అరవైల్లో.. వ్యాపారవేత్త..

యవ్వనంలో రిస్క్‌ తీసుకున్నా.. నేర్చుకునే వయసు కాబట్టి పర్లేదనేస్తారు. అదే అరవై ఏళ్ల వయసులో? హాయిగా విశ్రాంతి తీసుకోక ఎందుకివన్నీ అన్న సలహాలొస్తాయి. కొత్తగా ప్రయత్నించాలన్నా తెలియని భయం. కానీ ఆవిడలా ఆలోచించలేదు.

Published : 03 Aug 2023 00:07 IST

యవ్వనంలో రిస్క్‌ తీసుకున్నా.. నేర్చుకునే వయసు కాబట్టి పర్లేదనేస్తారు. అదే అరవై ఏళ్ల వయసులో? హాయిగా విశ్రాంతి తీసుకోక ఎందుకివన్నీ అన్న సలహాలొస్తాయి. కొత్తగా ప్రయత్నించాలన్నా తెలియని భయం. కానీ ఆవిడలా ఆలోచించలేదు. కాబట్టే విజయవంతమైన వ్యాపారవేత్త అవడమే కాదు.. ఎందరికో ఉపాధీ చూపించగలుగుతున్నారు. చిత్రలేఖ దాస్‌.. ఆవిడ వ్యాపార ప్రయాణమిది!

భర్త బిమన్‌ కుమార్‌ దాస్‌ ఉద్యోగరీత్యా దేశమంతా తిరిగారు చిత్రలేఖ. ఆయన డిఫెన్స్‌ ఆఫీసర్‌. ఇక ఇద్దరు పిల్లల ఆలనాపాలనా.. తర్వాత వాళ్ల పెళ్లిళ్లు.. జీవితమంతా అలాగే గడిచిపోయింది. ఇకనైనా తనకు నచ్చిన దానిపై దృష్టిపెట్టాలని 60 ఏళ్ల వయసులో ‘సుజాత్ర’ ప్రారంభిచారామె. చిత్రలేఖది అగర్తల. చిన్నతనం నుంచీ దుస్తుల డిజైనింగ్‌ అంటే ఆసక్తి. కానీ సంగీతంలో పీజీ చేసి, మ్యూజిక్‌ టీచర్‌ అయ్యారు. కొత్త అంశాలు నేర్చుకోవడమంటే ఆసక్తి. పిల్లలు పుట్టాక పెయింటింగ్‌, నగల డిజైన్‌ వంటివెన్నో ప్రయత్నించారు. ఆర్ట్‌ వేస్తున్నప్పుడల్లా ఇది చీరల మీదెలా ఉంటుందన్న ఆలోచనలొచ్చేవట ఆవిడకి.
‘అందరమ్మాయిల్లాగే నాకూ చీరలంటే ఆసక్తి. డిఫెన్స్‌ వాళ్లవి ఏ పార్టీలు జరిగినా చీరల్లోనే వెళ్లేదాన్ని. కాస్త ప్రత్యేకంగా ఉండాలని భిన్న రంగులు, రకాల చీరలు కలిపి కుట్టడం, ప్యాచ్‌ వర్క్‌ వంటివి చేసేదాన్ని. దీనికోసం ఓ చిన్న కుట్టుమెషిన్‌నీ కొనుక్కున్నా. వాటిని చూసి అందరూ బాగుంది అంటోంటే సరదాగా ఉండే’దనే 67 ఏళ్ల చిత్రలేఖ స్నేహితులకీ చేసిచ్చినా అప్పుడూ దాన్నో వ్యాపకంగానే పరిగణించారామె. ఓసారి ఓ హస్తకళల ఫెయిర్‌కి వెళ్లారామె. అక్కడ ఓ నేత కళాకారుడి పనితనం ఆమెకు నచ్చింది. ఆయనతో తన డిజైన్లను నేయించడం, రంగులు అద్దడం వంటివి చేయించి అమ్మడం మొదలుపెట్టారు. వాటికి డిమాండ్‌ పెరిగింది. దాన్ని చూసే చిత్రలేఖ కోడలు సొంతంగా ఏదైనా ప్రయత్నించమని సలహానిచ్చారట.

ఆ పేర్లతో బ్రాండ్‌..

‘బాధ్యతలు తీరాయి. ఆయనా పదవీ విరమణ చేశారు. ఈ సమయాన్ని ఎందుకు వాడుకోకూడదు అనుకున్నా. వాళ్ల ప్రోత్సాహానికి గుర్తుగా నా కోడళ్ల పేర్లు సుస్మిత, సుజాత, నా పేరు మీదుగా 2016లో ‘సుజాత్ర’ ప్రారంభించా. అంటే సృజనాత్మక యాత్ర అని అర్థం. తొలిరోజుల్లో ఫేస్‌బుక్‌లో అమ్మకాలు జరిపా. ప్రారంభంలో పార్శిల్‌ అందించడం, ఆన్‌లైన్‌ చెల్లింపుల విషయాల్లో ఇబ్బందులొచ్చాయి. ఒక్కోటీ నేర్చుకుంటూ ముందుకెళ్లా. ఎంత మంచి డిజైన్‌ అయినా, ఆదరణ ఉన్నా పదిలోపే అందించేదాన్ని. అలా డిమాండ్‌ పెరిగింది. మా ఇల్లే ఆఫీసు, వేర్‌హౌజ్‌ అన్నీ. నెమ్మదిగా పనితనం ఉన్న టైలర్లు, నేతకారులను చేర్చుకుంటూ వచ్చా. పెయింటింగ్‌, ఎంబ్రాయిడరీ, మిర్రర్‌ వర్క్‌.. ఇలా అన్ని రకాల పనితనాలనూ చేయిస్తున్నా’ననే చిత్రలేఖ వద్ద వందల్లో టైలర్లు, కళాకారులు ఉపాధి పొందుతున్నారు. వ్యాపారమూ రూ.15 కోట్ల పైమాటే! సొంత వెబ్‌సైట్‌నీ ఏర్పాటు చేసుకున్న ఆమె.. ఆసక్తి, చేయాలన్న తపన ఉండాలేగానీ వయసు ఎప్పుడూ అడ్డంకి కాదంటారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్