశ్వతంగా దూరమవుతామేమోనని భయంగా ఉంది. అది నాకెంత మాత్రం ఇష్టం లేదు. మా మధ్య వచ్చే కలతలు మా పిల్లల మనసుపై ప్రభావం చూపడాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నా.

******

అందుకే డియర్‌ సర్‌.. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే! మీ ఉద్యోగి అయిన సంతోష్‌ని తిరిగి ఆఫీస్‌కి పిలవండి. అతను ఇప్పటికే కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నాడు. కొవిడ్‌కు సంబంధించిన జాగ్రత్తలన్నీ తు.చ. తప్పకుండా పాటిస్తున్నాడు. మేము కూడా ఇంట్లోనే ఉంటూ అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. దయచేసి.. నా మనవి ఆలకించి నా భర్తను తిరిగి ఆఫీస్‌కి రప్పిస్తే.. మేము మళ్లీ బెంగళూరు వచ్చేస్తాం.. అక్కడే నేను మరో ఉద్యోగం వెతుక్కోవచ్చు.. నా పిల్లల చదువులు కూడా ఎలాంటి ఆటంకాల్లేకుండా సజావుగా ముందుకు సాగుతాయి. తిరిగి మునుపటిలా ఎవరి పనుల్లో వారు నిమగ్నం కావచ్చు.. దీనివల్ల పనుల్ని సమన్వయం చేసుకుంటూ దూరమైన అనుబంధాన్ని తిరిగి దగ్గర చేసుకునే వీలు కలుగుతుంది. ఇలా మీరు తీసుకునే ఈ ఒక్క నిర్ణయం పైనే నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయి.. థ్యాంక్యూ!!

సుమిత్ర ఒక్కదానికే కాదు.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ రాకతో చాలామంది గృహిణులు/ఉద్యోగినులు ఎదుర్కొంటున్న సమస్యే ఇది! మహిళలకు ఊపిరి సలపని ఇంటి పనులు వారిపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ నిరంతరాయంగా ఒక్క చోటే ఉండేసరికి.. కలిసి గడిపే సమయం దొరక్కపోగా, ఒక రకమైన అసహనానికి లోనవుతున్నారు. దీని కారణంగానే చాలామంది దంపతులు కౌన్సెలింగ్‌ నిపుణుల్ని ఆశ్రయిస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. మరికొంతమంది విడాకుల కోసం కోర్టు మెట్లు కూడా ఎక్కుతున్నారట! 

మరి, ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ కాస్తా వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ కావాలా? భార్యాభర్తలిద్దరూ మునుపటిలా ఆఫీస్‌ నుంచే పనిచేయడం మంచిదంటారా? సుమిత్ర, తన భర్త బాస్‌కు పెట్టుకున్న విన్నపంతో మీరు ఏకీభవిస్తారా? అసలు దీనిపై మీ స్పందనేంటి? మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మాతో పంచుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్