మొహాన్ని మెరిపించే ఫేస్ పీల్స్..!
చర్మం ప్రకాశవంతంగా మారడానికి.. ముఖవర్ఛస్సు మరింతగా ఇనుమడించడానికి ఫేషియల్స్ వేసుకోవడం సహజం. అయితే వాటితో పాటు అప్పుడప్పుడూ ఫేస్ పీల్స్ కూడా వేసుకుంటూ ఉండాలి. అయితే ఫేస్ పీల్స్ అనగానే.. పార్లర్‌కే వెళ్లక్కర్లేదు. ఇంట్లో లభ్యమయ్యే....
చర్మం ప్రకాశవంతంగా మారడానికి.. ముఖవర్ఛస్సు మరింతగా ఇనుమడించడానికి ఫేషియల్స్ వేసుకోవడం సహజం. అయితే వాటితో పాటు అప్పుడప్పుడూ ఫేస్ పీల్స్ కూడా వేసుకుంటూ ఉండాలి. అయితే ఫేస్ పీల్స్ అనగానే.. పార్లర్‌కే వెళ్లక్కర్లేదు. ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలను ఉపయోగించే అద్భుతమైన ఫేస్ పీల్స్ తయారుచేసుకుని, ముఖానికి వేసుకోవచ్చు. మరి, ఆ పదార్థాలేంటి?
కీరాదోస
అరకప్పు కీరాదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉన్న కీరాదోస పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించడంతో పాటు ముడతలు, సన్నని గీతలు వంటివి కూడా తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.
పైనాపిల్ + బొప్పాయి
అరకప్పు పైనాపిల్ ముక్కలు, పావు కప్పు బొప్పాయి ముక్కలు తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. తర్వాత అందులో అరచెంచా ఆర్గానిక్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ఓసారి, చల్లని నీటితో మరోసారి ముఖాన్ని శుభ్రం చేసుకుని పొడివస్త్రంతో తుడుచుకోవాలి.
ఓట్స్‌తో..
పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కలపాలి. మిశ్రమం కాస్త చల్లబడిన తర్వాత బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత మైల్డ్ క్లెన్సర్ ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్‌హెడ్స్ సులభంగా తొలగిపోతాయి.
అవకాడోతో..
బాగా గిలక్కొట్టిన కోడిగుడ్డులోని తెల్లసొనలో మెత్తగా చేసుకున్న అరచెంచా అవకాడో, రెండు చెంచాల తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. 20 నిమిషాలు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మంలోని తేమని అధిక సమయం నిలిపి ఉంచడానికి బాగా తోడ్పడుతుంది.
ఫేస్ పీల్స్ వేసుకున్న తర్వాత ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ లోషన్ విధిగా రాసుకోవాలి. లేదంటే ట్యాన్ సమస్య బారిన పడే అవకాశాలు ఎక్కువ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.