ఎక్కడైనా సరే.. ఆమె పాటకు ‘నోట్ల వర్షం’ కురవాల్సిందే!

పాటలు అందరూ పాడతారు.. కానీ తమ గాన మాధుర్యంతో శ్రోతలను మరో లోకంలోకి తీసుకెళ్లేవారు అరుదుగా ఉంటారు. గుజరాతీ జానపద గాయని ఊర్వశి రాదాదియా ఇదే కోవకు చెందుతారు.

Updated : 16 Sep 2023 18:13 IST

(Photos: Instagram)

పాటలు అందరూ పాడతారు.. కానీ తమ గాన మాధుర్యంతో శ్రోతలను మరో లోకంలోకి తీసుకెళ్లేవారు అరుదుగా ఉంటారు. గుజరాతీ జానపద గాయని ఊర్వశి రాదాదియా ఇదే కోవకు చెందుతారు. ఆమె సంగీత విభావరి ఎక్కడ జరిగినా సరే.. అక్కడ ప్రేక్షకులు చప్పట్లతో కాదు.. కరెన్సీ నోట్లతో ఆమె గాత్రానికి నీరాజనాలు పడుతుంటారు. ఇటీవల ఏర్పాటుచేసిన ఓ సంగీత ప్రదర్శనలోనూ ఇదే పునరావృతమైంది. కచ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా.. హార్మోనియం వాయిస్తూ గీతాలాపన చేసిన ఊర్వశి గాత్ర మాధుర్యానికి ముగ్ధులైన సంగీత ప్రియులు.. ఆమెపై నోట్ల వర్షం కురిపించారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మరోసారి ఆమె సంగీత ప్రతిభ విశ్వవ్యాప్తమైంది. ఓ జానపద గాయనిగా దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ ప్రదర్శనలిస్తూ కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న ఈ ట్యాలెంటెడ్‌ సింగర్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం..

గుజరాత్‌లో పుట్టిన ఊర్వశి అహ్మదాబాద్‌లో పెరిగింది. మధురమైన గాత్రం ఆమెకు పుట్టుకతోనే వచ్చింది. ఇంట్లో తన తల్లిదండ్రులు పాడే గర్బా పాటలు, పెళ్లి పాటల్ని వింటూ పెరిగిన ఆమె.. తానూ వాళ్లను అనుకరిస్తూ చిన్న చిన్న పాటలు హమ్‌ చేస్తూ పాడేది. అవి విని ఇంట్లో వాళ్లు ఆమె ప్రతిభను ప్రశంసించేవారు. మరోవైపు స్కూల్లోనూ ప్రత్యేక సందర్భాల్లో స్టేజీపై పాటలు పాడేది.. పాటల పోటీల్లో పాల్గొన్న ప్రతిసారీ ప్రైజులు గెలుచుకునేది ఊర్వశి. అలా తన సొంత ట్యాలెంట్‌, అందరి ప్రోత్సాహంతో ఆరేళ్ల వయసు నుంచే సంగీతంపై దృష్టి పెట్టిందామె.

పోలీసు కావాలనుకొని..!

సంగీతంపై ఆసక్తి ఉన్నా.. భవిష్యత్తులో పోలీస్‌ ఆఫీసర్‌ కావాలని కలలు కంది ఊర్వశి. అయితే కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడంతో మనసు మార్చుకున్న ఆమె.. ఆపై సంగీతాన్నే తన కెరీర్‌గా ఎంచుకుంది. అయినా ఈ రంగంలో నిలదొక్కుకునే క్రమంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నానంటోందామె.

‘ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. ఆ కళను మనమే వెతికి పట్టుకోవాలి. దానికి సానపెట్టి నలుగురి ముందూ ప్రదర్శించాలి. అప్పుడే మనమేంటో నిరూపించుకోగలుగుతాం. సంగీతంపై మక్కువతో మూడేళ్ల వయసులోనే శాస్త్రీయ సంగీతంపై దృష్టి పెట్టాను. ఎక్కడా శిక్షణ తీసుకోలేదు.. సొంతంగానే ఎన్నో మెలకువలు నేర్చుకున్నా.. చిన్నవయసులోనే అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టా. ఈ క్రమంలో పలు సవాళ్లూ ఎదురయ్యాయి. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను. మొదట్లో ఎక్కువగా గర్బా ప్రోగ్రామ్స్‌ చేసేదాన్ని. ఆపై క్రమంగా స్టేజీ షోలు ఇవ్వడం, భజన కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించా..’ అంటోన్న ఊర్వశి.. మన ప్రతిభే ఎప్పటికైనా మనల్ని ప్రత్యేకంగా నిలబెడుతుందంటోంది.

