దాంపత్యంలో సంతోషం..

బతకడానికి సరిపడా ఉద్యోగాలు, ఆస్తి, అంతస్థు ఉన్నా కొందరు దంపతులు నిత్యం నిరాశగా కనిపిస్తారు. మరికొందరు ఆర్థికంగా ఎలా ఉన్నా.. ఉన్నదాంతోనే తృప్తిగా జీవిస్తుంటారు. వీరి దాంపత్య రహస్యం

Published : 17 Sep 2022 00:17 IST

బతకడానికి సరిపడా ఉద్యోగాలు, ఆస్తి, అంతస్థు ఉన్నా కొందరు దంపతులు నిత్యం నిరాశగా కనిపిస్తారు. మరికొందరు ఆర్థికంగా ఎలా ఉన్నా.. ఉన్నదాంతోనే తృప్తిగా జీవిస్తుంటారు. వీరి దాంపత్య రహస్యం సంతోషమే. ఈ రహస్యం తెలిసినవారు జీవితమంతా ఉత్సాహంగా గడపడానికి ప్రాముఖ్యతనిస్తారు. అందరు భార్యాభర్తల మధ్యా వాదోపవాదాలు, అభిప్రాయభేదాలు వస్తూనే ఉంటాయి. వాటిని సమన్వయం చేసుకొనే నైపుణ్యం ఉండాలి. ఏ సమస్య అయినా దూదిపింజలా ఎగిరి పోవాలి. ఎదుటివారి వాదన పూర్తిగా విని, వారికి మర్యాదనిస్తే చాలు. చాలా గొడవలను మొగ్గ దశలోనే తుంచేయవచ్చు. అలాకాకుండా దాన్ని పొడిగిస్తే ఇరువురి నడుమా దూరం పెరిగే ప్రమాదం ఉంది. సమస్య పెరిగితే బంధం బలహీన పడుతుందనే ఆలోచన ఏ ఒక్కరికి ఉన్నా చాలు. అక్కడితో ఆ వాదనను ఆపేయొచ్చు. సంతోషంగా ముందడుగు వేయొచ్చు.

లోపాలొద్దు..
ఎదుటివారి లోపాలను వెతికితే వారిపై ప్రేమ స్థానంలో ద్వేషం మొదలవుతుంది. అలా కాకుండా వారి సామర్థ్యాలు, ప్రత్యేకతలు గుర్తిస్తే, ప్రేమ మరింత పెరుగుతుంది. ఇరువురూ సమానమే అనే భావనతో ఉండటం, బాధ్యతలను సమంగా పంచుకోవడం వంటివి ఒకరిపై మరొకరికి గౌరవాన్ని పెంచుతాయి. అవతలివారి మనసు తెలుసుకొని, వారి ఆలోచనలకు ప్రాముఖ్యతనివ్వాలి. వారికి భావ ప్రకటన స్వేచ్ఛనివ్వాలి. ప్రతి చిన్న సందర్భాన్నీ సంతోషంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తే, ప్రతి నిమిషమూ ఆనందమే.


క్షమించమని..

తెలిసో, తెలియకో మీవల్ల పొరపాటు జరిగిందని తెలిసినప్పుడు భాగస్వామిని క్షమాపణ అడగాలి. ఆ పొరపాటువల్ల వారికి ఏదైనా నష్టం జరిగి ఉండొచ్చు. దానికి మీరడిగిన క్షమాపణ కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. ఇద్దరికీ ఇష్టమైన ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లొస్తే ఆ బంధం మరింత దగ్గరవుతుంది. ప్రియ సంభాషణ, నచ్చిన పుస్తక పఠనం వంటివన్నీ సంతోషానికి కేరాఫ్‌ అడ్రస్‌లే. ఏ సమస్య వచ్చినా నేనున్నాననే భరోసా ఎదుటివారికి ఇవ్వగలిగి, ఆ చేతిని విడవకుండా ఉంటే చాలు. ఆ సంసార నావది ఒడుదొడుకుల్లేని ప్రయాణమే అవుతుంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని