Renu Dariyal: నా తొమ్మిదడుగుల వాలు జడ సీక్రెట్.. ఇదే!

8 అడుగుల 7 అంగుళాల పొడవు, నల్లటి ఒత్తైన జుట్టుతో సోషల్‌ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న రేణు హెయిర్‌ సీక్రెట్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

Published : 02 Aug 2023 12:53 IST

(Photos: Facebook)

నడుస్తుంటే నడుం మీద పడే వాలుజడంటే ఎంతోమందికి ఇష్టం! కానీ వివిధ కారణాల రీత్యా ఈ రోజుల్లో జుట్టు పెంచుకునే వారే కరువవుతున్నారు. విభిన్న హెయిర్‌స్టైల్స్‌ అంటూ పొట్టి జుట్టుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇలాంటి వారు రేణూ దరియాల్‌ జుట్టు చూస్తే అవాక్కవ్వాల్సిందే! ఎందుకంటే ఆమె జడ నడుస్తుంటే నడుం మీద పడడం కాదు.. ఏకంగా నేలనే ఊడ్చేస్తోంది. రికార్డుల మీద రికార్డులు సాధించి పెడుతూ.. ఆమెనో మినీ సెలబ్రిటీగా మార్చేసింది. ప్రస్తుతం 8 అడుగుల 7 అంగుళాల పొడవు, నల్లటి ఒత్తైన జుట్టుతో సోషల్‌ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న రేణు హెయిర్‌ సీక్రెట్‌ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..

ఎనిమిదేళ్ల నుంచి పెంచుతున్నా!

రేణు దరియాల్‌ది ఉత్తరాఖండ్‌లోని హల్దానీ నగరంలో కట్‌ఘరియా అనే ప్రాంతం. ఆమె భర్త ఆర్మీలో పని చేస్తుంటారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లల తల్లైన ఆమె.. ఇటు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. అటు తన అభిరుచుల పైనా దృష్టి పెడుతుంటుంది. రేణుకు చిన్నతనం నుంచి పొడవాటి జుట్టంటే ఇష్టం. అయితే ఇన్నాళ్లూ పెళ్లి, ఇల్లు, పిల్లల బాధ్యతలో తీరిక లేకుండా ఉన్న ఆమె.. తన జుట్టు సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేకపోయింది. కానీ 2015 నుంచి తన ఈ అభిరుచిపై పూర్తి దృష్టి సారించానని చెబుతోంది రేణు.

‘చిన్నతనం నుంచే నా జుట్టు కాస్త పొడవుగా ఉండేది. ఇది చూసి చాలామంది జుట్టుతోనే నీ అందం రెట్టింపైందనేవారు. నేను కూడా నా జుట్టు కత్తిరించుకోవడానికి ఇష్టపడకపోయేదాన్ని. అయితే పెళ్లై, ఇద్దరు పిల్లలు పుట్టే వరకు కేశ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. ఇక పిల్లలు పెద్దయ్యాక నాకూ నా అభిరుచులపై కాస్త సమయం వెచ్చించే అవకాశం దొరికింది. అందుకే గత ఎనిమిదేళ్లుగా నా కేశ సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా. ఇందుకు నా కుటుంబం కూడా నాకు పూర్తిగా సహకరిస్తోంది.. ప్రోత్సహిస్తోంది..’ అంటోందామె.

ఆ రెండూ ఉపయోగిస్తా!

ఇలా తన కేశ సౌందర్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోన్న రేణు జుట్టు పొడవు ఆమె ఎత్తునే మించిపోయింది. ప్రస్తుతం 8 అడుగుల 7 అంగుళాల పొడవున్న ఆమె జుట్టుకు సంబంధించిన ఫొటోల్ని తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటుంది.

‘మనల్ని అందంగా, ఫ్యాషనబుల్‌గా కనిపించేలా చేయడంలో మన జుట్టుదే కీలక పాత్ర. అయితే పొడవాటి జుట్టు కోసం బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి వివిధ రకాల హెయిర్‌కేర్‌ ట్రీట్‌మెంట్లు తీసుకుంటారు చాలామంది. కానీ ఆ అవసరం లేకుండానే.. ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే జుట్టును పొడవుగా, ఒత్తుగా పెంచుకోవచ్చు. నేనూ ఇదే చేస్తున్నా. నా జుట్టు సంరక్షణలో భాగంగా ఎలాంటి రసాయనిక ఉత్పత్తులు వాడను.. షాంపూలు అసలే ఉపయోగించను. ఉసిరి, కలబంద.. వంటి సహజసిద్ధమైన పదార్థాలతోనే జుట్టును శుభ్రం చేసుకుంటా. జుట్టు సంరక్షణ కోసం రోజూ గంట సమయం కేటాయిస్తా..’ అంటూ తన హెయిర్‌కేర్‌ సీక్రెట్స్‌ని పంచుకుంది రేణు.

అభిరుచులే అందలమెక్కిస్తాయి!

ఇలా తన పొడవాటి జుట్టుతో సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిన రేణు.. మరోవైపు రికార్డుల మీద రికార్డులూ సృష్టిస్తోంది. ఇప్పటికే ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘ఉత్తరాఖండ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘ఇండియా స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకుంది. అలాగే 2021లో ‘ఐకాన్ అవార్డ్ ఆఫ్ ది ఇయర్’నూ అందుకున్న రేణు లిమ్కా, గిన్నిస్ బుక్‌లలో చోటు దక్కించుకోవడమే తన తదుపరి లక్ష్యమంటోంది.

‘చాలామంది వివిధ కారణాల రీత్యా తమ అభిరుచులపై దృష్టి సారించరు.. కానీ నిజానికి ఇవే మనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడతాయి.. ఏదో ఒక రోజు మనల్ని అందలమెక్కిస్తాయి. నేనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ..!’ అంటోన్న రేణు తన జుట్టుతో పలు ఘనతల్ని అందుకోవడంతో పాటు.. డబ్బూ సంపాదిస్తోంది. ప్రస్తుతం యూట్యూబర్‌గానూ రాణిస్తోన్న రేణు.. ఈ వేదికగా తన పొడవాటి జుట్టు రహస్యాల్ని పంచుకుంటోంది. మరోవైపు జుట్టు సంరక్షణ చిట్కాల్నీ పంచుకుంటూ ఎంతోమందిని కేశ సంరక్షణ దిశగా ప్రోత్సహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్