ప్రత్యేకంగా...చిన్నారుల గది

ఇంట్లో పిల్లలగదిని మిగిలిన వాటికన్నా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. అది వారి సృజనాత్మకతను పెంచుతూనే, వారి మనసులో మధుర జ్ఞాపకాలను పొందుపరుస్తాయి. అందుకే వారి గదిని ఎంత ప్రత్యేకంగా సర్దితే, అంతగా వారి మానసిక ఎదుగుదల ఉంటుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అందుకు ఏం చేయాలంటే...

Published : 10 Aug 2021 03:16 IST

ఇంట్లో పిల్లలగదిని మిగిలిన వాటికన్నా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. అది వారి సృజనాత్మకతను పెంచుతూనే, వారి మనసులో మధుర జ్ఞాపకాలను పొందుపరుస్తాయి. అందుకే వారి గదిని ఎంత ప్రత్యేకంగా సర్దితే, అంతగా వారి మానసిక ఎదుగుదల ఉంటుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అందుకు ఏం చేయాలంటే...

గ్యాలరీ వాల్‌... మంచానికి పక్కగా ఉండే గోడను గ్యాలరీవాల్‌గా అనుకోవాలి. దానిపై కొన్ని ఖాళీ ఫ్రేములు అందంగా అమర్చాలి. పిల్లలతో బొమ్మలు వేయించి, వాటిని ఆ ఫ్రేమ్స్‌లో ఉంచేలా అలవాటు చేయాలి. రకరకాల ఆకారాల్లో ఉండే ఆ ఫ్రేమ్స్‌లో వారి మనసుకు నచ్చిన, సొంతంగా వేసిన బొమ్మ కనిపిస్తుంటే వారిలో సృజనాత్మకత పెరుగుతుంది. ఆ బొమ్మలను చూసినప్పుడల్లా వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. వీలైనప్పుడల్లా కొత్తవి వేసి పాతవి మారుస్తూ ఉండేలా ప్రోత్సహించాలి. అప్పుడు ఆ గోడ వారి ఆలోచనలకు ప్రతిరూపంగా నిలుస్తుంది.

జ్ఞాపకంగా...  పిల్లల గదిలో మంచానికెదురుగా గోడపై వారి మొదటి సంవత్సరం పొడవునా వారి ఎదుగుదలను చూపించే చిత్రాలను ఫ్రేం చేయించి ఉంచాలి. నవజాత శిశువుగా ఉన్నప్పుడు వారు వేసుకున్న మొదటి దుస్తులు, టోపీ, సాక్సు, అప్పటి వారి పాద ముద్రలు వంటివీ ఫ్రేంలో ఉంచాలి. వాటిని చూసినప్పుడల్లా వారిలో ఉత్సాహం పెరుగుతుంది.

ఓ మూలగా... గదిలో ఓ మూల లేత వర్ణం వస్త్రంతో చిన్న టెంట్‌లా ఏర్పాటు చేయాలి. అందులో మెత్తని బొంత, దిండ్లు వేయాలి. పక్కనే చిన్న అల్మారలో బొమ్మల కథల పుస్తకాలుంచాలి. అందులోనే కూర్చొని హోం వర్క్‌ చేసుకోమంటే చాలు... ఆసక్తిగా చదువుకోవడమే కాదు, పుస్తక పఠనం కూడా అలవడుతుంది. అది వారిలో క్రమశిక్షణతోపాటు సృజనాత్మకతనూ పెంచుతుంది.

వృథాను ఉపయోగించి... పాత టైర్లకు ఆకర్షణీయమైన వర్ణాలద్ది వాటిలో బొమ్మలు, పుస్తకాలను సర్దొచ్చు. పాత అల్మార ఉంటే దానికి ముదురు రంగులేసి వారి వార్డ్‌రోబ్‌గా మార్చి చూడండి. ఇలాంటి వాటితో వృథాను ఎలా ఉపయోగించొచ్చు అనేదానిపై అవగాహన పెంచుకుంటారు.

ఫొటోల వెలుతురు... మంచానికి పక్కగా ఉంచే నైట్‌ల్యాంప్‌కు ఫ్యామిలీ ఫొటోలతోపాటు వారి చిన్నప్పటి ఫొటోలను అతికిస్తే బాగుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్