వారి కోసం రూ. 2 కోట్ల ఇంటిని రాసిచ్చా!

విద్యార్థులతో అక్షరాలు దిద్దించిన ఆ చేతులతోనే.. సమాజాన్నీ సరిదిద్దాలనుకున్నారా టీచరమ్మ! కోట్ల రూపాయలు విలువ చేసే తన ఇంటిని సేవకోసం అవలీలగా దానం చేశారు. పేదలకైనా, అనాథలకైనా చివరి ప్రస్థానం గౌరవప్రదంగా సాగాలన్న సదుద్దేశంతో ధర్మస్థల్‌ని నిర్మించి సేవలో స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు గుర్రాల సరోజనమ్మ.

Updated : 09 Feb 2023 07:20 IST

విద్యార్థులతో అక్షరాలు దిద్దించిన ఆ చేతులతోనే.. సమాజాన్నీ సరిదిద్దాలనుకున్నారా టీచరమ్మ! కోట్ల రూపాయలు విలువ చేసే తన ఇంటిని సేవకోసం అవలీలగా దానం చేశారు. పేదలకైనా, అనాథలకైనా చివరి ప్రస్థానం గౌరవప్రదంగా సాగాలన్న సదుద్దేశంతో ధర్మస్థల్‌ని నిర్మించి సేవలో స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు గుర్రాల సరోజనమ్మ. తన సేవానుభవాన్ని వసుంధరతో పంచుకున్నారిలా..

మాది నిజామాబాద్‌ జిల్లా బోధన్‌. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉంటే.. మావారు వెంకట్రావు నిజాం షుగర్స్‌లో ఉద్యోగి. ఆర్థికంగా ఏ ఇబ్బందీ లేకున్నా మాకు పిల్లలు లేని లోటు ఉండేది.  దత్తత ప్రయత్నాలు చేసినా అవేమీ సాధ్యపడలేదు. పాతికేళ్ల క్రితమే రిటైర్‌ అయ్యాను. ఆ వచ్చిన డబ్బుతో ఓ ఇల్లు కొన్నా. పింఛన్‌ వచ్చేది. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన మరణించారు. అంతవరకూ తోబుట్టువుల పిల్లలే నా పిల్లలు అనుకున్నా. వాళ్లొచ్చినప్పుడు తెగ సంబరపడేదాన్ని. వాళ్లూ ప్రేమగా ఉండేవారు. కానీ ఆ ప్రేమలన్నీ.. నా ఆస్తి చుట్టూ తిరగడం నచ్చలేదు. ఇవన్నీ చూసి విసిగిపోయి.. ఇంటిని ఏదైనా సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నా. ఇలా ఆలోచిస్తుండగా మా ఉపాధ్యాయులు పడుతున్న బాధలే నన్ను కదిలించాయి. విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకి సొంత భవనం లేదని తెలుసుకున్నా. ఆ సంఘానికి ఇంటిని రాసిస్తే మున్ముందు ఎందరికో సేవలు అందుతాయని గట్టిగా నమ్మా. నా తర్వాత ఇల్లు సంఘానికి చెందేలా ఏడాదిన్నర కిందటే రిజిస్ట్రేషన్‌ చేయించా. ఆ ఇంటి విలువ ప్రస్తుతం రెండు కోట్ల రూపాయలు. ఇది తెలిశాక బంధువులు ఇటువైపు రావడమే మానేశారు.

ఆ అవమానం తప్పించాలని..  

ఓసారి దగ్గరి బంధువొకరు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లా. ఇంటికి కాస్త దూరంగా శవాన్ని ఉంచారు. ఏంటని ఆరా తీయగా.. ఆ ఇంటి యజమాని అనుమతించలేదని తెలిసింది. ఇంకోసారి పరిచయస్థులొకరు చనిపోతే.. వారుండే ఇంటికి దూరంలో అంత్యక్రియలకు కావాల్సిన పనులు చేస్తున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి ఈ బాధలు తప్పడం లేదని అర్థమైంది. ఈ పరిస్థితి అయినవాళ్లని బాధపెడుతుంది కదా! ఈ రెండు ఘటనలూ నన్ను ఆలోచింప చేశాయి. ఇందుకు పరిష్కారంగా వెలిసిందే.. ‘ధర్మస్థల్‌’. ఇందులో చనిపోయినవారి మృతదేహాన్ని అంత్యక్రియలు జరిగేవరకు భద్రపర్చుకోవచ్చు. ఫ్రీజర్‌ సహా అన్ని సదుపాయాలనూ ఇక్కడ ఉచితంగా అందిస్తాం. ఈ నిర్మాణం ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. ఇందుకోసం రూ.20 లక్షలు వెచ్చించా. చనిపోయాక మాట అటుంచితే... బతికున్న వాళ్ల ఆరోగ్యానికి భరోసా ఎవరు? అందుకే జిల్లా కేంద్రంలో మల్లు స్వరాజ్యం ట్రస్టు సభ్యులు ప్రారంభించిన జెనరిక్‌ మందుల దుకాణానికి నా వంతుగా రూ.2 లక్షలు విరాళమందించా. ఎటువంటి లాభాపేక్ష లేకుండా.. అసలు ధరకే మందుల్ని అందివ్వడం ఈ ట్రస్టు ఉద్దేశం. దీనివల్ల మధ్యతరగతి, పేదవారికి ఎంతో ప్రయోజనం. రెంజల్‌లోని కందకుర్తి గోదావరి ఒడ్డున గోశాల నిర్మాణానికీ విరాళం ఇచ్చా.

యువతకోసం నా వంతుగా..

ఒక టీచర్‌గా యువతని మంచి బాట పట్టించాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత కోసం ప్రభుత్వ గ్రంథాలయంలో రూ.20 వేల విలువైన పుస్తకాలను అందించా. ఏడాదికోసారి చింతకుంట వృద్ధాశ్రమానికి వెళ్తుంటా. అక్కడున్న వృద్థులకు నిత్యావసరాల్ని, దుస్తుల్ని అందిస్తుంటా. వీలుదొరికినప్పుడల్లా అవయవదానంపై ప్రచారం చేస్తున్నా. నా మరణానంతరం దేహాన్ని ప్రయోగాలకు వినియోగించాలని ఆమోదపత్రం రాసిచ్చా. మొదట్లో నాకెవరూ లేరునుకునేదాన్ని. ఇప్పుడు ఎంతోమంది ఆప్తులు దొరకడం.. వారిచేత ‘పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలిపించుకోవడం నా అదృష్టం.

- సి.హెచ్‌.జాన్సన్‌, బోధన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్