Published : 17/01/2022 20:27 IST

Social Media : మీ పిల్లలకూ ఈ అలవాటుందా?

సోషల్‌ మీడియా నేటి జీవనశైలిలో భాగమైంది. అది ఎంతలా అంటే రోజులో ఓ గంటసేపైనా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌.. వంటి మాధ్యమాలకు దూరంగా ఉండలేకపోతున్నారు చాలామంది. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న పిల్లలు వీటికి బానిసలుగా మారుతున్నారు. అది క్రమంగా కొంతమందిలో మానసిక సమస్యలకు దారి తీస్తుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దానికి తగ్గట్టే చాలామంది తల్లిదండ్రులు ‘మా పాప రోజూ ఫేస్‌బుక్‌లోనే ఉంటుంది.. దాంతో చదువులో వెనకబడిపోయింది’, ‘మా బాబు ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా ఇన్‌స్టాగ్రామ్‌ ఆలోచనల్లోనే మునిగి తేలుతున్నాడు. ఆ మాయలో పడి రాత్రి సరిగ్గా తినట్లేదు.. నిద్ర కూడా పోవడం లేదు’ అంటూ తమ వద్దకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారని చెబుతున్నారు మానసిక నిపుణులు.

బోర్‌ కొట్టినప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు తమ స్నేహితులతో మాట్లాడడం కోసం, తమ సమాచారాన్ని పంచుకోవడానికి.. చాలామంది టీనేజ్‌ పిల్లలు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌టైమ్‌.. వంటి సామాజిక మాధ్యమాలను విపరీతంగా ఉపయోగిస్తున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ వాడకం పరిమితంగా ఉంటే పర్లేదు కానీ వ్యసనంగా మారితేనే మానసిక సమస్యల ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో పిల్లల్లో సోషల్‌ మీడియా వ్యసనంగా మారడానికి గల సంకేతాలు ఏంటి? వాటి నుంచి పిల్లలను ఎలా బయట పడేయాలి? ఈ క్రమంలో తల్లిదండ్రులు పాటించాల్సిన నియమాలేంటి? తెలుసుకుందాం రండి..

ఈ లక్షణాలుంటే మీ పిల్లలకు సోషల్‌ మీడియా వ్యసనంలా మారిందనే చెప్పాలి..

* చదువును నిర్లక్ష్యం చేయడం.. సొంత పనులపై అశ్రద్ధ చూపడం.

* మధ్యలో ఇంటర్నెట్‌కు అంతరాయం కలిగితే చిరాకు పడడం, ఒత్తిడికి లోనవడం.

* రోజులో ఎక్కువ సేపు సామాజిక మాధ్యమాల గురించే చర్చించడం.. ఎవరితో మాట్లాడినా ఇదే ప్రస్తావన తీసుకురావడం.

* సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులకు ఆశించిన లైక్స్‌ రానప్పుడు ఆందోళన చెందడం.

* నిరంతరం ఆన్‌లైన్‌లోనే గడిపినా.. గడపలేదని అబద్ధాలు చెప్పడం.

* మాటల మధ్యలో తరచూ ఫోన్‌ చెక్‌ చేసుకోవడం.

* సోషల్‌ మీడియా ధ్యాసలో పడిపోయి కుటుంబానికి, కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉండడం.

* సామాజిక మాధ్యమాల కోసం అన్నీ వదులుకొని ఎక్కువ సేపు తమకు తాము ఒంటరిగా ఉండాలనుకోవడం.

తల్లిదండ్రులూ.. అలర్ట్‌ అవ్వాల్సిందే!

* ఈ రోజుల్లో పిల్లలను స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉంచడం కష్టం. కాబట్టి, కొన్ని సమయాల్లో స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉండేలా నియమం పెట్టండి. ఉదాహరణకు.. భోజనం చేసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు, కుటుంబంతో గడిపేటప్పుడు స్మార్ట్‌ఫోన్లకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా పడకగదిలోకి వాళ్లు ఫోన్‌ పట్టుకెళ్లకుండా చూడండి.. ఇలా మొబైల్‌/ల్యాప్‌టాప్‌ విషయంలో నిబంధనల్ని పెంచుకుంటూ పోతే.. ఆటోమేటిక్‌గా వాళ్ల స్క్రీన్‌ టైమ్‌ తగ్గిపోతుంది.

