కట్టుబాట్లు దాటి... కలల్ని సాధించింది!

‘ నువ్వేం చేయగలవు’, ‘ఆడవాళ్లకివి అవసరమా’....ఇలాంటి మాటలు వినగానే నిరుత్సాహం ఆవరించేస్తుంది. కానీ, సాగర్‌ కన్వర్‌ మాత్రం... పదహారేళ్లకే పెళ్లి చేసినా... సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్ల పేరుతో అడ్డుపడినా... వాటన్నింటినీ దాటి ముందుకొచ్చేసింది.

Published : 26 Mar 2024 01:52 IST

‘ నువ్వేం చేయగలవు’, ‘ఆడవాళ్లకివి అవసరమా’....ఇలాంటి మాటలు వినగానే నిరుత్సాహం ఆవరించేస్తుంది. కానీ, సాగర్‌ కన్వర్‌ మాత్రం... పదహారేళ్లకే పెళ్లి చేసినా... సంప్రదాయాలు, సామాజిక కట్టుబాట్ల పేరుతో అడ్డుపడినా... వాటన్నింటినీ దాటి ముందుకొచ్చేసింది. పాల సొసైటీ ఏర్పాటుతో ప్రయాణం ఆరంభించి... సేంద్రియ సాగుకి ప్రోత్సాహం అందిస్తూ... వందల మంది మహిళల జీవితాల్లో మార్పు తెచ్చింది. ఆ కథే ఇది.

ష్టాల్ని ఎదురించే స్థైర్యం, భాధల్ని భరించే ఓర్పు మహిళలకు కాస్త ఎక్కువే. ఆ లక్షణమే... అడుగడుగునా అడ్డం పడిన సవాళ్లను దాటే శక్తినిచ్చాయి’ అంటుంది సాగర్‌ కన్వర్‌. ఆమెది రాజస్థాన్‌లోని సిరోహీ జిల్లాలోని వీర్వాఢ అనే కుగ్రామం. తను పుట్టిపెరిగిందేమో... పాలీ జిల్లాలోని మరో పల్లెటూర్లో. రెండూ వేర్వేరు ప్రాంతాలే అయినా... ఆడపిల్లల పుట్టుక, చదువు, పెళ్లి, నడతలపై కట్టుబాట్లు అన్నీ వారిని కట్టడి చేసేవే. అయినా సరే, సాగర్‌ చదవడం, రాయడం నేర్చుకుంది. కానీ, దాన్ని కొనసాగించే అవకాశం లేకుండా పదహారేళ్లకే పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. కొన్నాళ్లకే ఇంటి బాధ్యతలు మీదపడ్డాయి. పిల్లల ఆలనాపాలనా, ఆవుల సంరక్షణ, కోళ్లపెంపకం, పొలం పనుల్లో భర్తకు సాయం...ఇలా ఒకదాని తరవాత మరో పని చేస్తూనే రోజులు గడిపేయడం తనకి ఏ మాత్రం నచ్చేదికాదు. ఇంకేదైనా చేస్తే బాగుంటుందని భావించింది.. ఆలోచించగా... గ్రామస్థులకు ప్రధాన ఆదాయ వనరు అయిన పాల ఉత్పత్తిని పెంచేందుకు ఓ సొసైటీని ప్రారంభించాలనుకుంది. కుటుంబ సభ్యులు మొదట ఒప్పుకోకపోయినా తరవాత సరేననడంతో తోటివారిని కలుపుకొని ‘ఆశ మహిళా మిల్క్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌’ పేరుతో సొసైటీ ప్రారంభించింది. గ్రామస్థులకు ఇది బాగా ఉపయోగపడి పాల ఉత్పత్తి పెంచారు. 2016లో టాటా ట్రస్ట్‌ డెయిరీ మిషన్‌తో పాటు జిల్లాలోని మరికొన్ని సంస్థలు వీరికి సాంకేతిక సాయం అందించాయి. సాగర్‌ సాధించిన ఈ తొలి విజయంతో సొసైటీ పరిధి విస్తరించింది. పొరుగు గ్రామాల ప్రజలూ ఇందులో సభ్యులుగా చేరారు.

ప్రతికూలతల్ని దాటి...

పాల సొసైటీ విజయంతో కన్వర్‌పై పని ఒత్తిడి పెరిగింది. కుటుంబంపై దృష్టిపెట్టమని అత్తింటివారు వెంటపడ్డారు. సమాజం, కట్టుబాట్లు పేరుతో గ్రామస్థులు కొందరు ఆమెను నియంత్రించాలనుకున్నారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. అవమానించారు. వాటిని చూసి భయపడి వెనక్కి తగ్గితే... ఇప్పుడు సాగర్‌ గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదేమో! మరింత పట్టుదలగా ముందడుగు వేసింది. ముందు కుటుంబ సభ్యులకు సర్దిచెప్పుకొంది. మరోవైపు చెత్త సేకరణతో సేంద్రియ ఎరువుల తయారీపై దృష్టిపెట్టింది. అలా వచ్చిన ఉత్పత్తిని స్థానిక రైతులకు తక్కువకే విక్రయించడంతోపాటు తానూ సేంద్రియ సాగు చేసి మరికొంతమందిలో స్ఫూర్తిని రగిలించింది. అంతేకాదు! ఈ విధానాలు ఆర్థికంగా స్థిరపడేందుకు ఎలా దోహదపడతాయో చెబుతూ జిల్లా అంతటా చైతన్య కార్యక్రమాలు నిర్వహించేది.

మొదట అరకొర స్పందన కనిపించినా, క్రమంగా చాలామంది రైతులు సేంద్రియ సాగు బాట పట్టారు. ఇవన్నీ అక్కడి వారి ఆదాయాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి. ఈ కృషికి గుర్తింపుగానే ఈ ఏడాది జనవరిలో భారతీయ పరిశ్రమల సమాఖ్య ‘సీఐఐ’ ఎక్సలెన్స్‌ అవార్డుని అందించింది. ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ ఎక్సలెన్స్‌ అవార్డునీ అందుకుంది. ఇప్పుడు 400 మంది మహిళలు సభ్యులున్న స్వయం సహాయక సంఘాన్ని(ఎస్‌హెచ్‌జీ) నడిపిస్తోంది. ‘మహిళ తలచుకుంటే... ఇంటా, బయటా ఏకకాలంలో సమర్థంగా పనులు చేయగలదని నిరూపించింది. సాగర్‌కి ఇద్దరు పిల్లలు. అబ్బాయి ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకోగా, అమ్మాయి బెంగళూరులో గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది. ‘నా కల సాకారమైంది. ఒకప్పుడు నన్ను విమర్శించినవారే...ఇప్పుడు నా సలహాల కోసం వస్తున్నారు. వందల మంది మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశానన్న సంతృప్తి మిగిలింది. మంచి భవిష్యత్తు కావాలంటే ధైర్యంగా మందుకు రావాలి’ అంటోంది సాగర్‌ కన్వర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్