ప్లాస్టిక్‌తో.. హాని లేకుండా..!

ప్లాస్టిక్‌ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కామనైపోయింది. అయితే ఆరోగ్య స్పృహ, పర్యావరణంపై ప్రేమను క్రమంగా పెంచుకుంటున్న వారు.. ఇప్పుడిప్పుడే దీన్ని తమ జీవనశైలి నుంచి నెమ్మదిగా తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Published : 07 Oct 2023 17:36 IST

ప్లాస్టిక్‌ ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కామనైపోయింది. అయితే ఆరోగ్య స్పృహ, పర్యావరణంపై ప్రేమను క్రమంగా పెంచుకుంటున్న వారు.. ఇప్పుడిప్పుడే దీన్ని తమ జీవనశైలి నుంచి నెమ్మదిగా తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగని ప్లాస్టిక్‌ వస్తువుల్ని బయటపడేసి చేతులు దులిపేసుకుంటే.. అదీ పర్యావరణానికి నష్టమే! అందుకే ఇటు ఆరోగ్యానికి హాని కలగకుండా, అటు పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే.. ఇంట్లోనే వివిధ అవసరాల కోసం వీటిని వినియోగించుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

మొక్కల్ని పెంచుకోవడానికి అవసరమైన కుండీల కోసం బోలెడంత డబ్బు ఖర్చు పెడతాం. అయితే వాటికి బదులు ఇంట్లో కాస్త వెడల్పుగా ఉన్న ప్లాస్టిక్‌ డబ్బాల్ని సగానికి కట్‌ చేసి.. వాటిలో పూల మొక్కలు, కొత్తిమీర-పుదీనా వంటి మొక్కల్ని నాటుకోవచ్చు. ఇవే కాస్త ఆకర్షణీయంగా కనిపించాలంటే.. వాటిపై ఓ స్టిక్కర్‌ అతికిస్తే సరి. ప్లాస్టిక్‌ బాటిల్స్‌నీ ప్లాంటర్స్‌గా మార్చి.. బాల్కనీలో వరుసగా వేలాడదీస్తే ఇంటికి అందమూ వస్తుంది.

ఇంట్లో ఆఫీస్‌ రూమ్‌ ఉన్నా, పిల్లలు చదువుకునే గదిలోనైనా.. పెన్నులు, పెన్సిళ్లు, ఇతర స్టేషనరీ ఐటమ్స్‌ చిందరవందరగా పడుంటాయి. ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌ని సగానికి కట్‌ చేసి దాన్ని పెన్‌ స్టాండ్‌గా వాడుకోవచ్చు. వాటిపై స్టాంప్‌ ఆర్ట్‌ వర్క్‌తో కార్టూన్‌ బొమ్మల్ని ముద్రించి.. పిల్లల స్టడీ టేబుల్‌ దగ్గర గోడకు అమర్చితే భలే బాగుంటుంది. వారికీ నచ్చుతుంది. ఇక కాస్త వెడల్పుగా ఉన్న మెష్‌ తరహా ప్లాస్టిక్‌ ట్రేలను ఫైల్స్‌ అమర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

ఇంటి ముంగిట్లో వాలిన పక్షుల కోసం ఆహారంగా గింజలు చల్లుతుంటారు చాలామంది. నిజానికి ఇలా చల్లినవన్నీ అవి తినవు.. కాబట్టి ఇలా వృథా కాకుండా ఉండాలంటే.. కాస్త మందంగా, పారదర్శకంగా ఉన్న ఓ పొడవాటి ప్లాస్టిక్‌ డబ్బాలో గింజల్ని వేసి.. దానికి పక్క భాగంలో అడుగున చిన్న రంధ్రం చేయాలి. అలాగే ఆ డబ్బా అడుగున పక్షి నిలబడేందుకు ఓ ప్లేట్‌ను అనుసంధానిస్తే.. ఆ రంధ్రంలో నుంచి బయటికొచ్చిన గింజల్ని అవి తింటాయి. మిగిలినవి అందులోనే ఉండిపోతాయి. అలా వాటికి కొన్నాళ్ల పాటు ఆహారం దొరికినట్లవుతుంది.

కొంతమందికి ఇంట్లో వైప్స్‌ వాడడం అలవాటు. అలాంటి వారు విడిగా కొని తెచ్చుకున్న వైప్స్‌ని ఓ పొడవాటి ప్లాస్టిక్‌ కంటెయినర్‌లో అమర్చి.. పై భాగంలో కాస్త వెడల్పుగా కట్‌ చేస్తే.. ఒక్కొక్కటీ తీసుకొని ఉపయోగించుకోవచ్చు.

డ్రస్సింగ్‌ టేబుల్‌లో ఎన్ని అరలున్నా.. బ్యూటీ, హెయిర్‌కేర్‌ ఉత్పత్తుల్ని అందులో పడేస్తుంటాం. దాంతో అది చిందరవందరగా తయారవుతుంది. ఈ సమస్య ఉండకూడదంటే.. బ్యూటీ, హెయిర్‌కేర్‌, ఇతర వస్తువుల్ని విడివిడిగా ప్లాస్టిక్‌ కంటెయినర్స్‌లో అమర్చుకుంటే నీట్‌గా ఉంటుంది. కావాలంటే ఆయా కంటెయినర్స్‌పై విడివిడిగా లేబుల్స్‌ని అతికించుకుంటే సరి!

