స్వెటర్‌ వేసుకొని పడుకుంటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు!

రగ్గులు, దుప్పట్లు కప్పుకున్నా.. స్వెటర్‌ వేసుకొని పడుకోవడం మనలో చాలామందికి అలవాటు! వెచ్చదనంతో పాటు హాయిగా నిద్రపడుతుందని ఇలా చేస్తుంటాం. అయితే దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఇందుకు చర్మానికి గాలి తగలకపోవడమే ప్రధాన కారణం అంటున్నారు. ఇంతకీ ఏంటా ఆరోగ్య సమస్యలు? రండి.. తెలుసుకుందాం..!

Published : 28 Dec 2021 13:13 IST

రగ్గులు, దుప్పట్లు కప్పుకున్నా.. స్వెటర్‌ వేసుకొని పడుకోవడం మనలో చాలామందికి అలవాటు! వెచ్చదనంతో పాటు హాయిగా నిద్రపడుతుందని ఇలా చేస్తుంటాం. అయితే దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. ఇందుకు చర్మానికి గాలి తగలకపోవడమే ప్రధాన కారణం అంటున్నారు. ఇంతకీ ఏంటా ఆరోగ్య సమస్యలు? రండి.. తెలుసుకుందాం..!

ఇవి తప్పవు!

* స్వెటర్‌ వేసుకొని పడుకోవడం వల్ల వెచ్చదనం మరీ ఎక్కువై రాత్రుళ్లు చెమటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇది రక్తపోటు పడిపోవడానికీ కారణం కావచ్చు. ఇలా ఒకేసారి రక్తపోటు పడిపోవడమనేది మంచి సంకేతం కాదంటున్నారు నిపుణులు.

* అంతేకాదు.. ఇలా స్వెటర్‌ వేసుకొని పడుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత బయటికి వెళ్లిపోకపోవడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు నిపుణులు. తద్వారా తల తిరగడం, మైకం, అలసట.. వంటివి తలెత్తుతాయట.

*  గుండె సంబంధిత సమస్యలున్న వారు, మధుమేహులు పడుకునేటప్పుడు స్వెటర్‌ వేసుకోకపోవడమే మేలంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల చర్మానికి గాలి తగలక.. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందట!

* శీతల గాలులు చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి. వీటి నుంచి రక్షించుకోవడానికి రాత్రింబవళ్లూ స్వెటర్‌ వేసుకొనే ఉంటాం. అయితే దీనివల్ల చర్మం పొడిబారే సమస్య అధికమవుతుందంటున్నారు నిపుణులు. తద్వారా అలర్జీ, ఎగ్జిమా.. వంటి చర్మ సంబంధిత సమస్యలకు దారితీయచ్చు.

* స్వెటర్‌ వేసుకొని పడుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. తద్వారా ఊపిరి అందకపోవడం, మైకంగా అనిపించడం.. వంటి సమస్యలొస్తాయి.

* ఒంటికి స్వెటరే కాదు.. కాళ్లకు సాక్సులు, చేతులకు గ్లౌజులూ ధరించే వారు లేకపోలేదు. దీనివల్ల చెమటలొచ్చి బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు దాడిచేసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే కాళ్లు, చేతులకు ఎంతగా గాలి తగలనిస్తే అంత మంచిది.

పిల్లల విషయంలో అతి వద్దు!

మనమే చలికి తట్టుకోలేకపోతున్నాం.. చిన్నారులకు ఇది మరింత ప్రతికూల కాలం అనుకుంటుంటారు చాలామంది. ఈ క్రమంలో శిశువుల్ని కాస్త మందంగా ఉండే ఊలు వస్త్రంలో ర్యాప్‌ చేయడం, ముఖం తప్ప మిగతా శరీర భాగాలన్నీ కవరయ్యేలా స్వెటర్‌ వేయడం, చేతులకు గ్లౌజులు-కాళ్లకు సాక్సులు వేయడం, తలకు క్యాప్‌ పెట్టడం.. వంటి అదనపు జాగ్రత్తలు తీసుకుంటుంటారు తల్లులు. అయితే ఈ అతే వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే చిన్న పిల్లలైనా, వాళ్ల చర్మం సున్నితంగానే ఉన్నప్పటికీ.. వాళ్లు కూడా పెద్దలు తట్టుకునే ఉష్ణోగ్రతను తట్టుకోగలరని చెబుతున్నారు నిపుణులు. అలాగే మందపాటి స్వెటర్లను వాళ్లకు తొడగడం వల్ల చెమట ఎక్కువగా వచ్చి శరీరం తేమను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలా శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల శిశువుల్లో ఒక్కోసారి Sudden Infant Death Syndrome (SIDS) కూ దారితీయచ్చట! అందుకే పిల్లల్ని మందపాటి దుస్తుల్లో బంధించేయడం కాకుండా.. కాటన్‌ దుస్తులు వేయడం, గదిలో వెచ్చదనం ఉండేలా రూమ్‌ హీటర్స్ వాడడం.. వంటి చిన్న పాటి జాగ్రత్తలు తీసుకోవడం మేలు!

ప్రత్యామ్నాయంగా..!

* వాతావరణంలో చలి ఎక్కువగా ఉంది.. కచ్చితంగా స్వెటర్‌ వేసుకోవాలనుకుంటే.. ముందు పొడవాటి చేతులున్న కాటన్‌ లేదా సిల్క్‌ దుస్తులు వేసుకొని.. ఆపై పల్చగా ఉన్న స్వెటర్‌ వేసుకోవడం వల్ల.. చర్మం ఉష్ణోగ్రత బ్యాలన్స్ అవడంతో పాటు అవి చెమటను కూడా పీల్చుకుంటాయి.

* స్వెటర్లకు ఉండే సన్నటి పోగులు చర్మానికి తాకడం వల్ల కూడా దురద వస్తుంది. ఈ చిరాకు వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అలాంటప్పుడు ముందు చర్మానికి మాయిశ్చరైజర్‌, లేదా ఏదో ఒక నూనె రాసుకొని ఆపై పల్చటి స్వెటర్‌ వేసుకోవడం ఉత్తమం.

* ఈ సమస్యలన్నీ ఎందుకు అనుకునే వాళ్లు స్వెటర్‌కు బదులుగా.. పడకగదిలో ఓ రూమ్ హీటర్‌ను ఏర్పాటు చేసుకుంటే ఫలితం ఉంటుంది. అయితే దీని ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా కాకుండా సెట్‌ చేసుకోవడం తప్పనిసరి! లేదంటే చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఉంటుంది.

స్వెటర్‌ వేసుకొని పడుకోవడం వల్ల ఈ అనారోగ్యాలతో పాటు ఇతరత్రా సమస్యలేవైనా తలెత్తితే నిర్లక్ష్యం చేయకుండా ఓసారి సంబంధిత నిపుణుల్ని సంప్రదించడం ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్