ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. ఇప్పుడా ప్రేమ లేదు..!

నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఒకబ్బాయిని ప్రేమించాను. ఆ తర్వాత అతనికి ఉద్యోగం రావడంతో వేరే ప్రాంతానికి వెళ్లాడు. అయినా ఫోన్ కాల్స్‌తో మా ప్రేమ కొనసాగింది. ఆ తర్వాత నాకు కూడా అదే ప్రాంతంలో ఉద్యోగం లభించింది.

Published : 29 Jan 2024 16:05 IST

నేను కాలేజీలో చదువుకునేటప్పుడు ఒకబ్బాయిని ప్రేమించాను. ఆ తర్వాత అతనికి ఉద్యోగం రావడంతో వేరే ప్రాంతానికి వెళ్లాడు. అయినా ఫోన్ కాల్స్‌తో మా ప్రేమ కొనసాగింది. ఆ తర్వాత నాకు కూడా అదే ప్రాంతంలో ఉద్యోగం లభించింది. అలా మా మధ్య ప్రేమ మరింత ముందుకు సాగింది. ఈ క్రమంలోనే ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మా పెళ్లై రెండేళ్లవుతోంది. కానీ, మా మధ్య పెళ్లికి ముందున్న ప్రేమ లేదు. ఎవరి పనిలో వారు బిజీగా గడుపుతున్నాం. ఇంటి దగ్గర ఉన్నప్పుడూ నా భర్త ఫోన్‌తోనే ఎక్కువ సమయం గడుపుతుంటాడు. నేను కూడా నచ్చిన పని చేసుకుంటున్నాను. దాంతో మా బంధం బలహీనమైనట్టుగా కనిపిస్తోంది. రిలేషన్‌షిప్‌లో ఇలాంటి పరిస్థితి సాధరణమేనా? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. సాధారణంగా పెళ్లైన కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరిపట్ల మరొకరికి ఆసక్తి తగ్గడం సహజం. అయితే అదే సమయంలో పిల్లలు, ఇతర బాధ్యతలు పెరగడంతో అది పెద్ద సమస్యగా అనిపించదు. కానీ, మీ మధ్య ఇంతకుముందు నుంచే పరిచయం ఉండడంతో రెండేళ్లకే మీకు ఇలాంటి అనుభవం ఎదురైనట్టుగా అనిపిస్తోంది. అయితే మీకు ఎప్పుడైతే ఇలాంటి భావన కలిగిందో దాన్ని ఎక్కువ కాలం కొనసాగించకుండా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో దంపతులుగా మీరిద్దరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.

దంపతుల మధ్య దాంపత్య బంధం నిత్యనూతనంగా ఉండాలి. ఇందుకోసం ప్రతి రోజు జరిగిన విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. అలాగే ఇంట్లో ఎవరి పని వారు కాకుండా కొన్ని పనులను ఇద్దరూ కలిసి చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరగకుండా ఉంటుంది. అలాగే మీ సమయాన్ని బట్టి ఇద్దరూ కలిసి డిన్నర్‌కు, విహార యాత్రలకు వెళ్లేలా ప్రణాళికలు వేసుకోండి. వీటితో పాటుగా ఇద్దరూ కలిసి చేసేట్టుగా కొన్ని హాబీలను జీవనశైలిలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

భార్యాభర్తలుగా మీరిద్దరి మధ్య బంధం దృఢమవ్వాలంటే ముందుగా ఇద్దరూ కలిసి స్నేహపూర్వక వాతావరణంలో మాట్లాడుకోవడం ఎంతో అవసరం. ఈ క్రమంలో ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకొంటూ ఏవైనా మనస్పర్థలు ఉంటే సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఇలా ఉంటే మీ బంధం తప్పకుండా దృఢంగా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్