అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?

పెళ్లి జరిగిన మర్నాడే... మన మధ్య దాపరికాలు ఉండకూడదంటూ తనకు మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని చెప్పాడు నాభర్త. నన్నడిగితే... అలాంటివేవీ నాకు లేవన్నా నమ్మడం లేదు. శారీరకంగా, మానసికంగా అనుమానిస్తూ నిత్యం వేధిస్తున్నాడు.

Updated : 26 Mar 2024 15:20 IST

పెళ్లి జరిగిన మర్నాడే... మన మధ్య దాపరికాలు ఉండకూడదంటూ తనకు మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని చెప్పాడు నాభర్త. నన్నడిగితే... అలాంటివేవీ నాకు లేవన్నా నమ్మడం లేదు. శారీరకంగా, మానసికంగా అనుమానిస్తూ నిత్యం వేధిస్తున్నాడు. అమ్మానాన్నలతో చెబితే సర్దుకుపొమ్మంటున్నారు. అత్తమామలు కొడుక్కే సపోర్ట్‌ చేస్తున్నారు. నా దగ్గర కనీసం ఫోన్‌ కూడా లేకుండా చేశారు. ఒకవేళ నేను కేసు పెడితే దీన్ని ఎలా నిరూపించాలో తెలియడం లేదు. నేనీ నరకం నుంచి బయటపడే వీలుందా?

 ఓసోదరి

మీరు పడుతోన్న బాధలన్నీ గృహహింస చట్టం పరిధిలోకి వస్తాయి. విడాకులు తీసుకోకపోయినా...ఈ యాక్ట్‌ ప్రకారం అతడి మీద కేసు పెట్టొచ్చు. దీనికి మీరు ముందుగా ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌కి ఫిర్యాదు చేయాలి. అతడికి సాయపడుతున్నందుకు మీ అత్తమామల మీదా ఫిర్యాదు చేయొచ్చు. ఆ కంప్లయింట్‌ ఆధారంగా వారిని పిలిచి దర్యాప్తు చేస్తారు. శారీరక హింస నిరూపించడానికి అతను కొట్టినప్పుడు పడ్డ మచ్చలు, గీతల్ని చూపించొచ్చు. కనపడని దెబ్బల్ని నిరూపించడానికి డాక్టరు ఇచ్చిన మందుల చీటీలు పనికొస్తాయి. మానసిక హింసకు మీ వాంగ్మూలం చాలు. రక్షణాధికారి దర్యాప్తులో నిజాలు తేలకపోయినా, వారి పద్ధతిలో మార్పులేకపోయినా కేసుని కోర్టుకి పంపిస్తారు. ఆ తరవాత ప్రొసీజర్‌ ప్రకారం కౌన్సెలింగ్‌ చేస్తారు. మీ ఆరోపణలు నిజమైతే అతడికి శిక్ష పడుతుంది. గృహహింస నిరోధక చట్టంలోని సెక్షన్‌-19 మీ ఇంట్లో మీరు నివసించే హక్కునీ, సెక్షన్‌-20 నెలవారీ ఖర్చులకు డబ్బుని పొందే హక్కునీ, సెక్షన్‌-22 మానసిక, శారీరక బాధలకు తగినంత పరిహారం పొందే హక్కునీ, మీరిచ్చిన కట్నం తాలూకు డబ్బు, నగలు అన్నీ తిరిగి తీసుకునే హక్కునీ కల్పిస్తున్నాయి. ఒకవేళ మీరు విడాకులు కోరుకుంటే హిందూ వివాహచట్టంలోని సెక్షన్‌-13 ప్రకారం మిమ్మల్ని పెట్టిన శారీరక, మానసిక క్షోభలను కారణంగా చూపి  తీసుకోవచ్చు. అక్కడ కూడా సెక్షన్‌-24 కింద నెలవారీ భత్యము (కేసు నడుస్తుండగా), 25 కింద శాశ్వత భత్యం పొందవచ్చు. ముందుగా ఏదైనా కౌన్సెలింగ్‌ సెంటర్‌ వారిని కలిసి మీ సమస్యను వివరించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్