అప్పుడప్పుడూ పాకెట్‌ మనీ కోసం మనం ఇచ్చిన డబ్బును పొదుపు చేసుకోవాలనుకుంటారు పిల్లలు. ఇలాంటి వారి కోసం ఇంట్లో ఉన్న ప్లాస్టిక్‌ కంటెయినర్‌, పొడవాటి బాటిల్‌తో ఓ మినీ పిగ్గీ బ్యాంక్‌ తయారుచేసివ్వచ్చు. దానికి పైభాగంలో ఓ మూలన కాయిన్స్‌, నోట్స్‌ పట్టేంత రంధ్రం చేసి.. కార్టూన్‌, ఇతర బొమ్మలతో పెయింటింగ్‌ వేసిస్తే.. పిల్లలకు భలే నచ్చుతుంది.

ఇంట్లో మొక్కలు పెంచుకునే వారు.. వాటికి రోజూ నీళ్లు పెట్టడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటప్పుడు ఓ ప్లాస్టిక్‌ బాటిల్‌ నిండా నీరు నింపి.. దాని మూత వద్ద చిన్న రంధ్రం చేయాలి. మొక్క మొదళ్లలో నీళ్లు పడేలా ఈ బాటిల్‌ను తలకిందులుగా వేలాడదీయాలి. ఫలితంగా ఒక్కో చుక్క నీళ్లు పడుతూ.. మట్టి ఎప్పుడూ తేమగా ఉంటుంది. మొక్కలకు రోజూ నీళ్లు పెట్టే శ్రమ కూడా ఉండదు. ఇక బాటిల్‌ ఖాళీ అయ్యాక మళ్లీ నింపి పెడితే సరి!

టెర్రేరియం.. ప్రస్తుతం ఇంటీరియర్‌లో ఇది ఒక భాగమైపోయింది. మినీ అక్వేరియంను పోలి ఉండే మినియేచర్‌ గార్డెన్‌ ఇది. దీన్ని ఏర్పాటు చేసుకోవడానికీ ప్లాస్టిక్‌ కంటెయినర్స్‌ని వాడచ్చు. పారదర్శకంగా ఉండే వెడల్పాటి కంటెయినర్స్‌లో నెమ్మదిగా పెరిగే షోకేస్‌ మొక్కలు లేదంటే లాన్‌ గ్రాస్‌ను ఓవైపు ఏర్పాటుచేసి.. మరోవైపు రంగురంగుల గులకరాళ్లు, చిన్న చిన్న జంతువుల బొమ్మలు.. ఇలా మీకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవచ్చు. అయితే ఇంట్లో వీటిని గాలి, ఎండ తగిలే చోట అమర్చితే సరిపోతుంది.

గిఫ్ట్‌ స్టోరేజ్‌ బాక్సుల్లానూ ప్లాస్టిక్‌ కంటెయినర్స్‌ని ఉపయోగించుకోవచ్చు. మీరు పంపాలనుకున్న బహుమతి సైజును బట్టి బాక్సును ఎంచుకొని.. అందులో గిఫ్ట్‌ని ఉంచి.. పైనుంచి గిఫ్ట్‌ కవర్‌తో ర్యాప్‌ చేయడం లేదంటే బయట దొరికే మెష్‌ ఫ్యాబ్రిక్‌ గిఫ్ట్‌ ర్యాపర్‌తో అలంకరించి పంపిస్తే అవతలి వాళ్లు ఇట్టే ఇంప్రెస్‌ అవుతారు.

ఊరెళ్లేటప్పుడు షాంపూ, కండిషనర్‌, బాడీ లోషన్‌, ఫేస్‌ పౌడర్‌.. వంటివి పెద్ద పెద్ద బాటిల్స్‌ తీసుకెళ్లలేం. ఇలాంటప్పుడు ఇంట్లో ఉండే చిన్న చిన్న ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో కొద్ది మొత్తాల్లో వీటిని నింపుకొని తీసుకెళ్తే లగేజ్‌ బరువూ తగ్గుతుంది.

ఒక్కోసారి మొబైల్‌ ఛార్జింగ్‌ పెట్టుకోవడానికి సాకెట్‌ ఉన్న దగ్గర సోఫా, మంచం, టేబుల్‌.. వంటివి ఉండకపోవచ్చు. అలాంటి చోట.. మొబైల్‌ పట్టేంత వెడల్పుగా ఓ ప్లాస్టిక్‌ కంటెయినర్‌ని కట్‌ చేసుకొని, కిందివైపు రంధ్రం చేసి.. సాకెట్‌కు దగ్గర్లో అమర్చుకుంటే సౌకర్యంగా ఉంటుంది.

నీళ్లు, వెనిగర్‌, బేకింగ్‌ సోడా మిశ్రమం, నిమ్మరసం.. వంటివి ఇంట్లో వస్తువుల్ని శుభ్రం చేయడానికి ఉపయోగిస్తాం. ఇంట్లో ఉండే ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో విడివిడిగా వాటిని నింపుకొని.. స్ప్రే బాటిల్‌కు ఉన్న మూతను బిగిస్తే.. సులభంగా ఉపయోగించుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్