* మీ పిల్లలకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలను సున్నితంగా వివరించండి. మీరు వారి మంచి కోసమే ఇలా చేస్తున్నారని, బంగారు భవిష్యత్తు కోసమే ఇలాంటి కఠిన నియమాల్ని విధుస్తున్నారన్న విషయం వారికి అర్థమయ్యేలా చెప్పండి.

* మీ పిల్లలను సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచడం కోసం ఇతర పనుల్లో వారిని నిమగ్నం చేసే ప్రయత్నం చేయచ్చు. ఈ క్రమంలో వారికి కొత్త అభిరుచులను పరిచయం చేయండి. అలాగే వారికి ఆసక్తి ఉన్న వ్యాపకాలపై శ్రద్ధ పెట్టేలా ప్రోత్సహించండి.

* ‘యథా రాజా తథా ప్రజా’ అంటుంటారు పెద్దలు. మీరు ఏం చేస్తే మీ పిల్లలు కూడా అవే పనులను ఎక్కువగా చేస్తుంటారు. కాబట్టి, వారిని ఫోన్లకు దూరంగా ఉండమని చెప్పి మీరు అదేపనిగా ఫోన్లను వాడడం కూడా మంచిది కాదు. మీకు మీరు స్మార్ట్‌ఫోన్‌ని దూరంగా పెట్టి వారికి ఉదాహరణగా నిలవండి.

* రోజూ ఏం చేయాలో ఒక ప్రణాళిక వేసుకునేలా వారిని ప్రోత్సహించండి. అది సరిగ్గా అమలుపరిచేలా వారికి సహకరించండి.

* ఈ క్రమంలో అవసరమైతే మానసిక నిపుణుల సహాయం తీసుకొని మీ పిల్లలకు కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే తప్పక ఫలితం ఉంటుంది.

ఎంత సమయం గడపచ్చు?!

సామాజిక మాధ్యమాలకు మితంగా సమయం కేటాయించచ్చన్నారు.. అయితే అది ఎంతసేపు అనే ప్రశ్న చాలామందికి వచ్చే ఉంటుంది. అయితే దీనికోసం ఒక నిర్దిష్ఠ సమయమంటూ ఏదీ లేకపోయినా పరిశోధకులు ఈ అంశం గురించి కొంతమంది టీనేజ్‌ విద్యార్థులపై పలు సర్వేలు జరిపారు. ఈ క్రమంలో రోజూ గరిష్ఠంగా 30 నిమిషాల పాటు సామాజిక మాధ్యమాల్లో గడిపిన వారిలో ఎలాంటి మానసిక సమస్యలు రాలేదని తేల్చారు. కానీ, రెండు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్‌ మీడియాలో గడిపిన వారిలో డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు అధికంగా కనిపించాయని వెల్లడించారు.. అందుకే అరగంటకు మించి దీన్ని వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.

ఇవి కూడా మార్గాలే...

చాలామంది టీనేజ్‌లో ఉన్నవారికి తల్లిదండ్రులు చెప్పే మంచి విషయాలు అంత రుచించవు. కానీ, ప్రతికలు.. న్యూస్‌ ఛానెళ్లలో వచ్చే వార్తలు కొంత ఆలోచింపజేస్తుంటాయి. కాబట్టి, వీటి అతి వాడకం వల్ల కలిగే అనర్థాలకు సంబంధించిన వార్తల గురించి మీ పిల్లలతో చర్చించండి. అలాగే సోషల్‌ మీడియా వినియోగానికి సంబంధించి పలు చిత్రాలు కూడా విడుదలయ్యాయి. వాటిని ముందు మీరు ఒకసారి చూసి.. ఆ తర్వాత మీ పిల్లలకు చూపించండి. ఇలా మీరు రెండోసారి చూడడం వల్ల అందులోని మంచి విషయాలు మీ పిల్లలు బుర్రకెక్కించుకుంటున్నారా లేదా అనే విషయం గ్రహించచ్చు.

చూశారుగా.. టీనేజ్‌ పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో..! అయితే మీరు వారికి ఏ విషయం చెప్పినా అత్యుత్సాహం ప్రదర్శించకుండా, వారిపై ఒత్తిడి పెట్టకుండా సున్నితంగా చెబితే వారిలో తప్పకుండా మార్పు వస్తుంది. కావాలంటే ఓసారి ప్రయత్నించి చూడండి!


Advertisement

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి