చదువొక్కటే చాలట..

నేను డిగ్రీ చదువుతున్నాను. సెలవుల్లో నృత్యం, సంగీతం నేర్చుకుంటున్నాను. మొక్కలు పెంచుతాను. చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లు చెబుతాను.

Published : 11 Sep 2023 02:11 IST

నేను డిగ్రీ చదువుతున్నాను. సెలవుల్లో నృత్యం, సంగీతం నేర్చుకుంటున్నాను. మొక్కలు పెంచుతాను. చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లు చెబుతాను. మా అమ్మకి ఇవేమీ నచ్చవు. చదువు, ర్యాంకుల గురించి తప్ప ఇంక వేటి గురించీ ఆలోచన వద్దంటుంది. నాన్న నచ్చజెప్పబోయినా వినిపించుకోదు. తనను ఒప్పించేదెలా?

- ఓ సోదరి

అందరి దృక్పథాలు, తత్వాలు ఒకలా ఉండవు. మీ అమ్మగారు కొంచెం పాతకాలపు ఆలోచనలతో ఉన్నారు. బహుశా ఇతరులతో అంతగా కలవకపోడం వల్ల ఆవిడ తీరలా ఉంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువులో వెనకబడితే కష్టమని, మీ ఇతర వ్యాపకాల వల్ల సమయం వృథా అవుతోందని- తన ధోరణిలో ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నారు. ఆవిడ పరిధి చిన్నదని అర్థం చేసుకోండి. చదువు, ఉద్యోగం, అందులో వృద్ధి ఇవే ఆమెకి తెలుసు. అందుకోసం కష్టపడి చదవాలే తప్ప ఇతర విషయాల జోలికి వెళ్లకూడదు అనుకుంటున్నారు. మనసును ఇతర అంశాలపైకి మళ్లించి, ఒత్తిడి లేకుండా శాంతంగా ఉండటం, వాటితో ఆనందాలు, అనుభూతుల గురించి తెలీదు. ఆవిడ చదువే ముఖ్యం అన్నప్పుడు- ‘నిజమే! చదువు మీద ధ్యాస పెడతాను. అయితే.. సంగీతం, తోటపని లాంటివి మానసిక ఆనందాన్ని, తృప్తిని ఇస్తున్నాయి. వాటి వల్ల అలసట పోయి, విశ్రాంతి దొరుకుతోంది’ అని మెల్లగా చెప్పండి. అయినా వినకుంటే.. నవ్వి ఊరుకుని, చేయాలనుకున్నవి చేయండి. ఇవి మంచి పనులే కనుక మీరు మారనవసరం లేదు. అలాగని వాదనలూ వద్దు. మీరివన్నీ చేస్తూ కూడా ఉన్నతి సాధిస్తే ఆవిడెంతో సంతోషిస్తారు. చదువుతో పాటు విరామం, విశ్రాంతి అవసరమని ఆవిడ నెమ్మదిగా తెలుసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్