నీతా అంబానీ జీతం... రూ.800!

ఓ సాధారణ అమ్మాయి... యువరాజు వరించి వచ్చి పెళ్లాడతానన్నాడు. అతన్ని ఆమె కూడా మెచ్చి, మనువాడింది. ఎంత అదృష్టవంతురాలు... హాయిగా రాజభోగాలతో తులతూగొచ్చు అనిపిస్తుంది కదూ! కానీ కథనలా కంచికి పంపాలనుకోలేదామె.

Updated : 07 Mar 2024 15:26 IST

ఓ సాధారణ అమ్మాయి... యువరాజు వరించి వచ్చి పెళ్లాడతానన్నాడు. అతన్ని ఆమె కూడా మెచ్చి, మనువాడింది. ఎంత అదృష్టవంతురాలు... హాయిగా రాజభోగాలతో తులతూగొచ్చు అనిపిస్తుంది కదూ! కానీ కథనలా కంచికి పంపాలనుకోలేదామె. దానిలో తనదైన ముద్ర ఉండాలనుకున్నారు. అందుకే రెక్కలు చాచి కలలు సాధించుకున్నారు. కాబట్టే... ఈ తరానికే కాదు, రాబోయే తరాలకూ ఆదర్శంగా నిలిచారు... నీతా అంబానీ!

అంబానీ కుటుంబంలో పెళ్లి. వధూవరులు, వేడుకలకు అయ్యే ఖర్చు, నగలు వగైరా వాటిపై చర్చ సాధారణమే! అయితే ప్రతిదానిలో ప్రధాన ఆకర్షణ మాత్రం ‘నీతా’దే! ఎందుకంటే... ఆ మండపం డిజైన్‌ అయినా, వేడుకల నిర్వహణ ఎలా జరగాలన్న ప్రణాళికైనా, ఇంట్లోవాళ్లని ఒక తాటిపై తీసుకురావాలన్నా ఆ కుటుంబంలో మూలస్థంభం ఆమే మరి. సగటు ఇల్లాలి పాత్ర పోషిస్తూనే తనదైన ప్రత్యేకత కనబరుస్తారామె. అందుకు తను పెరిగిన వాతావరణమే కారణమంటారు. ముంబయిలో స్థిరపడిన గుజరాతీ కుటుంబం నీతాది. కామర్స్‌లో డిగ్రీ చేసిన తను భరత నాట్య కళాకారిణి కూడా! ఓరోజు ఆవిడ నృత్యప్రదర్శన చూసిన ధీరూభాయ్‌ దంపతులు ఆమె చలాకీతనాన్ని మెచ్చి, తమ పెద్ద కొడుకు ‘ముకేష్‌’కి తగిన జోడీ అనుకున్నారట. అప్పటికే అంబానీలంటే పేరుమోసిన ధనవంతులు. కబురు వినగానే ఎగిరి గంతేయలేదు నీతా. ముందు ఆ అబ్బాయితో మాట్లాడి, అభిప్రాయాలు కలిశాకే సరేనంది. ఇక్కడా ‘పెళ్లయ్యాకా తన ఉద్యోగాన్ని కొనసాగించనివ్వా’లని షరతు పెట్టారు. అప్పటికి ఆమె ఓ స్కూల్లో టీచర్‌. జీతమేమో రూ.800. ‘అంబానీల కోడలివి. ఈ మొత్తం వాళ్లకి ఏపాటి’దన్నా... అది నా ఆత్మగౌరవమని సమాధానమిచ్చేవారు నీతా.

అమ్మగా గెలిచి...

‘తన పిల్లల కోసం నింగినీ, నేలనీ ఏకం చేస్తారు నీతా’ కాబోయే కోడలు రాధికతోపాటు చాలామంది అనే మాటే ఇది. అయితే అది నాణేనికి ఒకవైపే! మరోవైపు అంతే కఠినంగా వ్యవహరిస్తారామె. కోట్లకు వారసులైనా తన పిల్లలను మధ్యతరగతి వారిలానే పెంచారు. ప్రతి శుక్రవారం పిల్లలకు రూ.5 ఇచ్చేవారట. ఓరోజు చిన్నకొడుకు ‘మా స్నేహితులు అంబానీల కొడుకువా? అడుక్కునేవాళ్ల పిల్లాడివా అంటున్నారు. నువ్వు పది రూపాయలిస్తే రెండు సమోసాలు కొనుక్కుంటా’నని మారాం చేశాడట. ఆ మాటలు ఆ తల్లి మనసును కదిలించినా ‘పిల్లల దగ్గర ఎక్కువ డబ్బులు ఉండకూడద’ని సర్దిచెప్పి పంపారట. వాళ్లు పెద్దయ్యాకా ఆమెది ఇదే తీరు. అలాగని ఆంక్షలు పెట్టడం నీతా నైజం కాదు. ఏం చేయాలనుకున్నా ప్రోత్సహిస్తారు. ఎవరైనా ఇద్దరు వారసులు అంటే వెంటనే ‘ముగ్గురు’ అని సవరిస్తారామె. సమానత్వం చూపడమే కాదు, ‘నువ్వూ ఎవరికీ తీసిపోవు’ అని కూతుర్ని ప్రోత్సహించేవారట. అందుకే ఈషా ‘విజయవంతంగా వ్యాపారాన్ని ముందుకు నడిపించగలుగుతున్నా అంటే అమ్మే కారణ’మంటుంది. అంతెందుకు బరువు విషయంలో అనంత్‌ ఎంత ఇబ్బంది పడ్డాడో, హేళనలు ఎదుర్కొన్నాడో తెలిసిందేగా! అతనితోపాటు యోగా, వ్యాయామాలంటూ చేసి 90 కేజీల బరువున్న ఆమె 50కి తగ్గి, కొడుకుకో ఉదాహరణగా నిలిచారు. కానీ అనంత్‌ తిరిగి అనారోగ్యం కారణంగా బరువు పెరిగాడు. అప్పుడూ అతనికామె చెప్పిన మాటొకటే... ‘నీలో లోపాలను కాదు, సానుకూలతలను చూడ’మనే! అందుకే ఆమె ముగ్గురు పిల్లలూ ముక్తకంఠంతో చెప్పేది ‘అమ్మే మా ధైర్యం’ అనే!

