ఓ గృహిణీ... నీ విలువెంత?

‘..నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా? ఊళ్లేలుతున్నావా!  పిల్లలకి కావలసినవి కూడా వండి పెట్టలేవా’ అంటూ చిరాకు పడతాడో భర్త. ‘రోజంతా ఖాళీనే కదా... తిని, పడుకోవడం తప్ప నీకు పనేముంటుంది. ఈ మాత్రం దానికే పనిమనిషి అవసరమా’ అని వెక్కిరిస్తాడు మరో మగడు.

Updated : 06 Mar 2024 12:44 IST

అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా..

‘..నువ్వేమైనా ఉద్యోగం చేస్తున్నావా? ఊళ్లేలుతున్నావా!  పిల్లలకి కావలసినవి కూడా వండి పెట్టలేవా’ అంటూ చిరాకు పడతాడో భర్త. ‘రోజంతా ఖాళీనే కదా... తిని, పడుకోవడం తప్ప నీకు పనేముంటుంది. ఈ మాత్రం దానికే పనిమనిషి అవసరమా’ అని వెక్కిరిస్తాడు మరో మగడు. ‘ఆవిడ చూడు ఇంటిని ఎంత బాగా సర్దుకుందో అని ఒకరు... ఈవిడ పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో’ అని ఇంకొకరు.. ‘పిల్లలకి మార్కులు సరిగా రాకపోయినా, ఇంట్లో వస్తువు చెడిపోయినా అన్నింటికీ ఆమే కారణం’ అనేస్తారు.  ఎందుకంటే ఆమె గృహిణి కాబట్టి. ఆమె పనికే విలువ కడితే...

సమాజంలోనూ, పలు సంస్థల విధానాల్లోనూ ఇంటికే పరిమితమైన ఇల్లాళ్లపై ఎన్నో రకాలుగా చిన్న చూపు. అందుకు సాక్ష్యమే ఈ సంఘటన. కొన్నేళ్ల క్రితం వాహన ప్రమాదంలో మరణించిందో మహిళ. ఆమె గృహిణి అనే కారణంతో ఆవిడ సంబంధీకులకు తక్కువ మొత్తాన్ని పరిహారంగా అందించాలనుకుందో బీమా సంస్థ. దాన్ని సుప్రీం కోర్టులో సవాల్‌ చేసిందామె కుటుంబం. వారికి అనుకూలంగా తీర్పునివ్వడమే కాదు... కుటుంబంలో గృహిణి పాత్ర చాలా ఉన్నతమైనదని, ఆమె సేవలను డబ్బు రూపంలో వెలకట్టడం కష్టమని పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం.

ఆ మధ్య భార్యాభర్తల మధ్య వచ్చిన తగవుకి ఇంటిపనులే కారణం కావడంతో... బాంబే హైకోర్టు ‘ఇంటి పనిలో దంపతులిద్దరిదీ సమాన బాధ్యత’ని అభిప్రాయపడింది.

ఇలా కోర్టులెన్నిసార్లు మొట్టినా, ఆడవాళ్లు ఎంత సేవ చేసినా తగిన గుర్తింపు దక్కడం లేదు. ఈ సమస్య మన దేశంలోనే కాదు... ప్రపంచంలో ఏ మూలకెళ్లినా ఇదే పరిస్థితి. ఇల్లాలి శ్రమకి విలువనివ్వరు. వ్యాపారం, ఉద్యోగానికి ఇచ్చినంత ప్రాధాన్యం ఇంటి పనికి ఇవ్వరు. ఈ శ్రమ జీడీపీలో ప్రతిఫలించదు. అందుకే, ‘మహిళందరూ పనిచేస్తారు. కానీ వారందరికీ జీతం అందదు’ అంటారు 2023 నోబెల్‌ గ్రహీత, ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్‌. ఈ అంశంపైనే అమెరికా ఆర్థిక వ్యవస్థలో పరిశోధన చేశారీమె.

ఆ విలువ మదింపు చేస్తే...

భార్యగా, తల్లిగా, కోడలిగా, గృహిణిగా అహర్నిశలూ శ్రమించే మహిళల సేవలకు కచ్చితమైన విలువ నిర్ణయించడమూ కష్టమే. ప్రపంచవ్యాప్తంగా ఇంటి పని చేస్తోన్న మహిళల పనికి వెల కడితే సుమారు 11 ట్రిలియన్‌ డాలర్ల పై మాటేనట. అదే మన దేశం విషయానికి వస్తే ఆ మొత్తం 22.7 లక్షల కోట్ల రూపాయలని చెబుతోంది స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గతేడాది చేసిన సర్వే. భారతదేశ జీడీపీలో ఇది 7.5 శాతానికి సమానం. గృహిణుల శ్రమకు అత్యంత కనిష్ఠ వేతనం చెల్లించినా... ఇంత పెద్ద మొత్తం అవుతుందట. మనదేశంలో సగటున ఓ మహిళ కుటుంబం కోసం రోజుకి 7.2 గంటలు పనిచేస్తుంది, ఇక, ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ గణాంకాల ప్రకారం 64 దేశాల్లోని స్త్రీలు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే తమ ఇంటికోసం రోజూ 1640 కోట్ల గంటలు పనిచేస్తున్నారట.

