పనికి ‘బ్రేక్‌’ వేయండి!

‘బోలెడు పనుంది. నీళ్లు తాగడానికీ సమయం లేదు’ చాలాసార్లు ఆఫీసుల్లో ఈ మాట అంటుంటాం కదా! నిజానికి కుర్చీలో నుంచి లేవకుండా పూర్తి చేస్తుంటాం కూడా. సమయానికి ఇంటికి చేరాలన్న తొందరా అందుకు కారణమై ఉండొచ్చు.

Published : 19 Mar 2024 01:11 IST

‘బోలెడు పనుంది. నీళ్లు తాగడానికీ సమయం లేదు’ చాలాసార్లు ఆఫీసుల్లో ఈ మాట అంటుంటాం కదా! నిజానికి కుర్చీలో నుంచి లేవకుండా పూర్తి చేస్తుంటాం కూడా. సమయానికి ఇంటికి చేరాలన్న తొందరా అందుకు కారణమై ఉండొచ్చు. కానీ ఇలాంటప్పుడే ‘బ్రేక్‌’ తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే...

  • ఆగకుండా గబగబా చేసేస్తే పని పూర్తవుతుంది అని అనుకుంటాం కానీ... మెదడు పనితీరు మందగిస్తుంది. పైగా కాలంతోపాటు పరుగుతీస్తాం కాబట్టి, అలసట, నీరసం ఆవరిస్తాయి. తప్పులూ కంటిని దాటిపోతాయి. అంటే శ్రమపడీ, అలసిపోయీ చివరకు చీవాట్లు తినాలన్న మాట. అందుకే ఇవన్నీ తప్పాలంటే చిన్నవి పోనీ... చిట్టి చిట్టి విరామాలైనా తీసుకోవాలి మరి.
  • పదే పదే కుర్చీలోంచి లేవడాన్ని సహజంగానే మన ఆడవాళ్లు ఇష్టపడరు. బద్ధకమేసి కాదు కానీ... పని దొంగ అంటారన్న భయం. అలాంటప్పుడు కళ్లు మూసుకొని అయిదు నిమిషాలు ధ్యానం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు వంటివి చేయండి. మెదడూ శాంతిస్తుంది, పనిలో వేగం పెరుగుతుంది.
  • అలాగని ఇదే కొనసాగిస్తూ వెళ్లినా మంచిది కాదు. సాధారణంగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో శక్తి స్థాయులు తగ్గినట్లుగా తోస్తుందంటున్నాయి అధ్యయనాలు. అలాంటప్పుడు పనితో కుస్తీ పడి మాత్రం ఏం లాభం చెప్పండి? అలాంటప్పుడు నచ్చిన టీనో, కాఫీనో తాగేయండి. ఒక ఫ్లోరు మెట్లు ఎక్కి దిగండి. ఉత్సాహం దరిచేరుతుంది.
  • ‘ఒకే పని చేస్తోంటే బోర్‌! దాన్ని పక్కన పెట్టి, వేరేది చేస్తే ఉత్సాహం వస్తుంది’ అంటూ వేరేదానిలోకి వెళ్లిపోతారు కొందరు. ఒక పరిశోధన ప్రకారం ఇది పని త్వరగా పూర్తిచేయకపోగా అదనపు సమయాన్ని తీసుకునేలా చేస్తుందట. కాబట్టి, ‘బోర్‌’ కూడా విరామం తీసుకోమనడానికి చిహ్నమే. అలాంటప్పుడు అలా కాస్త పక్కకి వెళ్లడమే మేలు.
  • ‘పనిలో పడితే గుర్తుండదు’ చాలామంది అనేమాటే ఇది. అందుకే ఫోన్‌లో రిమైండర్‌, కళ్లకు కనిపించేలా స్టికింగ్‌ నోట్‌లు అంటించుకోవడం చేసుకుంటే మేలు. ఒక పాట, స్నేహితులకో మెసేజ్‌, పక్కవారితో మాట కలపడం, చిన్న పజిల్‌... అనాసక్తిగా అనిపించినప్పుడు ఏదో ఒకటి ప్రయత్నించండి. మనసు తిరిగి పనిపై లగ్నమవడమే కాదు, కొత్త ఆలోచనలూ పుట్టుకొస్తాయి. ప్రయత్నించండి మరి!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్