వర్షాకాలంలో దుస్తుల రక్షణ ఇలా..

కొద్దిగా వర్షం పడితే చాలు.. ఉతికిన దుస్తులు ఆరకపోవడం మామూలే. అయితే కొంతమంది పూర్తిగా ఆరని దుస్తులనే మడతపెట్టి అల్మరాల్లో సర్దేస్తూ ఉంటారు. అలాగే నిత్యం కురిసే వర్షాలకు గోడలు తడిగా మారడం వల్ల ఒక్కోసారి వార్డ్‌రోబ్‌లోని దుస్తుల్లో కూడా చెమ్మ....

Published : 28 Jun 2022 19:24 IST

కొద్దిగా వర్షం పడితే చాలు.. ఉతికిన దుస్తులు ఆరకపోవడం మామూలే. అయితే కొంతమంది పూర్తిగా ఆరని దుస్తులనే మడతపెట్టి అల్మరాల్లో సర్దేస్తూ ఉంటారు. అలాగే నిత్యం కురిసే వర్షాలకు గోడలు తడిగా మారడం వల్ల ఒక్కోసారి వార్డ్‌రోబ్‌లోని దుస్తుల్లో కూడా చెమ్మ చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా దుస్తులు ముక్కవాసన రావడంతో పాటు వాటిలో ఫంగస్ చేరే అవకాశాలెక్కువ. మరి, ఇలాంటి దుస్తులను ధరించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే వర్షాకాలంలో దుస్తుల్లో ఫంగస్, బ్యాక్టీరియా లాంటివి చేరకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకుందాం...

అల్మరాల్లో అయితే..

వర్షం వల్ల గోడలు తడిగా అవడం వల్ల అల్మరాల్లోని దుస్తులన్నీ చెమ్మగా తయారవుతాయి. వీటిని బయటకు తీసి కాసేపు ఎండలో వేయడం వల్ల తడి ఆరిపోవడంతో పాటు బ్యాక్టీరియా ఏదైనా చేరితే అది నశిస్తుంది.

సిలికా జెల్ ప్యాకెట్లను అల్మరాల్లో ఉంచినట్లయితే అందులో తేమశాతం పెరగకుండా ఉంటుంది.

కప్‌బోర్డ్‌లో తక్కువ ఓల్టేజీ బల్బును ఏర్పాటు చేయాలి. ఆ బల్బును ఆన్ చేసినప్పుడు వచ్చే వేడికి దుస్తుల్లో ఫంగస్ చేరకుండా ఉంటుంది.

అల్మరాల్లో నాఫ్తలిన్ గోళీలు ఉంచడం ద్వారా ఫంగస్, బ్యాక్టీరియాతో పాటుగా పురుగుల నుంచి కూడా దుస్తులను కాపాడుకోవచ్చు.

అల్మరాల్లో వేపాకులు, లవంగాలు ఉంచినా దుస్తుల్లో ఫంగస్ చేరకుండా ఉంటుంది.

ఉతికే సమయంలో..

అల్మరాల్లో దాచిన దుస్తుల విషయంలోనే కాదు, వాటిని ఉతికే సమయంలోనూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

కప్పు డైల్యూటెడ్ వెనిగర్‌ని బకెట్ నీటిలో కలిపి దానిలో ఉతికిన దుస్తులను కొంత సమయం ఉంచి తర్వాత ఆరేయాలి. వెనిగర్ క్రిమి సంహారిణిగా పనిచేసి దుస్తులలోని ఫంగస్, బ్యాక్టీరియాను సంహరిస్తుంది.

దుస్తులను ఉతికిన తర్వాత ఫ్యాబ్రిక్ కండిషనర్‌లో కాసేపు ఉంచి ఆ తర్వాత ఆరబెట్టడం ద్వారా దుర్వాసన రాకుండా కాపాడుకోవడంతో పాటు వాటిలోకి బ్యాక్టీరియా చేరకుండా జాగ్రత్తపడచ్చు.

కొన్ని సందర్భాల్లో విడవకుండా వర్షం కురుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఉతికిన దుస్తులు సరిగ్గా ఆరవు. అలాంటి వాటిని కూడా కొంతమంది మడతపెట్టి అల్మరాల్లో పెడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల దుస్తులు ముక్క వాసన రావడంతో పాటు వాటిలో బ్యాక్టీరియా చేరుతుంది. అందుకే వాటిని మళ్లీ ఉతకడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్