విజయాలెన్నో!

అలాగని పిల్లల తోడిదే లోకమనుకోలేదామె. ‘ధీరూభాయ్‌ అంబానీ స్కూల్స్‌’ ప్రారంభించి, దేశంలోని ప్రముఖ స్కూళ్లలో ఒకటిగా నిలిపారు. కుటుంబ వ్యాపారం ‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌’లోకి అడుగుపెట్టి, తొలి మహిళా బోర్డు సభ్యురాలయ్యారు. అప్పట్నుంచే కీలక పదవుల్లో మహిళా ప్రాధాన్యంపై చర్చలు మొదలయ్యాయి. ఐపీఎల్‌ ‘ముంబయి ఇండియన్స్‌’ సహా ఎన్నో వెంచర్లు ప్రారంభించి, విజయం సాధించారు. కళలంటే ప్రాణం. వాటిని ప్రోత్సహించడానికి ‘స్వదేశీ మార్ట్‌’, ‘జియో వరల్డ్‌ సెంటర్‌’, ‘నీతా ముకేష్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌’ వంటివీ ప్రారంభించారు. తాజాగా రియలన్స్‌ ‘డిస్నీ ఇండియాను’ విలీనం చేసుకునే పనిలో ఉంది. దానికి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించేదీ నీతానే! ‘పవర్‌ఫుల్‌ బిజినెస్‌ విమెన్‌’గా ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సహా పురస్కారాలెన్నో అందుకున్నారు.

సేవలో...

తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు నీతా. అందుకే పేదల గురించి ఆలోచిస్తూ ఉంటారామె. 1997 జామ్‌నగర్‌లో రిలయన్స్‌ రిఫైనరీలో చేసే ఉద్యోగుల కోసం కాలనీ నిర్మించారు. 17వేలమంది కోసం నిర్మించిన దానిలో లక్ష మొక్కలు నాటించారామె. ఆ ఆలోచన అక్కడివారికి ఆరోగ్యం పంచడమే కాదు, ఎన్నోరకాల పక్షి జాతులకు నిలయమైంది. అంతేకాదు, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రారంభించి మారుమూల గ్రామాలు, పట్టణాల్లో విద్య, ఆరోగ్యం, కళల అభివృద్ధికి కృషి చేశారు. ‘ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌’ ద్వారా లక్ష మంది చిన్నారులను విద్య, ఆటలకు చేరువ చేశారు. బ్రెయిలీ లిపిలో న్యూస్‌పేపర్‌, ఉచిత కంటి ఆపరేషన్లు... చెప్పుకొంటూ పోతే ఆమె చేసిన సేవాకార్యక్రమాలెన్నో. ‘మాది ఉమ్మడి కుటుంబం. పెద్దనాన్నకి కళ్లు లేవు. ఆయనకు వార్తలు చదివి వినిపిస్తూ, నా అభిప్రాయాన్నీ జోడించేదాన్ని. ఆ అలవాటు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అందుకే ప్రతి అమ్మాయికీ ఆ అవకాశం దక్కాలనుకుంటా’ననే నీతా ‘హర్‌ సర్కిల్‌’ పేరుతో మహిళా సాధికారతకు కృషిచేశారు. ఫుట్‌బాల్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ ఛైర్‌పర్సన్‌, ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీలో సభ్యురాలైన తొలి భారతీయురాలు కూడా.


మనకోసం మనం... పోరాడదాం!


పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం...  

                       

పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా... మహిళలకు రక్షణ కల్పించేందుకు 2013లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం బాధిత స్త్రీ ఎవరైనా సరే మూడు నెలల వ్యవధిలో అంతర్గత ఫిర్యాదుల కమిటీకి రాతపూర్వకంగా తన ఫిర్యాదును అందించవచ్చు. లైంగిక వేధింపులంటే... శారీరకంగానే కాదు, చూపులతో, మాటలతో, సైగలతో... ఇబ్బంది పెట్టినా కూడా ఈ చట్టం సాయపడుతుంది.


నువ్వు ఎప్పుడూ సాధారణంగా ఉండడానికే ప్రయత్నిస్తుంటే, నీలో ఉన్న శక్తి ఏంటో ఎప్పటికీ తెలుసుకోలేవు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్