జీ20 వేదిక పైనా.. పాడి!

కెరీర్ ఆరంభంలో ఒక్కో సంగీత ప్రదర్శనకు కేవలం రూ. ౫౦ మాత్రమే సంపాదించిన ఊర్వశి.. ఇప్పుడు లక్షల రూపాయలు తీసుకునే స్థాయికి ఎదిగింది. ఆమె పాడిన ‘కసుంబి నో రంగ్‌’, ‘నగర్‌ నంద్‌ జీ నా లాల్‌’, ‘ద్వారికా’, ‘భవ్‌ నా ఫెరా’.. వంటి జానపద, భక్తి పాటలు ఆమెకు విపరీతమైన పాపులారిటీని సంపాదించిపెట్టాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాదు.. వివిధ దేశాల్లోనూ సంగీత ప్రదర్శనలిస్తూ ముందుకు సాగుతోంది ఊర్వశి. అలా ఇప్పటివరకు కెనడా, ఇంగ్లండ్‌, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా.. వంటి దేశాల్లోనూ ఆమె సంగీత విభావరికి ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఇక ఇటీవలే భారత్‌లో జరిగిన ‘జీ20 సదస్సు’లోనూ సంగీత ప్రదర్శన చేసి.. ప్రముఖుల మన్ననలందుకున్నారీ ఫోక్‌ సింగర్‌. ఇందులో భాగంగా.. గాలా డిన్నర్‌ పార్టీలో ఏర్పాటుచేసిన పాటల కచేరీలో పాల్గొని తన గాన మాధుర్యంతో దేశాధినేతల్ని ఓలలాడించారామె. ఈ క్రమంలో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకోవడం మర్చిపోలేని అనుభూతి అంటున్నారీ జానపద గాయని.

ఎక్కడికెళ్లినా ‘నోట్ల’ వర్షమే!

వీనుల విందు చేసే పాటలతో, గాత్రంతో కట్టిపడేసే ఊర్వశి సంగీత ప్రదర్శన ఎక్కడ జరిగినా సరే.. లక్షలాది మంది ప్రేక్షకులు అక్కడ హాజరు కావాల్సిందే! భాష రాకపోయినా.. ఆమె మధురమైన గాత్రానికి ప్రేక్షకులు మైమరచిపోతారంటే అతిశయోక్తి కాదు.. ఇక ఇటు పాటను ఆస్వాదిస్తూనే.. అటు ఆమె సంగీత ప్రతిభపై నోట్ల వర్షం కురిపిస్తూ మరీ ఆమె ట్యాలెంట్‌ని ప్రశంసిస్తుంటారు సంగీత ప్రియులు. ఇప్పటికే పలు ప్రదర్శనల్లో ఆమెపై లక్షల కొద్దీ కరెన్సీ వర్షం కురిపించిన ప్రేక్షకులు.. ఇటీవలే మరో ప్రదర్శనలోనూ దీన్నే పునరావృతం చేశారు. కచ్‌లో గోశాల పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఏర్పాటుచేసిన సంగీత కచేరీలో.. ఆమె గాత్రానికి నోట్ల వర్షంతో నీరాజనాలు పట్టారు. ఇలా అభిమానులు తనపై కురిపించిన ప్రేమాభిమానాలకు మురిసిపోయిన ఈ గుజరాతీ సింగర్‌.. ‘మనీ రెయిన్‌’ అంటూ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. ఇలా తన గాత్ర ప్రతిభతో బోలెడన్ని పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న ఊర్వశి.. వివిధ సమాజ సేవా కార్యక్రమాల కోసం కూడా పలు ప్రదర్శనలు నిర్వహిస్తూ తన మంచి మనసును చాటుకుంటున్నారు.

గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతానికి చెందిన మరో జానపద గాయని గీతాబెన్‌ రబరీకీ విదేశీ గడ్డపై గతేడాది ఇలాంటి గౌరవమే దక్కింది. ఇదే గోశాల సంరక్షణ పనుల కోసం అమెరికాలో నిర్వహించిన ఓ కచేరీలో పాల్గొన్న ఆమెపై అక్కడి సంగీత ప్రియులు డాలర్ల వర్షం కురిపించారు. అప్పట్లో ఆ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్