40 దాటిందా... జాగ్రత్త పడదాం!

నలభై దాటిన ప్రతి మహిళా తప్పక ఆలోచించాల్సిన విషయం రొమ్ము క్యాన్సర్‌. వయసు పెరుగుతున్నా... బరువు అదుపు తప్పుతున్నా ఇంట్లో ఎవరైనా క్యాన్సర్‌ బారిన పడ్డా మరింత అప్రమత్తం కావాల్సిందే.

Updated : 13 Oct 2022 07:59 IST

అంతర్జాతీయ రొమ్ముక్యాన్సర్‌ అవగాహన మాసం సందర్భంగా...

నలభై దాటిన ప్రతి మహిళా తప్పక ఆలోచించాల్సిన విషయం రొమ్ము క్యాన్సర్‌. వయసు పెరుగుతున్నా... బరువు అదుపు తప్పుతున్నా ఇంట్లో ఎవరైనా క్యాన్సర్‌ బారిన పడ్డా మరింత అప్రమత్తం కావాల్సిందే. చాపకింద నీరులా చుట్టుముట్టేస్తున్న ఈ మహమ్మారికి సంబంధించి అవగాహన పెంచుకుందాం....

అపోహలు  -   వాస్తవాలు

అపోహ: రొమ్ములో ఉండే గడ్డలన్నీ క్యాన్సర్‌కి దారి తీస్తాయి.
వాస్తవం: పదిమంది రొమ్ముల్లో గడ్డలతో బాధపడుతుంటే వారిలో ఒక్కరికి క్యాన్సర్‌ గడ్డలుండొచ్చు. అయితే నిపుణుల ఆధ్వర్యంలోనే.. ఏవి సాధారణం, ఏవి క్యాన్సర్‌వి అనేవి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ట్రిపుల్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష చేయించుకోవాలి. ఇందులో భాగంగా ముందుగా క్లినికల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌ చేస్తారు. తర్వాత మామ్మోగ్రఫీ, అల్ట్రాసౌండ్‌ సాయంతో కోర్‌ నీడిల్‌ బయాప్సీ పరీక్ష చేసి వ్యాధి నిర్ధరణ చేస్తారు.

అపోహ: క్యాన్సర్‌ ఎందువల్ల వస్తుందో మాకు తెలుసు.
వాస్తవం: మనకు తెలియని కారణాలూ ఎక్కువే. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్‌ ఉంటే... తర్వాతి తరాలకు వచ్చే అవకాశం ఉంది. నెలసరులు త్వరగా మొదలైనా, మెనోపాజ్‌ ఆలస్యంగా వచ్చినా, పిల్లలు పుట్టకపోయినా, 30 తర్వాత పుట్టినా, హార్మోన్‌ చికిత్స దీర్ఘకాలం తీసుకుంటున్నా, అధిక బరువున్నా రావొచ్చు.

అపోహ: కుటుంబంలో ఎవరికైనా ఒకరికి ఉంటే మనకీ కచ్చితంగా వస్తుంది.
వాస్తవం: దగ్గరి కుటుంబీకుల్లో ఎవరికైనా 40 ఏళ్లు లోపు వాళ్లకి ఈ వ్యాధి వచ్చినా, కుటుంబ చరిత్రలో ఎవరికైనా మగవాళ్లకి రొమ్ము క్యాన్సర్‌ ఉన్నా, దగ్గరి కుటుంబీకుల్లో ఎవరికైనా అండాశయ క్యాన్సర్‌ ఉన్నా ఐదు నుంచి పదిశాతం జన్యువుల ద్వారా
రావడానికి ఆస్కారం ఉంది.

అపోహ: జెనెటిక్‌ టెస్ట్‌ చేయించుకుంటే క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తెలిసిపోతాయి.
వాస్తవం: సరైన జెనెటిక్‌ కౌన్సెలింగ్‌ లేకుండా ఈ పరీక్ష చేయించుకోవడం వల్ల అనవసరపు ఆందోళ పెరుగుతుందే తప్ప నిర్ధరణకు మాత్రం రాలేం. ఎందుకంటే... ఎవరికైనా కుటుంబ చరిత్రలో ఉంటే అప్పుడు మనకి ఈ టెస్ట్‌లో యావరేజ్‌ రిస్క్‌ అని చూపిస్తుంది. కానీ అందులో కేవలం 10శాతం మందికే రావొచ్చు. అలాంటప్పుడు ఈ టెస్ట్‌ అవనసరపు ఆందోళన తెచ్చిపెడుతుందనే చెప్పాలి.

అపోహ: దుస్తుల్లో సెల్‌ఫోన్‌ పెట్టుకోవడం వల్ల క్యాన్సర్‌ వస్తుంది.
వాస్తవం: దీన్ని నిర్ధరించే అధ్యయనాలేమీ లేవు. కానీ సెల్‌ఫోన్‌ని శరీరానికి దూరంగా ఉంచుకోవడం మంచిది. పాకెట్‌లో, లోదుస్తుల్లో ఎక్కువ సేపు ఉంచుకోవడం మంచిది కాదు.

అపోహ: బీఎస్‌ఈ (బ్రెస్ట్‌ సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌), బ్రెస్ట్‌ అవేర్‌నెస్‌ రెండూ ఒకటే
వాస్తవం: బీఎస్‌ఈ.. నెలలో ఒకసారి స్వీయపరీక్ష చేసుకుంటూ రొమ్ముల్లో మార్పుని గుర్తించడం. ఇక అవగాహన అనేది ఇంతకుమించి ఉంటుంది. ప్రతి రోజు రొమ్ములని గమనించుకోవాలి. నొప్పిలేని గడ్డలున్నా, రొమ్ముల పరిమాణాల్లో హెచ్చుతగ్గులున్నా, చనుమొనలు లోపలికి వెళ్లిపోయినా, అక్కడ ఎర్రని రాష్‌ ఏర్పడినా, రక్తంతో కూడిన స్రావం అవుతున్నా, ఆ ప్రాంతంలో సొట్టలు పడినా, బాహుమూలాల కింద వాపు గమనించినా ఇవన్నీ అసాధారణ మార్పుగా పరిగణించి డాక్టర్‌కి రిపోర్ట్‌ చేయాలి. 40 దాటితే ఏటా మామ్మోగ్రామ్‌ చేయించుకుంటే మేలు.

అపోహ: మామ్మోగ్రఫీ చాలా నొప్పితో కూడిన వ్యవహారం. ఇందులో రేడియేషన్‌ని కూడా వాడతారు కాబట్టి ఇది ప్రమాదం.
వాస్తవం: కాస్త అసౌకర్యం ఉన్నా.. అంత ఎక్కువ నొప్పి ఉండదు. ఇందులో తక్కువ మొత్తంలో రేడియేషన్‌ని వాడతారు కాబట్టి ఫర్వాలేదు.

అపోహ: బ్రెస్ట్‌ క్యాన్సర్‌ని రాకుండా చేయొచ్చు.
వాస్తవం: నిజం కాదు. దీనిని రాకుండా అడ్డుకోలేం. మంచి జీవనశైలి, పోషకాహారం, వ్యాయామం, ధ్యానం వంటివాటితో వ్యాధి వచ్చే అవకాశాలని తగ్గించుకోవచ్చు.

- డాక్టర్‌ రఘురామ్‌, డైరెక్టర్‌, కన్సల్టెంట్‌ సర్జన్‌- కిమ్స్‌:
ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీజెస్‌, కిమ్స్‌ ఆసుపత్రి, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్