ముఖం పైన అలా కనిపిస్తుంటే..!

వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో అతివల్ని ఎన్నో సౌందర్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అలాంటి వాటిలో చర్మ రంధ్రాలు పెద్దవిగా కనిపించడం కూడా ఒకటి. మనం ఉపయోగించే మేకప్‌లో ఉండే రసాయన పదార్థాలు, జిడ్డుదనం, సూర్యరశ్మి ప్రభావం, మొటిమలు.. వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు.

Published : 08 Feb 2024 12:56 IST

వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో అతివల్ని ఎన్నో సౌందర్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అలాంటి వాటిలో చర్మ రంధ్రాలు పెద్దవిగా కనిపించడం కూడా ఒకటి. మనం ఉపయోగించే మేకప్‌లో ఉండే రసాయన పదార్థాలు, జిడ్డుదనం, సూర్యరశ్మి ప్రభావం, మొటిమలు.. వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. అయితే ఇలా చర్మ రంధ్రాలు పెద్దవవడం వల్ల ముఖ చర్మం పైన చిన్న చిన్న గుంతల్లాగా కనిపించడం, వయసు పైబడిన ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపించడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలన్నీ కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. అయితే వీటి పరిమాణాన్ని తగ్గించడం అసాధ్యమని, కాకపోతే వీటిని కనిపించకుండా చేసి నవయవ్వనంగా మెరిసిపోయేందుకు పలు సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, అవేంటో తెలుసుకుందాం రండి..

రోజుకు రెండుసార్లు..

ముఖ చర్మంపై ఏర్పడిన పెద్ద పెద్ద రంధ్రాలు కనిపించకుండా జాగ్రత్తపడాలంటే రోజుకు రెండుసార్లైనా ముఖాన్ని శుభ్రం చేసుకోవడం, ముఖంపై పొలుసుల్లా మారిన చర్మాన్ని తొలగించుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో చర్మ రంధ్రాల్లో చేరిన దుమ్ము-ధూళి, జిడ్డుదనం, ఇతర వ్యర్థాలు తొలగిపోతాయి. ఫలితంగా మృతకణాలు రాకుండా జాగ్రత్తపడచ్చు. ఇందుకోసం నిమ్మరసం, గులాబీ నీళ్లు సమపాళ్లలో తీసుకొని మిశ్రమం తయారుచేసుకోవాలి. దీంతో రోజుకు రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసం జిడ్డుదనాన్ని తగ్గిస్తుంది. గులాబీ నీళ్లు చర్మానికి పోషణను అందిస్తాయి.

మృతకణాలు తొలగించుకోవాల్సిందే!

ముఖ చర్మంపై ఏర్పడిన రంధ్రాల్ని కనిపించకుండా చేయాలంటే వారానికి రెండుసార్లు మృతకణాల్ని తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రెండు టీస్పూన్ల చక్కెర లేదా బ్రౌన్‌ షుగర్‌లో సరిపడినంత ఆలివ్‌ నూనె వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా పది నిమిషాలయ్యాక గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది. అలాగే కాఫీ స్క్రబ్‌, ఓట్‌మీల్‌ స్క్రబ్.. వంటివి కూడా ఇందుకోసం వాడచ్చు.

తేమనందించండిలా!

జిడ్డు చర్మతత్వం ఉన్న వారు ప్రత్యేకించి మాయిశ్చరైజర్‌ రాసుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు. కానీ చర్మ రంధ్రాలు కనిపించకుండా చేయాలంటే ఏ చర్మతత్వం ఉన్న వారైనా సరే.. మాయిశ్చరైజర్‌ అప్లై చేసుకోవాల్సిందే! ఈ క్రమంలో కలబంద గుజ్జును ముఖానికి పట్టించి నెమ్మదిగా, మృదువుగా మర్దన చేయాలి. ఫలితంగా ముఖ చర్మంపై పేరుకున్న అధిక జిడ్డు తొలగిపోయి తాజాగా మారుతుంది. అలాగే ముఖానికి మెరుపూ వస్తుంది. ఇలా తరచూ చేయడం వల్ల క్రమంగా చర్మంపై ఏర్పడిన రంధ్రాలు కనిపించకుండా నవయవ్వనమైన చర్మం సొంతమవుతుంది.

బిగుతైన చర్మానికి..!

చర్మం వదులుగా ఉండడం వల్ల ముడతలు పడడం, గుంతలు ఏర్పడడం వంటివి మనకు అనుభవమే. అందుకే చర్మాన్ని బిగుతుగా మార్చుకుంటే నవయవ్వనంతో మెరిసిపోవచ్చు.. అలాగే చర్మ రంధ్రాలు కనిపించకుండా కూడా జాగ్రత్తపడచ్చు. ఇందుకోసం ఐస్‌ ముక్కతో ముఖంపై రుద్దాలి. ఇలా తరచూ చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచడంలో సహకరిస్తుంది.

ఇవి కూడా!

చర్మం పీహెచ్‌ స్థాయుల్ని క్రమబద్ధీకరించడం వల్ల కూడా చర్మ రంధ్రాలు కనిపించకుండా జాగ్రత్తపడచ్చు. ఇందుకోసం యాపిల్ సైడర్ వెనిగర్‌, నీళ్లు.. రెండింటినీ సమపాళ్లలో తీసుకొని కాటన్ బాల్‌ సహాయంతో ముఖానికి రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

చర్మ రంధ్రాలను కనిపించకుండా చేయడంతో పాటు జిడ్డుదనాన్ని తగ్గించడానికి, మొటిమల్ని నివారించడానికి కోడిగుడ్డులోని తెల్లసొన చక్కగా పనిచేస్తుంది. ఇందుకోసం గుడ్డులోని తెల్లసొనను బాగా గిలక్కొట్టి ముఖానికి పట్టించాలి. ఆపై టిష్యూ పేపర్‌్ుని దానిపై నుంచి పరవాలి. ఆరిపోయిన తర్వాత పేపర్స్‌ని తొలగించేస్తే సరిపోతుంది.

అర టేబుల్‌స్పూన్‌ పసుపు, రెండు టీస్పూన్ల ముల్తానీ మట్టిలో రోజ్‌ వాటర్‌ కలుపుతూ పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి.

కొన్ని వేపాకుల్ని నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీటిని వేరుచేసి అందులో కొద్దిగా ముల్తానీ మట్టి వేసి ప్యాక్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంతో ఫేస్‌ప్యాక్‌ వేసుకొని ఆరాక కడిగేసుకుంటే చర్మ రంధ్రాలు కనిపించకుండా ఉండడమే కాదు.. మొటిమలు, మచ్చలకు కూడా చెక్‌ పెట్టచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్