ఆడవాళ్లు పనిచేయకపోతే...

ఆడవాళ్ల పనికి గుర్తింపులేనప్పుడు చేయకపోతే ఏమవుతుంది? ఈ ప్రశ్న అందరిలోనూ ఎప్పుడో ఒకసారి మెదిలే ఉంటుంది. అలాంటి సందర్భం ఒకటి కొన్నేళ్ల క్రితం ఐస్‌ల్యాండ్‌లో వచ్చింది. ఆ దేశంలో వారు ఎదుర్కొంటున్న వేతన వ్యత్యాసం, అన్యాయమైన ఉపాధి పద్ధతులను నిరసిస్తూ ఓ రోజు సమ్మె చేశారు. 1975లో అక్టోబర్‌ 24న రోజంతా ఇంటి పనులు చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని మహిళా జనాభాలో 90శాతం మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. దీంతో దేశంలోని కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ఉద్యోగానికో, ఉపాధికో వెళ్లిన మగాళ్లంతా ఇళ్లకు పరుగుతీశారు. వారి శక్తిని గుర్తించిన ప్రభుత్వం మరుసటి ఏడాది పార్లమెంటులో సమానవేతన చట్టాన్ని ఆమోదించింది. ఇది జరిగి ఏళ్లు గడిచినప్పటికీ... ఇప్పుడు కూడా ఆడవాళ్లు పని చేయనని భీష్మించుకుంటే వ్యవస్థలన్నీ కల్లోలమవుతాయి.

మరేం చేయాలి?

పిల్లాడు అన్నం తినకపోయినా, అత్తమామలకు బాగోకపోయినా, భర్తకి ఆర్థిక సమస్యలొచ్చినా... భారమంతా ఆడవాళ్లదే. అదే ఆమె ఒత్తిడికి కారణం కూడా. దీర్ఘకాలంలో ఇది మానసిక కుంగుబాటుకీ దారితీస్తుంది. ఈ పరిస్థితిని రానివ్వొద్దు. ఈ మహిళా దినోత్సవం నుంచైనా ఆమె జీవితంలో మార్పు రావాలంటే... ఇంటి పనిలో భాగం పంచుకోండి. ఆవిడ ఆలోచనలను అర్థంచేసుకోండి. అభిప్రాయాలను పంచుకోనివ్వండి. ఇవన్నీ ఆమె విలువను పెంచేవే. ఏదైనా మహిళ సహన మూర్తి... శ్రమకి విలువ కట్టకపోయినా, దాన్ని గుర్తిస్తే చాలంటోంది. మనిషిగా ప్రేమించమని కోరుకుంటోంది.


పిల్లలూ..

ఈ ప్రభావం పిల్లల మీదా కనిపిస్తోంది. స్నానం చేయించడం, అన్నం తినిపించడం, బట్టలు ఉతకడం వంటివన్నీ అమ్మే చేస్తుందని తెలిసినా... తను ఇంట్లో ఖాళీగానే ఉంటుందంటాడు పిల్లాడు. ఈ పరిస్థితి... ఇంటి పనిని విలువలేనిదిగా లెక్కేసిన పురుషాధిపత్య భావజాలానికి ఓ మచ్చుతునక.


గోప్యతను పాటించే హక్కు

లైంగిక దాడికి గురైన మహిళ... పేరు వెల్లడించకుండానే మేజిస్ట్రేట్‌ ముందు తన వాంగ్మూలాన్ని రికార్డు చేయవచ్చు. కేసు విచారణ దశలో ఉన్నప్పుడు- న్యాయస్థానం అనుమతి లేకుండా బాధితురాలి పేరూ, ఫొటో ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ ప్రచురించడానికి వీల్లేదు. భారతీయ న్యాయ సంహిత (పాత ఐపీసీ) - సెక్షన్‌ 228ఎ కింద ఈ రక్షణ కల్పించింది ప్రభుత్వం.


‘‘ప్రతిదీ పరిపూర్ణంగానే ఉండాలని కోరుకోవద్దు. ఎందుకంటే దాన్ని ఎప్పటికీ మనం చేరుకోలేం.’’

మేరీ క్యూరీ, నోబెల్‌  బహుమతి అందుకున్న మొదటి మహిళ


దూసుకుపోదాం... ఇది మహిళల యుగం!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్