రిజైన్ చేస్తున్నారా?

వేరే సంస్థలో ఉద్యోగమొచ్చినా, కొన్నాళ్ల పాటు కెరీర్‌కు విరామమివ్వాలనుకున్నా.. ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం సహజమే! అయితే ఈ క్రమంలో ప్రస్తుతం తాము పనిచేస్తోన్న సంస్థతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం ఉండదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు.

Published : 12 Mar 2024 13:17 IST

వేరే సంస్థలో ఉద్యోగమొచ్చినా, కొన్నాళ్ల పాటు కెరీర్‌కు విరామమివ్వాలనుకున్నా.. ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేయడం సహజమే! అయితే ఈ క్రమంలో ప్రస్తుతం తాము పనిచేస్తోన్న సంస్థతో ఇకపై తమకు ఎలాంటి సంబంధం ఉండదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. పైఅధికారులతోనూ ఇంతకుముందున్నంత వినయంగా కాకుండా.. ప్రతి విషయంలోనూ వాళ్ల పట్ల నిర్లక్ష్యపూరిత ధోరణిని ప్రదర్శిస్తుంటారు. అయితే ఇవి ఉత్తమ ఉద్యోగికి ఉండాల్సిన లక్షణాలు కాదంటున్నారు నిపుణులు. సంస్థను వీడుతున్నప్పటికీ.. అది వృత్తిధర్మంగా, హుందాగానే ఉండాలే తప్ప.. ఇటు మీరు ఇబ్బంది పడుతూ, అటు ఇప్పటిదాకా మీతో పాటు పనిచేసిన సహోద్యోగులు, యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు. ఈ క్రమంలో రాజీనామా చేసినా, ప్రస్తుత సంస్థను వీడుతున్నా.. ఉద్యోగులు తమ కెరీర్ ఉన్నతి కోసం కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు.

అబద్ధాలు వద్దు!

ఉద్యోగం మారడానికి, మానేయడానికి.. పలు వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాలుండచ్చు. అయితే ఈ క్రమంలో తాము ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నామంటే సంస్థ ఒప్పుకుంటుందో, లేదోనని.. కొంతమంది కొన్ని అబద్ధాలు చెబుతుంటారు. వేరే సంస్థలో ఉద్యోగం వచ్చినా.. ఇంటి బాధ్యతల రీత్యా కెరీర్‌కు విరామమివ్వాలనుకుంటున్నట్లు అబద్ధమాడుతుంటారు. నిజానికి.. ఏళ్ల కొద్దీ అనుభవం ఉన్న ఉద్యోగిని అంత సులభంగా వదులుకోవడానికి ఏ సంస్థా ఒప్పుకోదు. కాబట్టి ఈ విషయంలో మీరు మీ సంస్థ, పైఅధికారులతో పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారా మీరు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారన్న విషయాలు కూడా అందరికీ ఇట్టే తెలిసిపోతాయి. ఉదాహరణకు.. లింక్డిన్‌ వంటి వేదికలపై మీ వృత్తిపరమైన సమాచారమంతా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంటారు. దీంతో కూడా మీరు కొత్త ఉద్యోగంలో చేరారా? లేదంటే ఇంటికే పరిమితమయ్యారా? అన్న విషయాలు పూర్వ సంస్థకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తి విషయంలో ఇలాంటి వ్యవహారం తగదు.

కృతజ్ఞతా భావం ముఖ్యం!

సంస్థలో పదేళ్లు పనిచేసినా.. ఏడాది పనిచేసినా.. యాజమాన్యం, సహోద్యోగులతో మనకు ఓ స్నేహపూర్వకమైన అనుబంధం ఏర్పడుతుంది. అయితే వేరే ఉద్యోగంలోకి మారుతున్నామన్న కారణంతో.. ఇకపై వాళ్లతో మనకు సంబంధం లేదన్నట్లుగా ఏదో పైపైన వీడ్కోలు చెప్పడం సరికాదంటున్నారు నిపుణులు. కాబట్టి ఓరోజు మీ టీమ్‌, పైఅధికారులతో చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేయండి. మీరు ఈ సంస్థలో చేరినప్పట్నుంచి పని విషయంలో గడించిన అనుభవం గురించి వివరించండి.. ఈ క్రమంలో మిమ్మల్ని ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలపండి. సహోద్యోగులు-బాస్‌తో మీకు ఎదురైన అనుభవాలు, అనుభూతులు.. పంచుకోండి. వీలైతే అందరికీ ఓ చిన్న ట్రీట్‌ ఇవ్వండి. ఇలా చేయడం వల్ల స్నేహపూర్వకంగానే సంస్థ నుంచి మీరు బయటికి వెళ్లినట్లవుతుంది. అలాగే భవిష్యత్తులో మళ్లీ తిరిగి ఇదే సంస్థలోకి రావాలనుకున్నా.. ఇలాంటి పాజిటివిటీ మీకు ప్లస్‌ అవుతుంది.

పూర్తిచేశాకే..!

ఎలాగూ సంస్థ నుంచి బయటికి వెళ్లిపోతున్నామన్న ఉద్దేశంతో.. ఎక్కడి పనుల్ని అక్కడే వదిలేస్తుంటారు కొందరు ఉద్యోగులు. తమ తర్వాత వచ్చిన వారు ఈ పనులన్నీ చూసుకుంటారులే అనుకుంటారు. కానీ ఒక ప్రొఫెషనల్‌గా ఇది కరక్ట్‌ కాదంటున్నారు నిపుణులు. కాబట్టి మీరు కంపెనీని వీడే సమయానికి సంస్థ మీకు అప్పగించిన పనుల్ని పూర్తి చేయండి. ఒకవేళ ఏవైనా పనులు మిగిలినా.. వీలు చూసుకొని ఇంట్లో నుంచి చేయడం, వినయపూర్వకంగా సహోద్యోగులకు అప్పగించడం.. మంచి పద్ధతి. ‘నాకెందుకులే’ అనుకోకుండా.. ఇలా మీ వృత్తిధర్మం మీరు పాటించడం వల్ల.. ఇటు మీకు వ్యక్తిగతంగా, అటు వృత్తిపరంగానూ మీపై ఎలాంటి రిమార్క్‌ రాకుండా జాగ్రత్తపడచ్చు. ఇది మీ కెరీర్‌కూ ప్లస్‌ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్