గనిలో.. పనిలో.. మనం!

కొన్నేళ్ల క్రితం వరకూ అక్కడ.. ‘పురుషులకు మాత్రమే’ ఉద్యోగాలుండేవి! ఇప్పుడా పరిస్థితి మారింది. అమ్మాయిలే స్వయంగా పోరాడి.. భూగర్భంలో విధులు నిర్వహించే అవకాశాలు సాధించుకున్నారు.

Updated : 10 Jul 2023 07:26 IST

కొన్నేళ్ల క్రితం వరకూ అక్కడ.. ‘పురుషులకు మాత్రమే’ ఉద్యోగాలుండేవి! ఇప్పుడా పరిస్థితి మారింది. అమ్మాయిలే స్వయంగా పోరాడి.. భూగర్భంలో విధులు నిర్వహించే అవకాశాలు సాధించుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. పెద్దపల్లిలోని మంథని జేఎన్టీయూ మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థినులు ఈ రంగంలోకి దూసుకొస్తున్నారు...

ఒకప్పుడు సింగరేణి యాజమాన్యం భూగర్భ గనుల ఉద్యోగ ప్రకటనల్లో ‘పురుషులకు మాత్రమే’ అని ఉండేది. 134 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ.. ఆడవాళ్లని భూగర్భ గనుల్లోకి రానివ్వకుండా నిషేధించి, చట్టాలు చేసింది. ఆడపిల్లలు మైనింగ్‌ ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేసినా వాళ్లకి గనుల ఉపరితలంలో తప్ప... భూగర్భంలో చేసేందుకు అవకాశాలు ఇచ్చేది కాదు. దాంతో 2010లోనే మంథని జేఎన్టీయూ కళాశాలలో విద్యార్థినుల కోసం మైనింగ్‌ కోర్సు ప్రారంభమైనా మూడేళ్లకు గానీ అమ్మాయిలు చేరలేదు. 2017లో నిరసనలూ, పోరాటాలు చేసి తమకూ మగవాళ్లతో సమానంగా అవకాశాలివ్వాలని ఉద్యమాన్ని దిల్లీవరకూ తీసుకెళ్లారు. దీంతో సింగరేణి యాజమాన్యం దిగివచ్చి.. మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు 10 బ్యాచ్‌ల్లో 45 మంది ఈ కోర్సు పూర్తిచేశారు.


దేశంలోనే తొలిసారిగా...

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆకాంక్ష కుమారి దేశంలోనే తొలి అండర్‌గ్రౌండ్‌ మైనర్‌గా చేరి రికార్డు నెలకొల్పితే, హిరణ్మయి మరో అడుగు ముందుకేసిందిలా.. ‘మాది ఇదే జిల్లా కావడంతో సహజంగానే మైనింగ్‌పై ఆసక్తి పెరిగింది. 2014లో కోర్సులో చేరా. పురుషులకు మాత్రమే ఉద్యోగాలనే ప్రకటన చూసి.. మా బ్యాచ్‌లోని ఏడుగురం అమ్మాయిలం దిల్లీ వెళ్లి మరీ పోరాడాం. మా కృషి ఫలించి మైనింగ్‌లో సమాన అవకాశాలు ప్రకటించారు. మైన్‌ ప్లానింగ్‌, ఎన్విరాన్‌మెంట్‌ మానిటరింగ్‌ల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్లు అందుబాటులో లేవు. ఈ అంశంలో పీహెచ్‌డీ చేస్తున్నా. ప్రస్తుతం సహాయాచార్యురాలిగా తాత్కాలిక విధులు నిర్వహిస్తున్నా’ అంటున్నారు హిరణ్మయి.  


2018 తర్వాత కేంద్రం పురుషులతో సమానంగా మహిళలు కూడా భూగర్భ, ఉపరితల గనుల్లో పనిచేసే హక్కులను కల్పించాలని మైనింగ్‌ ఇంజినీరింగ్‌ చట్టంలో సవరణలు చేసింది. ఉపరితల గనుల్లో ఉదయం నుంచి సాయంత్రం షిప్టులూ చేసే అవకాశం ఉండేలా.. భూగర్భగనిలో పనిచేసే చోట కనీసం ముగ్గురు మహిళల సమక్షంలో విధులు నిర్వహించేలా షరతులు విధించింది. సింగరేణి సంస్థలో 1,530 మంది మహిళా ఉద్యోగులు, 145 మంది మహిళా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. గనుల్లో పనిచేసే అవకాశాలు ఇప్పటి వరకు ఏ ఒక్క మహిళకూ రాలేదు. కోల్‌ ఇండియా లిమిటెడ్‌ వారు 2020 నుంచి భూగర్భ, ఉపరితల గనుల్లో అవకాశాలు కల్పిస్తున్నారు. సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ లో ప్రయివేట్‌ మైన్స్‌లో ఇప్పటికే మహిళలకు భూగర్భ, ఉపరితల గనుల్లో అవకాశాలు కల్పిస్తున్నారు.


సదుపాయాలుంటే మరింత మంది... 

‘మాది ఆదివారంపేట. నాన్న సింగరేణి కార్మికుడు. నలుగురు అక్కాచెల్లెళ్లలో నేనే చివరిదాన్ని. ఇప్పటివరకు 7 సార్లు భూగర్భ గనుల్లో దిగి కార్మికుల పనితీరుని ప్రత్యక్షంగా చూశా. యంత్రాల వినియోగం పెరిగినా, వెలుతురు తక్కువ. శ్వాస తీసుకోవడానికీ ఇబ్బందే. తవ్వకాల సమయంలో దుమ్ము, ధూళి, ప్రమాదకరమైన వాయువులూ వెలువడుతుంటాయి. వీటితోపాటు స్మార్ట్‌ హెల్మెట్‌, ఆటోమేటిక్‌ రూఫ్‌ బ్లాస్టింగ్‌ టెక్నాలజీ స్త్రీలకోసం ప్రత్యేకించి వెయిటింగ్‌ రూమ్‌లు, మౌలిక వసతులు వంటివి గనిలో కల్పిస్తే అమ్మాయిలూ ఈ రంగంలోకి వస్తారు’ అంటుంది మైనింగ్‌ తృతీయ సంవత్సరం చదువుతున్న ఎం.పుష్ప.  ‘హైదరాబాద్‌లో పుట్టి పెరిగా. నాన్న ఫార్మసిస్ట్‌. అమ్మ ఉపాధ్యాయురాలు. పదో తరగతిలో మెటలర్జీ పాఠంతో గనులపై ఆసక్తి ఏర్పడింది. ఇప్పటి వరకు 10 సార్లు భూగర్భ గనుల్లోకి వెళ్లా. మైనింగ్‌లో ఎన్నో అవకాశాలున్నాయి. గనుల్లో దిగి తట్ట మోసే పనులే కాదు, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే విధులూ ఉంటాయి. నాకు స్ట్రాట మానిటరింగ్‌ అబ్జర్వర్‌ అధికారి కావాలని ఉంది’ అంటోంది మూడో ఏడాది చదువుతున్న జాహ్నవి. ‘ప్రమాదం.. ఆడపిల్లలు మీరు చేయలేరు’ వంటి మాటలు ఇప్పటికీ వాళ్లకి వినిపిస్తూనే ఉంటాయి. అయినా మేమూ చేయగలం.. నిరూపించు కోగలమన్న నమ్మకంతో ధీమాగా ముందుకు సాగుతున్నారు ఇక్కడ చదువుతున్న అమ్మాయిలు.

- గణేష్‌ మిరియాల, పెద్దపల్లి


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాంల ద్వారా పంపవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని