Nayan-Vignesh: నిన్ననే పెళ్లైనట్లుంది!
తొలి వివాహ వార్షికోత్సవం ఏ జంటకైనా ప్రత్యేకమే! ఇక తమ సంతానంతో కలిసి జరుపుకోవడం ఆ వేడుకకు మరింత ఆనందాన్ని తీసుకొస్తుంది. సెలబ్రిటీ స్వీట్ కపుల్ నయనతార-విఘ్నేష్ శివన్ ప్రస్తుతం ఇలాంటి ఆనందంలోనే....
(Photos: Instagram)
తొలి వివాహ వార్షికోత్సవం ఏ జంటకైనా ప్రత్యేకమే! ఇక తమ సంతానంతో కలిసి జరుపుకోవడం ఆ వేడుకకు మరింత ఆనందాన్ని తీసుకొస్తుంది. సెలబ్రిటీ స్వీట్ కపుల్ నయనతార-విఘ్నేష్ శివన్ ప్రస్తుతం ఇలాంటి ఆనందంలోనే మునిగితేలుతున్నారు. సరిగ్గా ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట.. తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని తమ కవల పిల్లలతో కలిసి జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన ముద్దుల భార్యను ఉద్దేశిస్తూ విఘ్నేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అలాగే నయన్ తన పిల్లలతో దిగిన ఫొటోలను ట్విటర్‌లో పంచుకుంటూ ‘వీళ్లే నా ప్రపంచం’ అని పేర్కొంది. ఇలా తమ ఏడాది దాంపత్య బంధాన్ని నెమరువేసుకుంటూ పెట్టిన ఈ ఫొటోలు, పోస్టులు వారి ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.
దక్షిణాదిన మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరుగాంచారు నయనతార-విఘ్నేష్ శివన్. తమ ఏడేళ్ల ప్రేమాయణాన్ని గతేడాది జూన్ 9న ఏడడుగులతో శాశ్వతం చేసుకుందీ జంట. ఆపై నాలుగు నెలల అనంతరం.. అక్టోబర్‌లో తాము కవల అబ్బాయిలకు జన్మనిచ్చామని సోషల్ మీడియాలో ప్రకటించిందీ ముద్దుల జంట. సరోగసీ విధానంలో పుట్టిన ఈ చిన్నారులిద్దరికీ.. ఉయిర్, ఉలగమ్ అని నామకరణం చేశారు.
ప్రేమ సూత్రం.. ఓ అద్భుతం!
ఈ ఏడాది కాలంలో తమ జీవితాల్లోని ప్రత్యేక సందర్భాల్ని, మధుర జ్ఞాపకాల్ని.. సోషల్ మీడియాలో పంచుకుంటూ ఈ తరం జంటలకు ప్రేమ పాఠాలు నేర్పిన ఈ జంట.. నేడు తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భంగా తన ముద్దుల భార్యపై తనకున్న ప్రేమను సోషల్ మీడియా పోస్ట్ రూపంలో మరోసారి చాటుకున్నాడు విఘ్నేష్.
‘సడెన్‌గా నా స్నేహితులు నాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతుంటే.. పెళ్లై అప్పుడే ఏడాదైందా అనిపించింది. నిజానికి నిన్ననే పెళ్లైన భావన కలుగుతోంది. అసలైన ప్రేమంటే ఇదే మరి..! తెలియకుండానే రోజులు క్షణాల్లా గడిచిపోతాయి. లవ్యూ బంగారం! నీ జతలో ఈ ఏడాదంతా ఎన్నో మధురానుభూతులు పొందాను. మరోవైపు అనేక ఎత్తుపల్లాలు, అనుకోని ఒడిదొడుకులు, పరీక్షలూ ఎదురయ్యాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఇంటికి చేరుకొని నిన్ను, మన పిల్లల్ని చూశాక.. ఆ ఒత్తిళ్లన్నీ మటుమాయ్యేవి.. మనసు ప్రేమతో, ఆత్మవిశ్వాసంతో నిండిపోయేది. ఇకపైనా ప్రతి అడుగునూ కలిసే వేద్దాం.. ప్రతి సవాలునూ కలిసే ఎదుర్కొందాం.. మన పిల్లలిద్దరికీ ఉన్నత భవిష్యత్తును అందిద్దాం..!’ అంటూ తన మనసులోని భావాల్ని అక్షరీకరించాడీ మిస్టర్ పర్‌ఫెక్ట్.
ఇలా తాను పెట్టిన పోస్ట్‌కు తన భార్యతో దిగిన ఫొటోలు, పిల్లల ఫొటోల్నీ జత చేశాడు విఘ్నేష్. అలాగే ఈ సందర్భంగా నయన్ సైతం ‘వీళ్లే నా ప్రపంచం’ అంటూ తన పిల్లలతో దిగిన ఫొటోలను పంచుకుంది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరి, ఈ ముద్దుల జంట ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే కొన్ని ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.