Swati Mishra : ‘రామ్‌ ఆయేంగే’ అంటూ మోదీని మెప్పించింది!

ప్రస్తుతం దేశమంతా రామ నామ స్మరణతో మార్మోగుతోంది. జనవరి 22న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించే వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రీరాముడిపై ఇటీవలే రూపొందించిన ఓ భక్తి పాట భారతీయుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది.

Updated : 04 Jan 2024 16:18 IST

(Photos: Instagram)

ప్రస్తుతం దేశమంతా రామ నామ స్మరణతో మార్మోగుతోంది. జనవరి 22న జరగబోయే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం గురించే వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే.. శ్రీరాముడిపై ఇటీవలే రూపొందించిన ఓ భక్తి పాట భారతీయుల్ని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతోంది. ‘రామ్‌ ఆయేంగే - రాముడొస్తాడు, మన బాధలన్నీ తొలగిస్తాడు..’ అంటూ హిందీలో సాగే ఈ పాటకు తాజాగా ప్రధాని మోదీజీ కూడా మంత్రముగ్ధులయ్యారు. ఇదే పాటను ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేస్తూ.. ఈ పాటను ఆలపించిన గాయనిని ప్రశంసల్లో ముంచెత్తారు. ఆ సింగర్‌ మరెవరో కాదు.. ఇలాంటి ఎన్నో భక్తి పాటలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్వాతి మిశ్రా. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

స్వాతి మిశ్రాది బిహార్‌ ఛప్రా నగరంలోని మాలా అనే గ్రామం. స్థానికంగానే ప్రాథమిక విద్య పూర్తిచేసిన ఆమె.. పైచదువుల కోసం ‘బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం’లో చేరింది. అయితే చిన్న వయసు నుంచే సంగీతమంటే మక్కువ చూపే స్వాతి.. భవిష్యత్తులో గాయనిగా స్థిరపడాలనుకుంది. ఈ క్రమంలోనే బనారస్‌ యూనివర్సిటీలో ఉన్నప్పుడే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకుంది. ఆపై కెరీర్‌ అవకాశాల కోసం ముంబయి వచ్చి స్థిరపడింది.

యూట్యూబ్‌ క్వీన్‌గా..!

అద్భుతమైన గాత్రం ఉన్న స్వాతి తన సంగీత నైపుణ్యాల్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలోనే రెండు యూట్యూబ్‌ ఛానల్స్‌ని ప్రారంభించిందామె. ‘స్వాతి మిశ్రా’ పేరుతో ప్రారంభించిన యూట్యూబ్‌ ఛానల్‌లో పాటలకు కవర్‌ సాంగ్స్‌ రూపొందిస్తూ, సొంతంగా పాటలు రాసి.. ఇతర గాయకులతో కలిసి పాడుతూ.. ఆ వీడియోల్ని పోస్ట్‌ చేస్తుంటుందామె. ఇక ‘స్వాతి మిశ్రా భక్తి’ పేరుతో మరో యూట్యూబ్‌ ఛానల్‌ని ప్రారంభించిన ఈ బిహారీ గాయని.. తాను రాసి-పాడిన భక్తి పాటల్ని, మరికొన్ని భక్తి పాటల కవర్‌ సాంగ్స్‌ని ఇందులో పోస్ట్‌ చేస్తోంది. ఇలా ఆమె పాడిన పాటల్లో ‘హీరియే’, ‘చాంద్‌ బలియాన్‌’, ‘తేరే వాస్తే’, ‘తోసే సజ్నా’, ‘కహానీ సునో’.. వంటి పాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. లక్షల కొద్దీ వ్యూస్‌ని తెచ్చిపెట్టాయి. ఇలా తన గాత్ర నైపుణ్యాలతో యూట్యూబ్‌ క్వీన్‌గా ఎదిగిన ఈ బ్యూటిఫుల్‌ సింగర్‌.. వేదికలపైనా ప్రత్యక్షంగా సంగీత ప్రదర్శనలిస్తుంటుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా జరిగే పండగ వేడుకలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల్లో భోజ్‌పురీ గీతాలు, భక్తి పాటలు ఆలపిస్తూ ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది స్వాతి.

మెప్పించిన ‘రామ్‌ ఆయేంగే’!

పండగలు, ప్రత్యేక సందర్భాలకు తగినట్లుగా పాటలు రూపొందిస్తూ, కవర్‌ సాంగ్స్‌ పాడుతూ.. వాటిని తన యూట్యూబ్‌ ఛానల్స్‌లో పోస్ట్‌ చేసే స్వాతి.. గతేడాది దీపావళి పండక్కి మరో పాట రాసి పాడింది. రాముడు 14 ఏళ్ల వనవాసం పూర్తిచేసుకొని తిరిగి అయోధ్యలో అడుగుపెట్టిన సందర్భంగా దీపావళి జరుపుకుంటాం. ఈ నేపథ్యంలోనే రాముడి గొప్పతనాన్ని చాటుతూ ‘రామ్‌ ఆయేంగే’ అనే ఓ పాట రాసిందామె. ‘మేరీ ఝోప్‌డీ కే భాగ్‌ ఆజ్‌ ఖుల్‌ జాయేంగే.. రామ్‌ ఆయేంగే’ అంటూ సాగే ఈ పాటలో.. ‘రాముడొస్తాడు.. మన జీవితాల్లోని బాధలన్నీ తొలగిస్తాడు.. ఆయనకు ప్రీతిపాత్రమైన వంటకాలతో స్వాగతం పలుకుతాం.. ముంగిలిని దీపాలతో శోభాయమానంగా అలంకరించాం..’ అనే అర్థం వచ్చేలా బాణీలు సమకూర్చింది స్వాతి. ఈ పాట ఎంత వినసొంపుగా ఉందో.. ఆమె గాత్రం కూడా అంతే వీనుల విందు చేస్తుందని చెప్పచ్చు. అందుకే ఈ పాట వీడియోను కేంద్ర మంత్రి అశ్వినీ ఛౌబే, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ స్వాతిని ప్రశంసించారు.

మోదీజీ ప్రశంసలు!

ఇలా ఇప్పటికే పది లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోన్న ఈ వీడియో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆకట్టుకుంది. దీంతో ఈ పాట వీడియోను ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేసిన ఆయన.. ‘అయోధ్యా రాముడికి స్వాగతం పలుకుతూ స్వాతీజీ రాసి పాడిన ఈ భజన పాట, ఆమె గాత్రం అత్యద్భుతం..’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. దీంతో ఈ యువ సింగర్‌ ట్యాలెంట్ మరోసారి దేశవ్యాప్తమైంది. ప్రస్తుతం స్వాతి యూట్యూబ్‌ ఛానల్స్‌కు 11 లక్షల మందికిపైగా సబ్‌స్క్రైబర్లున్నారు. ఇన్‌స్టాలోనూ చురుగ్గా ఉండే ఈ అందాల గాయనిని.. 8 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్