ఐదేళ్లకే టెడెక్స్‌ స్పీకరైంది!

సాధారణంగా ఐదేళ్ల పిల్లలు ఒకటో తరగతో, రెండో తరగతో చదువుతుంటారు. కాస్త యాక్టివ్‌గా ఉన్న చిన్నారులైతే.. నచ్చిన వ్యాపకాలపైనా దృష్టి పెడతారు. కానీ, భారత సంతతికి చెందిన ఐదేళ్ల కియారా కౌర్‌ మాత్రం ఏకంగా పుస్తకాలతో కుస్తీ పడుతూ రికార్డుల  మీద రికార్డులు సృష్టిస్తోంది.

Published : 18 Nov 2021 18:11 IST

(Photo: Instagram)

సాధారణంగా ఐదేళ్ల పిల్లలు ఒకటో తరగతో, రెండో తరగతో చదువుతుంటారు. కాస్త యాక్టివ్‌గా ఉన్న చిన్నారులైతే.. నచ్చిన వ్యాపకాలపైనా దృష్టి పెడతారు. కానీ, భారత సంతతికి చెందిన ఐదేళ్ల కియారా కౌర్‌ మాత్రం ఏకంగా పుస్తకాలతో కుస్తీ పడుతూ రికార్డుల  మీద రికార్డులు సృష్టిస్తోంది. నాలుగేళ్ల వయసులోనే.. రెండు గంటల వ్యవధిలో 36 పుస్తకాలు చదివి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇక ఇటీవలే ‘బాలల దినోత్సవం’ సందర్భంగా టెడెక్స్‌ వేదికపై ప్రసంగించి.. ‘ప్రపంచంలోనే అతి పిన్న టెడెక్స్‌ స్పీకర్‌’గా ఘనత సాధించింది. ఈ నేపథ్యంలో ఈ బాల మేధావి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

ఒక్క పదాన్నీ వదిలేది కాదు!

కియారా కౌర్‌ యునైటెడ్‌ స్టేట్స్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు చెన్నైకి చెందినవారు. వారిద్దరూ వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం కియారా కుటుంబం అబుదాబిలో స్థిరపడింది. కియారా పదాలు నేర్చుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచే పుస్తకాలు చదవడంపై తనకున్న ఆసక్తి ఏంటో ఆమె తల్లిదండ్రులకు అర్థమైంది. ఈ క్రమంలో గోడలపై అతికించిన పోస్టర్లు, హోర్డింగులపై రాసున్న పదాలను కూడా వదిలేది కాదట! ఓరోజు పాఠశాల గ్రంథాలయంలో కూర్చొని తదేకంగా పుస్తకాలు చదవడం చూసి ఆ స్కూల్‌లో పనిచేసే ఓ టీచరే ఆశ్చర్యపోయిందని చెబుతున్నారు ఆమె తల్లిదండ్రులు. ఇలా కియారాకు చదువుపై ఆసక్తి పెరగడానికి ఆమె తాతయ్య కూడా ఓ కారణమేనంటున్నారు వారు. ఆయనకు కూడా కథలు వినడం, పుస్తకాలు చదవడమంటే మక్కువని, ఇదే ఇష్టం ఆయన మనవరాలికి కూడా వచ్చిందంటోంది కియారా తల్లి.

(Photo: World book of Records)

బాల మేధావిగా..!

ఇలా ఇప్పటి వరకు 2000పైచిలుకు పుస్తకాలు చదివిందట ఈ బాల మేధావి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓ కార్యక్రమంలో 105 నిమిషాల్లోనే 36 పుస్తకాలు ఏకధాటిగా చదివి ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. అలాగే ఆగకుండా ఎక్కువ పుస్తకాలు చదివినందుకు గానూ ‘ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. పుస్తకాలను ఆన్‌లైన్‌లో కంటే ఆఫ్‌లైన్‌లో చదవడానికే ఆసక్తి చూపుతానంటోందీ ఐదేళ్ల చిన్నారి. ‘నేను పుస్తకాలు చదవడాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తాను. పుస్తకాలను ఎక్కడికైనా తీసుకెళ్లచ్చు. అదే ఆన్‌లైన్‌లో పుస్తకాలు చదవడమంటే నాకు అంత సౌకర్యంగా అనిపించదు. అలాగే కొన్నిసార్లు ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో లేనప్పుడు చదువుకు బ్రేక్‌ పడచ్చు. అదే ఆఫ్‌లైన్‌లో ఆ సమస్య ఉండదు. అందుకే నాకు నేరుగా పుస్తకాలు చదవడమంటేనే ఇష్టం’ అంటోందీ బుక్‌ లవర్‌. ఇక కియారాకు ‘అలిస్ ఇన్ వండర్‌ల్యాండ్‌’, ‘సిండ్రెల్లా’, ‘లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్’, ‘షూటింగ్ స్టార్’.. వంటి పుస్తకాలంటే చాలా ఇష్టమట.

టెడెక్స్‌ స్పీకర్‌గా!

పుస్తకాల పురుగైన కియారా.. ఇటీవలే టెడెక్స్‌ స్పీకర్‌గానూ సరికొత్త అవతారమెత్తింది. ‘బాలల దినోత్సవం’ సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ వేదికగా టెడెక్స్‌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిందీ చిన్నారి. నిజానికి జీవితంలోని కష్టాలకోర్చి.. విజయం సాధించిన ప్రముఖులు తమ సక్సెస్‌ స్టోరీస్‌ని ఈ వేదికగా పంచుకోవడం మనం చూస్తుంటాం. అలాంటిది కేవలం ఐదేళ్ల వయసులోనే ఈ వేదికపై ప్రసంగించి ‘ప్రపంచంలోనే అతి పిన్న టెడెక్స్‌ స్పీకర్‌’గా అరుదైన ఘనత దక్కించుకుంది కియారా.

అంతేకాకుండా.. ‘Dairy of a 5-Year-Old Genius Chatterbox Who Set World Records’ పేరుతో ఓ పుస్తకం కూడా రాసింది. త్వరలో విడుదల చేయనున్న ఈ పుస్తకం రాయడానికి ఆమెకు ఏడు నెలల సమయం పట్టిందట!

మరి, నీ భవిష్యత్తు లక్ష్యం ఏంటని కియారాని అడిగితే.. ‘ఓవైపు డాక్టరై ప్రజలకు సేవ చేయాలని అనిపిస్తుంది.. మరోవైపు నాయకురాలిగా ఎదిగి అవసరార్థుల్ని ఆదుకోవాలనిపిస్తుంది..’ అంటూ తన మనసులోని మాటల్ని పంచుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్