ఆకలి తీరుస్తున్న టీచరమ్మ!

అ, ఆలు.. దిద్దించే ఆ చేతులు కొవిడ్‌ బాధితుల ఆకలినీ తీరుస్తున్నాయి. గత ఏడాది ప్రారంభమైన అన్నదానం నేటికీ కొనసాగుతోంది. తన ఈ కార్యక్రమానికి ప్రేరణ, సాగిస్తున్న తీరులను ఆదిలాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాలు జయశ్రీ మనతో పంచుకుంటున్నారిలా..

Published : 18 Jun 2021 01:29 IST

అ, ఆలు.. దిద్దించే ఆ చేతులు కొవిడ్‌ బాధితుల ఆకలినీ తీరుస్తున్నాయి. గత ఏడాది ప్రారంభమైన అన్నదానం నేటికీ కొనసాగుతోంది. తన ఈ కార్యక్రమానికి ప్రేరణ, సాగిస్తున్న తీరులను ఆదిలాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాలు జయశ్రీ మనతో పంచుకుంటున్నారిలా..
మాది ఆదిలాబాద్‌ జిల్లా రవీంద్రనగర్‌. మావారు వేణుగోపాల్‌రెడ్డి వైద్యారోగ్యశాఖ ఉద్యోగి. నేను ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం రామాయి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినిని. ఆర్థిక ఇబ్బందులేవీ లేవు. పిల్లలు మణిదీప్‌, అనుదీప్‌ ఉన్నత విద్యను చదువుతున్నారు. ఆదిలాబాద్‌ సమీపంలోని బెల్లూరి అయ్యప్ప ఆలయంలో జరిగే అన్నదానంలో తరచూ పాల్గొంటాం. అక్కడి అన్నార్తులను చూసినప్పుడే అన్నం, ఆకలి విలువేంటో తెలిసింది.

గతేడాది మార్చి నెలాఖరులో లాక్‌డౌన్‌ మొదలైంది. అదే రోజు అందుబాటులో ఉన్న నిరుపేదలకు రోజూ ఓ పూట భోజనం పెట్టాలని అనుకున్నాం. 50 మందికి సరిపడా భోజనం వండుకుని ప్యాక్‌ చేసుకుని రైల్వేస్టేషన్‌కు వెళ్లాం. అక్కడ ఆకలితో ఉన్న వారికల్లా వాటిని పంచేశాం. ‘పొద్దున్నుంచి ఖాళీ కడుపుతో ఉన్న మాకు అమ్మలా అన్నం పెట్టావమ్మా’ అంటూ వాళ్లు ఆనందంతో దండం పెడుతుంటే బాధ, సంతోషం రెండూ కలిగాయి. కాలే కడుపుతో ఉన్న వారికి లాక్‌డౌన్‌ అన్నాళ్లూ ఆహారం ఇవ్వాలనుకున్నా. అలానే 62 రోజులు పంచిపెట్టాం. ఈ రెండో వేవ్‌లో కూడా పేదలు, పనులు లేని వారికి ఒకపూటైనా భోజనం పెట్టాలనుకున్నా. మే పన్నెండు నుంచి భోజనాలు పంపిణీ చేస్తున్నాం. పోయినేడాదిలో రోజూ 50 నుంచి 60 మందికి ఆహారం అందించాం. ఈ ఏడాది 75 మందికి చేస్తున్నాం. మావారు ఆఫీసుకు వెళ్లేవరకూ పనుల్లోనూ సాయం చేస్తారు. మళ్లీ ఆయన భోజన విరామ సమయంలో రాగానే భోజన ప్యాకెట్లు కారులో తీసుకెళ్లి పంపిణీ చేస్తారు.
రోజుకో రకం... రోజూ ఒకేరకమైన భోజనం మనమూ తినలేం కదా. అందుకని రోజుకో రకమైన వంట చేస్తున్నాం. పప్పు, అన్నం, కిచిడి, పులిహోర, పనస బిర్యానీ, వెజ్‌ బిర్యానీకి ప్రాధాన్యం ఇస్తున్నాం. రోజూ మామిడికాయ పచ్చడి, అరటిపండుతోపాటు పిల్లలెవరైనా ఉంటారని బిస్కెట్లు, బ్రెడ్‌ పాకెట్లనూ తీసుకెళతాం. మాకున్నదాంట్లో కొందరి ఆకలినైనా తీర్చడం చాలా సంతృప్తినిస్తోంది.

- ఎం.మణికేశ్వర్‌, ఆదిలాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్