Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!

మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్లు చాలామందిని స్థూలకాయులుగా మారుస్తున్నాయి. ఒక్కసారి బరువు పెరిగితే పలు సమస్యలు వేధిస్తుంటాయి. అందుకే అధిక బరువు సమస్యతో బాధపడేవారు బరువు తగ్గడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే, ఇందులో కొంతమంది మాత్రమే విజయం సాధిస్తుంటారు. 

Published : 14 Mar 2024 19:08 IST

(Photos: Screengrab)

మారుతున్న జీవనశైలి, ఆహారపుటలవాట్లు చాలామందిని స్థూలకాయులుగా మారుస్తున్నాయి. ఒక్కసారి బరువు పెరిగితే పలు సమస్యలు వేధిస్తుంటాయి. అందుకే అధిక బరువు సమస్యతో బాధపడేవారు బరువు తగ్గడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే, ఇందులో కొంతమంది మాత్రమే విజయం సాధిస్తుంటారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన సమంత (25) ముందు వరుసలో ఉంటుంది. ఒకానొక సమయంలో 110 కిలోల బరువున్న ఆమె ఏడాది సమయంలోనే 45 కిలోల బరువు తగ్గింది. ఇందుకోసం తన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో తన ‘Weight Loss Journey' గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందామా...

అనారోగ్యకరమైన బంధం..!

నేను సహజ పద్ధతులను అనుసరించి ఏడాది సమయంలో 45 కిలోల బరువు తగ్గా. ఇందుకోసం నేను ఫిట్‌నెస్ ట్రైనర్స్‌ను సంప్రదించలేదు. అలాగే బరువు తగ్గే సెషన్స్‌కు వెళ్లలేదు. సహజసిద్ధ పద్ధతుల్లోనే నా లక్ష్యాన్ని చేరుకున్నా. అయితే నన్ను చూసి చాలామంది ఆశ్యర్యపోయారు. ‘బరువు తగ్గడం చాలా కష్టం.. ఇందుకు చాలా సమయం పడుతుంది.. నేనైతే అన్ని రోజులు ప్రయత్నించలేను’ అని చెప్పుకొచ్చారు. అందుకే నా ప్రయాణాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ‘Eating Disorder’ సమస్య ఉంది. అది ఒక రకంగా నాకు, ఆహారానికి మధ్య అనారోగ్యకరమైన బంధం ఏర్పడేలా చేసింది. అలా బాల్యం నుంచే నేను అధిక బరువుతో బాధపడ్డా. దానివల్ల ఆటలకు కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. దీనికి తోడు ఆరోగ్య సమస్యల వల్ల ఎక్కువ సమయం క్లినిక్‌లలోనే గడిపాను. ఆరోగ్యపరంగా పలు సవాళ్లను ఎదుర్కొన్నా. కొవిడ్ వరకు నా పరిస్థితి ఇలాగే ఉండేది.

నన్ను నేను అర్థం చేసుకున్నా..!

కొవిడ్‌ తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో ఆసుప్రతిలో పేషెంట్ల తాకిడి ఎక్కువగా ఉండేది. నర్సుగా పని చేసే నాకు ఎక్కువ షిఫ్టుల్లో పనిచేయాల్సి వచ్చింది. దానివల్ల తొందరగా అలిసిపోయేదాన్ని. అలాగే కొంతమంది వయసు పైబడిన పేషెంట్లు ఇతరుల సహాయం లేనిదే నడిచే పరిస్థితి ఉండేది కాదు. ఈ సంఘటనలు నా ఆలోచనా విధానాన్ని మార్చాయి. దాంతో బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. ఈ ప్రయాణంలో నేను మొదటగా నన్ను నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టా. అంటే అసలు నేను ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాను? అది నా శరీరంపై ఏవిధమైన ప్రభావం చూపిస్తోంది? అనేది నెమ్మదిగా అర్థం చేసుకున్నా. అలా రెండు సంవత్సరాలు గడచిపోయాయి. ఆ తర్వాత ఇంకొంచెం సీరియస్‌గా తీసుకున్నా. ప్రతిరోజు ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నాను? అనే విషయాన్ని కూడా గమనించా. ఇందుకోసం నా ఆలోచనా విధానాన్ని కూడా మార్చుకున్నా. చిన్న లక్ష్యాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తూనే ప్రయాణాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టా.

నడకే ప్రధానం..!

ఎప్పుడైతే నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నానో అప్పట్నుంచి నా ప్రయాణం కూడా కష్టమనిపించలేదు. నేను కూడా దీన్ని వెయిట్‌ లాస్ జర్నీగా చూడలేదు. నా జీవనశైలిలో మార్పు కిందే భావించా. ఎందుకంటే ఈ ప్రయాణంలో శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేసే పలు అలవాట్లను నేర్చుకున్నా. ఇక నా జర్నీలో నేను పెట్టుకున్న ప్రధాన నియమం వాకింగ్‌. ప్రతి రోజూ తప్పకుండా 10 వేల అడుగులు అంటే దాదాపు 8 కిలోమీటర్లు నడవాలన్న నియమాన్ని పెట్టుకున్నా. దీనికి అనుబంధంగా వారంలో నాలుగు రోజులు జిమ్‌.. ఒక రోజు 5 కిలోమీటర్లు రన్నింగ్ చేయాలన్న నియమం పెట్టుకున్నా. వీటిని క్రమం తప్పకుండా పాటిస్తూనే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకున్నా.

ఒక్క రోజులోనే బరువు పెరగలేదు కదా..!

బరువు తగ్గాలంటే తీసుకునే క్యాలరీలు తగ్గించుకోవాలని చాలామంది నిపుణులు చెబుతుంటారు. నేను కూడా ఆ సూత్రాన్ని పాటించా. ఉదాహరణకు సంప్రదాయ పిజ్జాలకు బదులుగా పోషక పదార్థాలతో ర్యాప్ చేసిన పిజ్జాలను ఆహారంలో భాగం చేసుకున్నా. ఇందులో తక్కువ క్యాలరీలు ఉండడంతో పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది. ప్రతి రోజూ రెండు నుంచి మూడు లీటర్ల మంచి నీళ్లను తాగడం అలవరచుకున్నా. మనం ఇంట్లో చేసే ఎన్నో పనుల వల్ల శరీరానికి వ్యాయామం అందుతుంది. అయితే వాటిని ఆస్వాదిస్తూ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అందుకే ఇంట్లో ప్రతి పనిని ఆస్వాదిస్తూ చేయడం మొదలుపెట్టా. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూనే ఎవరి సహాయం లేకుండానే ఏడాదిలో 45 కిలోల బరువు తగ్గా. అయితే చాలామంది ఈ జాగ్రత్తలు రోజూ పాటించడం కష్టం కదా అంటుంటారు. అదీ నిజమే.. నేను కూడా కొన్ని సందర్భాల్లో నా ప్రణాళికను ఫాలో అవ్వలేకపోయాను. అలాగని నా ప్రయాణాన్ని ఆపలేదు. అందుకే బరువు తగ్గాలన్న లక్ష్యాన్ని చేరుకున్నా. నాలాగే బరువు తగ్గాలనుకునే వారికి నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. మనం ఒక్క రోజులోనే బరువు పెరగలేదు. కాబట్టి, ఒక్క రోజులోనే తగ్గడం కూడా అసాధ్యం. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఓపిగ్గా ప్రయత్నిస్తే మీరు కూడా కచ్చితంగా బరువు తగ్గుతారు. ఆల్‌ ది బెస్ట్!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్