మురిపించే మ్యాండవిలా...

ముదురు రంగుల్లో విరిసే మ్యాండవిలా పూలను చూస్తే ఎవరైనా మనసు పారేసుకోవాల్సిందే. ఇంటి ముంగిట్లో పెంచుకున్నా, బాల్కనీల్లో తీగ అల్లించాలన్నా దీన్ని మించింది ఏదీ లేదు.

Published : 14 Mar 2024 01:12 IST

ముదురు రంగుల్లో విరిసే మ్యాండవిలా పూలను చూస్తే ఎవరైనా మనసు పారేసుకోవాల్సిందే. ఇంటి ముంగిట్లో పెంచుకున్నా, బాల్కనీల్లో తీగ అల్లించాలన్నా దీన్ని మించింది ఏదీ లేదు. మరి దీన్నెలా పెంచుకోవాలో చూద్దాం.

తీగ జాతినే రాక్‌ ట్రంపెట్‌ అని కూడా పిలుస్తారు. ఈ మొక్క పుట్టిల్లు దక్షిణ అమెరికా అయినా... ప్రపంచమంతా వ్యాపించింది. మనదేశ వాతావరణంలోనూ చక్కగా ఇమిడిపోయింది. ఇతర తీగ జాతి రకాలకు భిన్నంగా ఏడాదంతా పూస్తుంది. ఒకప్పుడు తెలుపు రంగులోనే పూలుండేవి. కాలక్రమంలో ఎరుపూ, పసుపూ, గులాబీ... ఇలా ఎన్నో రంగుల్లో విరబూస్తోంది.

ఆధారం ఇవ్వండి...

మ్యాండవిలా మొక్కని కుండీల్లోనూ పెంచుకోవచ్చు. అయితే, ఇందుకోసం నీరు నిలవని సారవంతమైన మట్టిని ఎంచుకోవాలి. సమాన పరిమాణంలో కంపోస్ట్‌ను చేర్చి కుండీలో నింపాలి. తరచూ మార్చే వీలుండదు కాబట్టి బలమైన ఆధారం... అంటే స్తంభం, ఆర్చ్‌, గ్రిల్‌ వంటివాటికి దగ్గరగా పెడితే చక్కగా అల్లుకుపోతుంది. రోజూ ఐదారు గంటలు ఎండ తగలాలి. ఎండ మరీ ఎక్కువ ఉంటే మాత్రం రక్షణగా షేడ్‌నెట్‌ వేసుకోవాలి.

పోషణా ముఖ్యమే...

పూలు బాగా పూయాలంటే మొక్కకు పోషకాలు క్రమం తప్పకుండా అందించాలి. ముఖ్యంగా ప్రతి రెండు నెలలకోసారి కంపోస్ట్‌, బోన్‌మీల్‌ని ఇవ్వాలి. ఎన్‌పీకే ద్రవరూప ఎరువు... అందులోనూ పొటాషియం మోతాదు ఎక్కువుండేలా చూసుకోవాలి. వాడిన కొమ్మలనూ, ఎండిన పూలనూ ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే కొత్త చిగుళ్లతో ఎదుగుతుంది. దీనివల్ల కొత్త మొగ్గలు రావడంతో పాటు తీగలూ తీర్చిదిద్దినట్లు కనిపిస్తాయి. ఇది కాస్త సున్నితమైన మొక్క. తెల్లదోమ, పేనుబంక వంటి ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు తరచూ దాడి చేస్తాయి. ఈ ముప్పుని ఎదుర్కొనేందుకు రెండు వారాలకోసారి వేపనూనె చల్లడం, డిటర్జెంట్‌తో వాష్‌ చేయడం వంటివి చేయాలి. ఇంకెందుకాలస్యం మీరూ ఓ మొక్కను తెచ్చేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్