భోజనం పెడతానని బడికి రప్పించారు!
ఆస్తులకు వారసత్వం కోరుకునే వారిని చాలామందినే చూసుంటాం. కానీ, తండ్రి ఆశయాన్ని అందుకుని నెరవేర్చాలనుకునేవారు అరుదుగా ఉంటారు. అలాంటివారిలో మాజీ జర్నలిస్ట్ పోర్టియా ఒకరు. ఇందుకోసం దేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్న స్పితిలోయ పరిసర గ్రామం కోమిక్‌లో ఓ పాఠశాల ప్రారంభించి నిరుపేద చిన్నారులకు పాఠాలు చెబుతున్నారు.
ఆస్తులకు వారసత్వం కోరుకునే వారిని చాలామందినే చూసుంటాం. కానీ, తండ్రి ఆశయాన్ని అందుకుని నెరవేర్చాలనుకునేవారు అరుదుగా ఉంటారు. అలాంటివారిలో మాజీ జర్నలిస్ట్ పోర్టియా ఒకరు. ఇందుకోసం దేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్న స్పితిలోయ పరిసర గ్రామం కోమిక్‌లో ఓ పాఠశాల ప్రారంభించి నిరుపేద చిన్నారులకు పాఠాలు చెబుతున్నారు. అనాథ పిల్లలకు తల్లిగా మారారు.
ఝార్ఖండ్‌లోని రాంచీలో పుట్టి పెరిగారు పోర్టియా. కోల్‌కతాలో జర్నలిజం పూర్తి చేసి టైమ్స్ ఆఫ్ ఇండియా, సీఎన్‌ఎన్ ఐబీఎన్ వంటి పలు ప్రముఖ మీడియా సంస్థల్లో జర్నలిస్టుగా విధులు నిర్వర్తించారు. ముంబయి కేంద్రంగా పనిచేసిన ఆమెకు ప్రయాణాలంటే ఆసక్తి. 2013లో మొదటిసారి స్పితి లోయను సందర్శించారు. అక్కడి ప్రకృతి సౌందర్యంపై మనసు పారేసుకుని మరోసారి రావాలనుకున్నారు. అయితే, భవిష్యత్తులో తాను అక్కడే నివసించాల్సి వస్తుందన్న విషయం అప్పటికి ఆమెకు తెలియదు. ఉపాధ్యాయుడు, స్వచ్ఛంద సేవకుడు అయిన తండ్రి మరణమే ఇందుకు కారణం. ‘నాన్న లేకపోతే నన్ను నేను కోల్పోయాననిపించింది. పర్వత గ్రామాలకు వెళ్తే...స్వర్గంలో ఉండే ఆయనకు దగ్గరగా ఉంటానని అనిపించింది. అందుకే ఆ జ్ఞాపకాలతో మరోసారి స్పితి లోయకు వెళ్లా’ అని జ్ఞప్తికి తెచ్చుకుంటారు పోర్టియా.
నాన్న ఆశయంతో...
‘ఈ ప్రాంతంలో ఒకటి రెండు రోజులు చూసి వెళ్లిపోవాలనుకోలేదు. కనీసం నెలరోజులైనా ఉండాలనుకున్నా. అందుకే, స్థానికులెవరైనా ఆశ్రయం ఇస్తారేమోనని చూశా. కాజా గ్రామంలోని ఓ కుటుంబం ముందుకొచ్చింది. ప్రతిఫలంగా నేను వారి పిల్లలకు చదువూ, ఆటపాటలూ నేర్పించా. ఖాళీ సమయంలో చుట్టు పక్కల గ్రామాలన్నీ తిరిగొచ్చేదాన్ని. వెళ్లిన ప్రతిచోటా సరైన విద్యావకాశాలు లేకపోవడం గమనించా. పేద పిల్లలకు ఆరోగ్యకరమైన అభ్యాస పద్ధతుల్నీ, నాణ్యమైన విద్యనూ అందించాలన్నది నాన్న ఆశయం. ఆయన కోరిక నెరవేర్చాలని అప్పుడే నిర్ణయించుకున్నా’ అని చెప్పుకొచ్చారామె. ఇందుకోసం ఉద్యోగానికి రాజీనామా చేస్తోంటే... ‘మూర్ఖపు ఆలోచన ఇది. నీ జీవితం గురించి ఆలోచించు’ అని సలహాలిచ్చారందరూ. కానీ, మనసుకి సంతృప్తినిచ్చే పనిచేయడం కంటే గొప్పదేం లేదనేది ఆమె నమ్మకం. అందుకే వెనకడుగు వేయలేదు. ‘ఆలోచనైతే చేశా కానీ, ఎక్కడ మొదలుపెట్టాలో అర్థం కాలేదు. దాంతో పార్కుల్లో, వీధుల్లో ఆడుతున్న పిల్లల దగ్గరకు వెళ్లి ‘బడికొస్తే క్రేయాన్స్, షీట్లు’ ఇస్తానని చెప్పా. అలా వచ్చినవారికి చెట్టుకిందే ఇంగ్లిష్, రైమ్స్, బొమ్మలు వంటివి నేర్పించా. అది చూసి మరికొందరూ వచ్చారు. ఇది సాగుతుండగా ఓ రోజు కొండపైన ఉన్న కోమిక్ గ్రామానికి వెళ్లా. అక్కడ పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఇక్కడ నుంచి కాజాకు వచ్చి చదువుకోవడం కష్టమైన పనని అర్థమయ్యాక అక్కడే ఓ పాఠశాల ప్రారంభించా’నంటారు పోర్టియా.
అంత సులువేం కాదు...
పిల్లలను బడికి రప్పించడం అంత సులువుగా కాలేదిక్కడ. ‘నా బిడ్డ చదివేం చేయాలి? మోమోలు అమ్మితే కూడా డబ్బులు సంపాదించొచ్చు’ అనేవారు వారి తల్లిదండ్రులు. ఆ చిన్నారులకు వసతి, భోజనం కల్పించడం వల్ల మీ భారమూ తగ్గుతుందని నచ్చజెప్పారు. ఆ తర్వాతే స్థలం అద్దెకు తీసుకుని ‘ప్లానెట్ స్పితి ఫౌండేషన్’ సాయంతో ఉచిత బోర్డింగ్ పాఠశాలను ఏర్పాటు చేశారు. ‘వీరందరికీ బడి అలవాటు చేయడానికి ఆటపాటలతో ప్రణాళిక సిద్ధం చేశా. రెగ్యులర్ సిలబస్‌తో పాటు గార్డెనింగ్, పెయింటింగ్, డ్యాన్స్ వంటివన్నీ నేర్పుతా. ముగ్గురితో మొదలైన ఈ స్కూల్లో ఇప్పుడు పదుల సంఖ్యలో చదువుకుంటున్నారు. తల్లిదండ్రులు లేనివారికి నేనే అమ్మగా మారి అన్నీ చూస్తున్నా. మొదట్లో కొన్నిసార్లు నెరవేర్చలేని బాధ్యత తీసుకున్నానా అనిపించేది. ఆలోచిస్తే... ఈ ప్రయత్నం కచ్చితంగా నాన్నకు శాంతిని కలిగిస్తుందన్న నమ్మకం నన్ను ముందుకు నడిపిస్తోంది’ అంటారామె.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.